నీలం ఫొటోనే ఎందుకు

నీలం ఫొటోనే ఎందుకు

ప్రకృతి, పరిసరాలను పరిచయం చేయడానికే కాదు.. మనిషి  వ్యక్తిత్వాన్నీ  ప్రతిబింబిస్తాయి రంగులు.  నచ్చిన రంగుతో ఒక్కోసారి భావోద్వేగాన్ని కూడా ప్రదర్శించవచ్చు.  అలాంటిది ఏకంగా దేశం మొత్తం హఠాత్తుగా నీలం రంగుకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆఫ్రికన్‌‌ దేశం సూడాన్‌‌లో సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం నీలం రంగుతోనే నింపేస్తున్నారు యూజర్లు. అందుకు కారణం ఏంటంటే…

జూన్3వ తేదీన మహమ్మద్‌‌ మట్టర్‌‌ అనే ఇంజినీర్–ఉద్యమకారుడు భద్రతా సిబ్బంది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. సెక్యూరిటీ ఫోర్స్‌‌ నుంచి ఇద్దరు మహిళల్ని రక్షించే క్రమంలో అతను ప్రాణ త్యాగానికి పాల్పడ్డాడు.  నీలం అతనికి ఇష్టమైన రంగు. అందుకే మట్టర్‌‌ స్నేహితులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌‌ ఫొటో స్థానంలో నీలం రంగును అప్‌‌లోడ్‌‌ చేసి నిరసన వ్యక్తం చేశారు. మట్టర్‌‌కి నివాళులర్పించేందుకు దేశం మొత్తం ముందుకు రావాలని  పిలుపునిచ్చారు. ఆ విధంగా #BlueForSudan, #BlueSudan హ్యాష్‌‌ట్యాగ్‌‌లతో సోషల్ మీడియాలో నిరసన మొదలైంది. జూన్‌‌ 11న ట్విట్టర్‌‌లో మొదలైన ఈ ట్రెండ్… ఇప్పుడు పీక్‌‌ స్టేజీకి చేరుకుంది.

కన్నీళ్లతో సూడాన్‌‌… 

ధరలు పెరిగిపోవడం, అవినీతి, అణచివేత, జనాలు అదృశ్యం కావడం, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడంతో సూడాన్ ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఒమర్‌‌ అల్‌‌ బషీర్‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ఏడాది చివరి నుంచి ప్రజలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటును డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నారు. కానీ, బషీర్‌‌ ప్రభుత్వం నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేస్తూ వస్తోంది.  ఈ క్రమంలో జూన్‌‌3న ఖార్‌‌తౌమ్ వద్ద నిరసన తెలుపుతున్న వేలాది మంది ప్రజలపై సైన్యం కిరాతకంగా కాల్పులు జరిపింది. ఆ మృతదేహాల్ని నైలు నదిలో పడేసింది. ఈ ఘటనలో వంద మందికిపైనే  చనిపోయారని సూడాన్ వైద్యుల కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ కాల్పుల్లోనే మట్టర్‌‌.. ఇద్దరు మహిళల్ని రక్షించబోయి తన ప్రాణాలు కోల్పోయాడు. అతనికి నివాళిగా ‘బ్లూ ఫర్‌‌ సూడాన్‌‌’ మొదలయ్యాక..  తమ దేశంలో జరుగుతున్న సైలెంట్‌‌ తిరుగుబాటు గురించి ప్రపంచానికి తెలియజేయాలనే అక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారు. సూడాన్‌‌లో  మీడియా సంస్థలను మూసేయడంతో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకున్నారు. మట్టర్‌‌కి ఇష్టమైన రంగు ఇప్పుడు దేశ ప్రజల ఐకమత్యానికి ప్రతీకగా మారింది. నీలంతో పాటు పాటలతో ఉద్యమానికి ఊపు తెస్తున్న అలా సలాహ్‌‌(లిబర్టీ లేడీ) ఫొటో, సూడాన్‌‌ జాతీయ జెండాని హిజాబ్‌‌గా ధరించి కన్నీరు కారుస్తున్న మహిళ ఫొటోలూ ట్రెండ్ అవుతున్నాయి.