బిగ్‌‌బాస్ కు ఎందుకింత క్రేజ్‌ అంటే?

బిగ్‌‌బాస్ కు ఎందుకింత క్రేజ్‌ అంటే?

వందల కాన్సెప్ట్స్‌‌‌‌తో వచ్చే ఎన్నో రియాలిటీ షోలకంటే బిగ్‌‌‌‌బాస్ మీద జనాలకి ఇంత క్రేజ్ ఎందుకు? హాలీవుడ్ లో మొదలైన ఈ కాన్సెప్ట్ మన దేశంలో బాలీవుడ్ నుంచి ఇప్పుడు లోకల్‌‌‌‌గా అన్ని భాషల్లోనూ అదే హైప్ ఎలా తెచ్చుకోగలుగుతోంది?  ‘నిజానికి ఈ షో మనుషుల్లో ఉండే రకరకాల సైకాలజీలని స్టడీ చేసే ఒక ల్యాబరేటరీ’ అంటూ తమిళ  బిగ్‌‌‌‌బాస్ సీజన్ –1 టైంలోనే కమల్ హసన్ ఒక ఫ్రొఫెసర్ మాటలని గుర్తు చేశాడు. అయితే ‘సైకాలజీ స్టడీ చేసే ల్యాబ్ వేరు. మనుషుల సైకలాజికల్ పాయింట్స్‌‌‌‌ని ప్రభావితం చేసేలా బంధించి దాన్ని వ్యాపారం చేయటం వేరు’ అనే వాళ్లున్నారు. అయితే ఈ అభిప్రాయాలన్నింటితోనూ సంబంధం లేనట్టు అన్ని భాషల్లోనూ ప్రతీ సీజన్ మంచి హైప్ తోనే నడుస్తోంది. మీడియా చానెల్స్, వెబ్‌సైట్స్ ప్రత్యేకంగా బిగ్‌‌‌‌బాస్ కోసం ఒక కాలం నడిపేంత క్రేజ్ ఈ షో సొంతం.

బిగ్‌‌‌‌బాస్ షో జన్మస్థానం నెదర్లాండ్స్. డచ్ మీడియా కంపెనీ అధినేత జాన్ డీ మోల్ జూనియర్ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో కాన్సెప్ట్‌‌‌‌ని కనిపెట్టాడు.  అప్పట్లో ఈ షో ‘బిగ్ బ్రదర్’ పేరుతో 1999లో మొదటిసారిగా ప్రసారం అయ్యింది. సెలెబ్రిటీల జీవితాలు, వ్యక్తిత్వాలు, వేష భాషలు, ప్రవర్తన దగ్గరగా చూపించే ఈ బిగ్ బ్రదర్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ అయ్యింది. సెలబ్రిటీలని మామూలుగా ఉన్నప్పుడు చూసే అవకాశం రావటంతో జనాలు ఎగబడి చూశారు. ఈ కాన్సెప్ట్ ని దాదాపు 54 దేశాలు జాన్ డీ మోల్ జూనియర్ నుంచి కొనేశాయి. కారణం ఊహించలేనిదేమీ కాదు. ఈ షో ఎలా అయినా జనాలని అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువ టీఆర్పీలని తెస్తుంది. సో…! అడ్వర్టైజ్‌‌‌‌మెంట్ వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఆ లాభాలతో పోల్చుకుంటే సెలబ్రిటీలకు ఇచ్చే రెమ్యునరేషన్లు ఒకలెక్కలోకి కూడా రావు. ఇందుకే ప్రమోషన్ ఆ లెవెల్లో ఉంటుంది. హోస్ట్‌‌‌‌గా టాప్ స్టార్స్ ని తీసుకునే దగ్గరినుంచే బిగ్‌‌‌‌బాస్ షో లో ‘ఆట మొదలవుతుంది’ 

లాభం ఎవరికి?

బిగ్‌‌‌‌బాస్ మొదలైందంటే కేవలం ఆ షో ప్రొడ్యూసర్స్, టీవీ వాళ్లకి మాత్రమే లాభం అనుకుంటే పొరపాటే. సోషల్ మీడియాలోనూ, టీవీ, యూట్యూబ్‌‌‌‌లలోనూ చాలా వ్యాపారమే జరుగుతుంది. మీమర్స్, ఫ్యాన్ సపోర్ట్ పేజీలూ, పెయిడ్ ఓటింగ్స్ ఇలా చాలానే దందాలు నడుస్తుంటాయి. ఇంకా ‘ఎవరు విన్నర్’ అన్న విషయం మీద బెట్టింగ్ దాకా మన తెలుగు జనాలు వెళ్ళలేదు కానీ ముంబైలో 2017 లో అలాంటి బెట్టింగ్స్ కూడా జరిగాయి. ఇక పార్టిసిపెంట్స్ బయటకు రాగానే వాళ్లతో చిన్న ఇంటర్వ్యూలు చేసే యూట్యూబర్స్ కూడా బిగ్‌‌‌‌బాస్‌‌‌‌ని క్యాష్ చేసుకుంటున్నారు. మొత్తానికి మనీ జనరేట్ చేసే కమర్షియల్ ఫార్ములా చుట్టూ జరిగే చిన్న వ్యాపారాలు చాలా ఉంటాయి.

సెలబ్రిటీల కొరత

బిగ్‌‌‌‌బ్రదర్ లోనూ, బాలీవుడ్ లో మొదలైన బిగ్‌‌‌‌బాస్ లోనూ ఓ మోస్తరు సెలబ్రిటీలే ఉండేవాళ్లు. అయితే ఇది లోకల్ భాషల్లోకి వచ్చాక ఆ స్థాయి సెలబ్రిటీలు దొరకటం కాస్త కష్టమే. అందుకే ఒకరిద్దరు పాపులర్ పర్సనాలిటీలని తీసుకొని, మిగతావాళ్లలో కాస్త తక్కువ క్రేజ్ ఉన్న వాళ్లని సెలక్ట్ చేస్తున్నారు. ఈ షోలో రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా టీవీల్లోనూ, బయట సొసైటీలో డిగ్నిఫైడ్ గా కనిపించే వాళ్లంతా ఇక్కడ మైండ్ గేమ్‌‌‌‌ ఆడుతూ కన్నింగ్ గా కొందరూ, అమాయకంగా ఇంకొందరు కనిపించటం, సెలబ్రిటీలు అయినవాళ్లు కూడా పాలిటిక్స్ ప్లే చెయ్యటం, ఏడవడం, వాళ్లలోని నెగెటివ్ కోణాన్ని చూపించటం జనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది. అదే జనాన్ని బిగ్ బాస్ షోని ఫాలో

కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అనిపించుకున్న బిగ్‌‌‌‌బాస్ ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్. తమకు నచ్చిన పార్టిసిపెంట్స్‌‌‌‌ని ప్రమోట్ చేస్తూ కొందరూ, పార్టిసిపెంట్స్‌‌‌‌ని ట్రోల్ చేస్తూ ఇంకొందరూ, ఇలాంటివాళ్లు పిచ్చివాళ్లు అంటూ.. బిగ్‌‌‌‌బాస్ ఒక చెత్త షో అంటూనే దానిమీద మాట్లాడే వాళ్ళు ఇంకొందరు. దాదాపుగా మెచ్చుకుంటూనో, విమర్శిస్తూనో మొత్తానికి అందరూ ఈ షో చుట్టూనే తిరుగుతున్నారు. ఎన్ని విమర్శలు ఉన్నా నాన్‌‌ ఫిక్షన్‌‌ షో కేటగిరీలో బార్క్‌‌ (రేటింగ్‌ ఇచ్చే సంస్థ) ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్‌‌ సాధించిన లాంచ్‌‌ ఎపిసోడ్‌‌గా మాత్రమే కాదు బిగ్‌‌బాస్‌‌ తెలుగులో ఏ సీజన్‌‌లోనూ చూడనంతగా ఈ లాంచ్‌‌ ఎపిసోడ్‌‌ హయ్యెస్ట్ రేటింగ్‌‌ అందుకుంది. ‘స్టార్‌‌ మా’కు గతంలో లేనంతగా అత్యధికంగా 1,122 జీపీఆర్‌‌లతో తెలుగు జనరల్‌‌ ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌ కేటగిరీలో స్పష్టమైన లీడర్‌‌షిప్‌‌ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగువారాలతో పోలిస్తే స్టార్‌‌ మా సరికొత్త బ్రాండ్‌‌ ఐడెంటిటీ 18 శాతం సాధించింది. నిజానికి బిగ్ బాస్-4కి ఈసారి ఇంతకంటే ఎక్కువ రేటింగ్ వస్తుందని భావించింది స్టార్ మా. లాక్‌‌డౌన్ లో అంతా టీవీలకే అతుక్కుపోయి ఉంటారని, ఎక్కువ రేటింగ్ వస్తుందనీ అనుకున్నారట. ఈమధ్య ఇదే ఛానెల్ లో టెలికాస్ట్ అయిన కొన్ని సినిమాలు రేటింగ్స్ విషయంలో చరిత్ర సృష్టించాయి. అదే ట్రెండ్ బిగ్ బాస్ సీజన్-–4లో కూడా కనిపిస్తుందని భావించారు. 20 మార్క్ దాటి రేటింగ్ వస్తుందనుకున్నారు. వాళ్లు  అనుకున్నదానికన్నా తక్కువే అయినా 18% అంటే తక్కువ ఏమీ కాదు.

గంగవ్వ ఎపిసోడ్‌‌

బిగ్‍బాస్‍ ఇంట్లోకి అంత వయసున్న గంగవ్వని మామూలుగా అయితే తీసుకునే వాళ్లు కాదు. ఎందుకంటే ఈ షో ఎక్కువగా సినీ, టీవీ గ్లామర్ మీదనే నడుస్తుంది. కానీ గంగవ్వను తీసుకుంటే టీఆర్పీలకు బూస్ట్ ఇస్తుందనే ఎత్తుగడతో ఆమెను సెలక్ట్ చేసుకున్నారు. రేటింగులు కూడా ఆమె వల్ల బాగానే వచ్చాయి. ఆమెను కనీసం అయిదారు వారాల పాటయినా హౌస్‍లో వుంచాలని చూసారు. అయితే పొద్దస్తమానం ఇరుగు, పొరుగుతో మాట్లాడుతూ, హాయిగా ఊరంతా తిరుగుతూ ఉండే గంగవ్వని నాలుగు గోడల మధ్య బంధించేస్తే కష్టమనే సంగతిని బిగ్‍బాస్‍ క్రియేటివ్‍ టీమ్‍ ఊహించలేదు. సీజన్–2 లో కూడా కామెడీ హీరో సంపూర్ణేష్ బాబుతోనూ ఇదే సమస్య వచ్చింది. తనకు తానే కొట్లాడి బయటకు వచ్చేశాడు. హాయిగా బతికే మనుషులు అలాంటి వాతావరణంలో ఉండటం కుదరదు, సైకలాజికల్‌‌‌‌గా చాలా ఫ్రస్ట్రేట్ అవుతారు. సరిగ్గా ఆ పాయింట్ మీదే ఈ కాన్సెప్ట్ తయారయ్యింది. జనాన్ని ఎక్కువగా ఆకర్షించేది కూడా ఇవే పాయింట్స్ కావటం వల్ల ‘బిగ్‌‌‌‌బాస్‌‌‌‌’ కింగ్ ఆఫ్ రియాలిటీ షోస్ అయ్యిందన్నది చాలామంది అభిప్రాయం.

అన్ని సౌకర్యాలు వుంటే ఆమె అడ్జస్ట్ అయిపోతుందని అనుకున్నారు. కానీ గంగవ్వ  తన వల్ల కావడం లేదని  కన్నీరు మున్నీరయింది. అయినా కానీ మొదట్లో అలాగే వుంటుంది, తర్వాత అలవాటవుతుంది అంటూ బిగ్‍బాస్‍ ఆమెకు సర్ది చెప్పాలని చూస్తున్నాడు. దీంతో ఆమెకు ఓట్లేసిన జనాలే ఇప్పుడు బిగ్‍బాస్‍ని తిట్టిపోస్తున్నారు. మరికొన్ని రోజులు అక్కడే వుంటే ఆమె మరింతగా డిస్టర్బ్ అవుతుందనీ, ఈ వయసులో ఆమెను మరింత కష్టపెట్టవద్దని, గంగవ్వని పంపించాలని సోషల్‍ మీడియాలో స్టార్‍మా, బిగ్ బాస్ టీమ్‌‌‌‌ని ట్యాగ్ చేసి మరీ పెట్టే పోస్టులూ బాగానే ఉంటున్నాయి.

శిల్పాశెట్టి మీద సింపతీ

2007లో ప్రసారమైన బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఇండియానుంచి ఓ సెలబ్రిటీగా పార్టిసిపేట్ చేసింది. షోలో ఈమెపై బ్రిటీష్ మహిళ జేన్ గూడి చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు విపరీతంగా ట్రోల్ అయ్యాయి. జేన్ గూడీపై తీవ్ర వ్యతిరేకత, శిల్పాశెట్టి మీద సింపతీ వర్క్ అవుట్ అయ్యాయి. శిల్పా ఆ సీజన్ టైటిల్ విన్నర్ అయ్యింది. అప్పుడే ఇండియాలోనూ ఈ కాన్సెప్ట్‌‌‌‌కి  క్రేజ్ ఉందన్నది అర్థమైంది. బాలీవుడ్ లోనూ బిగ్‌‌‌‌బ్రదర్‌‌‌‌‌‌‌‌కి పేరడీ ప్రోగ్రాం బిగ్‌‌‌‌బాస్ మొదలైంది. 2006లో మొదటిసారి ఇండియాలో హిందీలో బిగ్‌‌‌‌బాస్ టెలికాస్ట్ అయ్యింది అర్షద్ వార్షి హోస్ట్ గా వ్యవహరించగా సోనీ టీవీలో ప్రసారం అయ్యింది. ఆ తరువాత శిల్పా శెట్టి, అమితాబ్, సల్మాన్, సంజయ్ దత్ కూడా బిగ్ బాస్ హోస్ట్స్‌‌‌‌గా చేశారు. రియాలిటీ షోలకి ఉండే క్రేజ్ బిగ్‌‌‌‌బాస్‌‌‌‌తో ఒక రేంజ్ కి వెళ్ళింది. అదే హైప్ ఇప్పుడు అన్ని భాషలకీ పాకింది. శిల్పా శెట్టి ఫార్ములాని తెలుగు సీజన్–3 లో కౌశల్ ఫాలో అయ్యాడు. షో మొత్తానికి తాను ఒంటరివాడిననీ, మిగతా అందరూ తనకు వ్యతిరేకంగా ఉన్నారనీ అనిపించేలా సింపతీ సాధించగలిగాడు. టైటిల్ కూడా అందుకున్నాడు.