- బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: పాలమూరును పక్కన పెట్టి, డిండిపై ఆత్రుత ఎందుకని బీసీ పొలిటికల్ జేసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. నల్గొండ మంత్రులకు ఉన్న సోయి, పాలమూరు మంత్రులకు లేదని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పాలమూరు ఎత్తిపోతలకు జూరాల నీటిని నింపి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే కూడా ఆ ప్రాంతానికి దక్కాల్సిన నీటివాటాపై నల్గొండ మంత్రులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అన్ని ప్రాజెక్టులు సమానమే కదా..? అని ప్రశ్నించారు. గతంలో డిండి ప్రాజెక్టుకు నీళ్ల విడుదలపై లేఖ రాసిన మంత్రి జూపల్లి కృష్ణారావు మౌనం విడాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రైతుల పక్షాన బీసీ పొలిటికల్ జేఏసీ పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
