బిజినెస్ డెస్క్, వెలుగు: చెన్నై బేస్డ్ వీఎఫ్‌ఎక్స్ కంపెనీ రూ.66 కోట్లు సేకరించేందుకు ఎస్‌ఎంఈ (స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్) ఐపీఓకి వచ్చి ఏకంగా రూ.14 వేల కోట్ల విలువైన బిడ్స్ దక్కించుకుంది. కంపెనీ ఐపీఓ 286 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది. బాసిలిక్ ఫ్లై స్టూడియో ఎస్‌ఎంఈ ఐపీఓకి ఇన్వెస్టర్ల నుంచి ఫుల్ డిమాండ్ కనిపించింది. కేవలం ఈ ఒక్క కంపెనీయే కాదు ఈ మధ్య కాలంలో ఎస్‌ఎంఈ ఐపీఓకి వచ్చిన చాలా చిన్న కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. సాధారణంగా చిన్న కంపెనీలే ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో ఐపీఓకి వస్తాయి. ఈ కంపెనీలు సేకరించే ఫండ్స్ రూ. 100 కోట్ల లోపు ఉంటాయి. ఒక లాట్ కొనడానికి కనీసం రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
అయినప్పటికీ కొన్ని ఎస్‌ఎంఈ ఐపీఓల కోసం రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఎగబడ్డారు. ఈ ఏడాది ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన చిన్న కంపెనీలు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఉదాహరణకు కిందటి వారం మూడు కంపెనీలు శూర డిజైన్స్, సన్‌గార్నర్ ఎనర్జీస్, బొండాడ ఇంజినీరింగ్ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో లిస్టింగ్ అయ్యాయి. ఈ మూడు కంపెనీలు కూడా ఇన్వెస్టర్ల సంపదను ఒకే రోజులో డబుల్ చేశాయి. సన్‌గార్నర్ షేర్లయితే లిస్టింగ్ రోజే 200 శాతం రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ ఐపీఓ 152 రెట్లు సబ్‌స్క్రయిబ్ అవ్వగా, బొండాడ ఇంజినీరింగ్ ఐపీఓ 106 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది.
పెద్ద ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోంది
ఎస్‌ఎంఈ ఐపీఓల్లో యాంకర్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ పెరిగిందని, అందుకే మిగిలిన ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి ఎస్‌ఎంఈ ఐపీఓలతో వీలుంటుందని, మెయిన్ ఐపీఓల్లో ఇది కుదరకపోవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ ఎండీ సునిల్ నైతి పేర్కొన్నారు. యాంకర్ ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేస్తుండడంతో పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించడానికి మిగిలిన ఇన్వెస్టర్లు భయపడడం లేదని చెప్పారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ డెవలప్ అవుతోంది. ఇన్నోవేటివ్ బిజినెస్‌లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు వెనకడగు వేయడం లేదు. కొన్ని ఎస్‌ఎంఈ ఐపీఓల్లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల (క్యూఐబీ) పోర్షన్‌కు భారీగా రెస్పాన్స్ వస్తోందని, దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారని హెమ్ సెక్యూరిటీస్ జైన్ అన్నారు.
మెయిన్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయిన 25 శాతం చిన్న కంపెనీలతో పోలిస్తే ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయిన కంపెనీల ఆస్తులపై రిటర్న్స్, ఆస్తుల వాడకం, ప్రాఫిటిబిలిటీ రేషియో మెరుగ్గా ఉన్నాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ నైతి వివరించారు. ఎస్‌ఎంఈ కంపెనీ బాగా డిమాండ్ ఉన్న సెక్టార్ నుంచి వస్తే ఇటువంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు జనాలు ఎగబడుతున్నారని, బాసిలిక్ ఫ్లై స్టూడియోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని ప్రాఫిట్‌మార్ట్ సెక్యూరిటీస్ అవినాష్ గోరక్షకర్ అన్నారు. ఎస్‌ఎంఈ ఐపీఓలపై ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగిందని, కంపెనీల ఫండమెంటల్స్, ప్రైసింగ్ బాగుంటే ఇదే ట్రెండ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే బాగుంటాయని, పెర్ఫార్మెన్స్ లో చాలా కంపెనీలు చెత్త అని అన్నారు.
కళ్లు చెదిరే లాభాలు..
శ్రీవారి స్పైసెస్, డ్రోన్ డెస్టినేషన్, ఓరియాన పవర్ వంటి ఎస్‌ఎంఈ ఐపీఓలు కూడా ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ కంపెనీల ఐపీఓలు 100 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించాయి. రూ.9 కోట్లు సేకరించేందుకు ఎస్‌ఎంఈ ఐపీఓకి వచ్చిన హైదరాబాద్ కంపెనీ శ్రీవారి స్పైసెస్ 450 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. రూ.59 కోట్ల ఓరియాన పవర్ ఐపీఓ 176 రెట్లు సబ్‌స్క్రిప్షన్ సాధించింది. మొత్తంగా ఈ ఏడాది 100 స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజ్‌లు ఎస్‌ఎంఈ ఐపీఓకి వచ్చి రూ.2,600 కోట్లను సేకరించాయి. 2018 లో 141 చిన్న కంపెనీలు రూ. 2,287 కోట్లను సేకరించాయి. మెయిన్ ఐపీఓలు కూడా ఈ ఏడాది మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. ఎస్ఎంఈ ఐపీఓలో కొన్ని రిస్క్ లు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గడం లేదు.
సాధారణంగా ఈ టైప్ ఐపీఓలకు వచ్చిన కంపెనీలు కొన్ని డిస్‌క్లోజర్స్(కంపెనీ వివరాలను బయటపెట్టడం) మాత్రమే చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. లిస్టింగ్ రోజు భారీగా లాభాలు వస్తుండడంతోనే ఇన్వెస్టర్లు ఎస్‌ఎంఈ ఐపీఓల వైపు చూస్తున్నారని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. ‘తక్కువ టైమ్‌లోనే భారీగా రిటర్న్స్ వస్తుండడం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. అందుకే ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌పై ఆసక్తి పెరుగుతోంది’ అని హెమ్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ ఆస్తా జైన్ అన్నారు. ఈ ఏడాది ఎస్‌ఎంఈ ఐపీఓకి వచ్చిన వాటిలో 26 కంపెనీలు లిస్టింగ్ రోజు నుంచి ఇప్పటి వరకు 100 శాతం రిటర్న్ ఇచ్చాయి. కేవలం ఎనిమిది కంపెనీల షేర్లు మాత్రమే తమ ఇష్యూ ధర కంటే తక్కువకు ట్రేడవుతున్నాయి.
