- రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 9 కొత్త మైన్స్ ఏర్పాటుకు సన్నాహాలు
- 20 ఏళ్ల పాటు 600 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
- కేంద్రం అనుమతుల కోసం సంప్రదింపులు
- ఈ ఏడాది మూడు కొత్త మైన్ల ఏర్పాటుకు చర్యలు
కోల్‌బెల్ట్ ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తిని కొనసాగించేందుకు సింగరేణి సంస్థ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. పూర్తిగా బొగ్గు వెలికితీయలేని పాత అండర్‌గ్రౌండ్ గనులను ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులుగా విస్తరించి మిగిలిన నిల్వలను వెలికితీయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్తగా తొమ్మిది బొగ్గు గనులను అభివృద్ధి చేసి వచ్చే 20 ఏళ్ల పాటు ఉత్పత్తిని కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే మూడు గనుల్లో ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
కోల్‌బెల్ట్, వెలుగు: దేశంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త గనుల ప్రారంభానికి సింగరేణి సిద్ధమవుతోంది. భూసేకరణ అవసరం లేకుండా ప్రాజెక్టులను రూపొందించడం వల్ల 20 ఏళ్ల పాటు సింగరేణితో ఇంధన ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు భరోసా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
సింగరేణి ప్రతి ఏడాది బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు 44 అండర్‌గ్రౌండ్ గనులు ఉండగా, ప్రస్తుతం అవి 21కు తగ్గాయి. మూతపడిన గనుల్లో మిగిలిన బొగ్గు నిల్వలను వెలికితీయడానికి భారీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మూడు అండర్‌గ్రౌండ్ గనులు, రెండు ఓపెన్‌కాస్ట్ విస్తరణలను కలిపి రామగుండం బొగ్గు గనిగా అభివృద్ధి చేసేందుకు అనుమతులు లభించాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 314.98 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే కొత్తగూడెం ప్రాంతంలోని గౌతమిఖని ఓపెన్‌కాస్ట్, మణుగూరు ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో కూడా ఉత్పత్తి పెంపునకు చర్యలు కొనసాగుతున్నాయి.
తొమ్మిది గనులు ఎక్కడంటే..
రానున్న ఐదేళ్లలో మరో పది గనులు మూతపడే పరిస్థితి ఉంది. దీంతో సుమారు 189.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండగా, 6,275 మంది ఉద్యోగులు మిగిలిపోతారు. వీరిని ఇతర గనుల్లో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. కిష్టారం, కోయగూడెం, పీకే, ఖైరీగూరా ఓపెన్‌కాస్ట్‌లు, అలాగే కేకే–5, కేటీకే–6, శ్రీరాంపూర్–1, పీకే–5 అండర్‌గ్రౌండ్ గనులు మూతపడనున్నాయి.
వీటిలో 2027–28 నాటికి నాలుగు పాత గనులు పూర్తిగా మూతపడే అవకాశం ఉంది. దీంతో ప్రతి సంవత్సరం సుమారు 12.51 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గనుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా తొమ్మిది గనులను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
రామగుండం–3 ప్రాంతంలో 181.60 మిలియన్ టన్నుల నిల్వలున్న రామగుండం ఓపెన్‌కాస్ట్–1, కొత్తగూడెం ప్రాంతంలో 190 మిలియన్ టన్నుల నిల్వలున్న వీకే బొగ్గు గని, మణుగూరు ప్రాంతంలో 62 మిలియన్ టన్నుల నిల్వలున్న పీకే బొగ్గు గని(కొండాపూర్), 40 మిలియన్ టన్నుల నిల్వలతో మణుగూరు ఓపెన్‌కాస్ట్ విస్తరణ, బెల్లంపల్లి ప్రాంతంలో గోలేటీ, మహావీర్ ఓపెన్‌కాస్ట్‌లు, మందమర్రి ప్రాంతంలో రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ రెండో దశ, ఇల్లందు ప్రాంతంలో జేకే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నారు.
ఇవన్నీ కలిపి సుమారు 600 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వచ్చే 20 ఏళ్లలో వెలికితీయాలని ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 17 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు కొనసాగుతుండగా, ఈ ఏడాదిలో మూడు కొత్త గనులు ప్రారంభమైతే మొత్తం 20 ఓపెన్‌కాస్ట్‌ల నుంచి బొగ్గు ఉత్పత్తి జరగనుంది.
కేంద్రం అనుమతుల కోసం చర్చలు..
కొత్తగా ప్రతిపాదించిన తొమ్మిది ప్రాజెక్టులకు కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ శాఖల అనుమతులు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. మందమర్రి ప్రాంతంలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ రెండో దశ ప్రాజెక్టుకు అటవీ అనుమతి కోసం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులతో జరుపుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయి.
త్వరలోనే అనుమతులు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే పబ్లిక్ హియరింగ్ పూర్తికాగా, ఓవర్ బర్డెన్ టెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కొత్తగూడెం ప్రాంతంలోని కీలకమైన వీకే బొగ్గు గనికి దాదాపు అన్ని అనుమతులు లభించాయి. అక్కడ ఓవర్‌బర్డెన్ తొలగింపు పనులు కూడా ప్రారంభమయ్యాయి. గోలేటీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ కూడా పూర్తయింది. భవిష్యత్తులో సింగరేణి అభివృద్ధి ప్రధానంగా విస్తరణ ప్రాజెక్టులపైనే ఆధారపడనుంది.
ఉపాధి అవకాశాలు..
కొత్త ప్రాజెక్టులు ప్రారంభమైతే బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణిలో 2 వేల మందికి పైగా కార్మికులు అదనంగా ఉన్నారని చెబుతూ కారుణ్య నియామకాలను వాయిదా వేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత అక్టోబర్ నుంచి ఈ నియామకాలు నిలిచిపోవడంతో సుమారు 350 మందికి పైగా కార్మికుల వారసులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.
కొత్తగా తొమ్మిది ప్రాజెక్టులు ప్రారంభమైతే వీరికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరోక్షంగా స్థానికంగా వేలాది మందికి ఉపాధి దక్కనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే బొగ్గు బ్లాక్ వేలాల్లో పాల్గొనేందుకు కూడా సింగరేణిని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. గతంలో వేలాల్లో పాల్గొనకపోవడంతో సింగరేణి పరిధిలోని రెండు గనులు ప్రైవేటు సంస్థలకు దక్కాయి. ఈ పరిస్థితి మళ్లీ రాకుండా భవిష్యత్తులో వేలంలో సంస్థ పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నారు.
