కంగన హిమాచల్‌‌ నుంచే యుద్ధం మొదలెట్టొచ్చుగా?

కంగన హిమాచల్‌‌ నుంచే యుద్ధం మొదలెట్టొచ్చుగా?

ముంబై: బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ముంబైని వీడిన సంగతి తెలిసిందే. అయినా ఆమె వ్యాఖ్యలపై దుమారం ఆగట్లేదు. ముంబై తనకు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌లా కనిపిస్తోందని, బాలీవుడ్‌‌లో డ్రగ్ వాడకం ఎక్కువగా ఉందని కంగన కామెంట్స్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై హిందీ వెటరన్ హీరోయిన్, కాంగ్రెస్ నేత ఊర్మిలా మతోండ్కర్ తాజాగా స్పందించారు. డ్రగ్స్ గురించి మాట్లాడుతున్న కంగన తన హోం స్టేట్ అయిన హిమాచల్ నుంచే మాదక ద్రవ్యాలపై పోరును ఎందుకు మొదలు పెట్టడం లేదని ప్రశ్నించారు.

‘దేశం మొత్తం డ్రగ్స్ భూతాన్ని ఎదుర్కొంటోంది. మరి డ్రగ్స్‌‌కు తన స్వరాష్ట్రమైన హిమాచల్ మూలం అని కంగనాకు తెలుసా? ఆమె అక్కడి నుంచే తన యుద్ధాన్ని ప్రారంభించాలి. పన్నులు చెల్లించే వారి నుంచి ఆమెకు వై-సెక్యూరిటీ ఎందుకు కల్పించారు? డ్రగ్స్ గురించి సమాచారాన్నిఆమె పోలీసులకు ఎందుకు అందించలేదు? ముంబై అందరిది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ముంబైని ఎవరైతే ప్రేమించారో, సిటీకి తిరిగి ఏదోటి ఇచ్చారో వారిదే ఈ నగరం. ముంబై ప్రతిష్ఠను దిగజార్చే ఎలాంటి వ్యతిరేక చర్యలను సహించబోం. అలాంటి కామెంట్స్ చేసే వారు సిటీతోపాటు రాష్ట్రంలోని ప్రజలను అవమానపర్చినట్లే. ఒక వ్యక్తి అరుస్తూ ఉంటే నిజాలు చెప్పినట్లు కాదు. విషమ పరిస్థితుల్లో బాలీవుడ్ పని చేస్తోంది. ఇండస్ట్రీకి చెందిన వారు తాము ఏదైనా మాట్లాడితే సమస్యలు వస్తాయని భయపడుతున్నారు. జంకుతూ ఉంటే ఎలా ప్రశ్నించగలరు?’ అని ఊర్మిల చెప్పారు.