కవితను ఎందుకు అరెస్ట్​ చేయట్లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కవితను ఎందుకు అరెస్ట్​ చేయట్లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • ఆమె పీఏ.. ఆమ్​ ఆద్మీ నేతలకు  రూ.48 కోట్లిచ్చాడు
  • సీఎం.. ఆఫీస్ కు రాకుండానే లక్షల జీతం తీసుకుంటుండు
  • బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు: లిక్కర్ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత పీఏ అభిషేక్ రావు రూ.48 కోట్లను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చారని, ఇదంతా బయటపడినా ఆమె అరెస్ట్ మాత్రం జరగడం లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో సోమవారం పర్యటించారు. బెజ్జూర్ తహసీల్దార్ ఆఫీసు ఎదుట 15 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్​వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు. చింతలమానేపల్లిలో బీఅర్ఎస్ పార్టీ నుంచి కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డోకె రాజన్న, పార్టీ మండల అధ్యక్షుడు రామగోని నీలా గౌడ్ సహా పలువులు బీఎస్పీలో చేరారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆఫీస్ లో అడుగుపెట్టకుండా నెలకు రూ.3లక్షల జీతం తీసుకుంటున్న సీఎం.. అంగన్​వాడీ, ఆశా వర్కర్లకు మాత్రం కనీస వేతనం చెల్లించడం లేదని మండిపడ్డారు. సామాన్యులకు ఒక న్యాయం, సీఎం బిడ్డ కవితకు ఒక న్యాయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. సిర్పూర్ టీ అభివృద్ది, ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచన చేసి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​అండ్ కంపెనీ ఎన్ని బంధులు ఇచ్చినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మాత్రం బీఎస్పీకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలను వేధించి తమ చేతుల్లో పెట్టుకునేందుకు కేసీఆర్​సర్కార్ స్టార్ హోటల్ మాదిరిగా పొలీస్ స్టేషన్లు కట్టించిందన్నారు. అంగ న్​వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, టీచర్లకు రూ.10 లక్షలు, మినీ టీచర్లకు రూ.5 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పెన్షన్ అందజేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా అంగన్​వాడీ , ఆశా వర్కర్లు సమ్మె చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అంగన్​వాడీ, ఆశా వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, అర్షద్ హుస్సేన్, బెజ్జూర్​ జిల్లా అధ్యక్షుడు గణపతి, జిల్లా ఇన్​చార్జి చిన్నన్న, మండల అధ్యక్షుడు ఆత్రం సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.