లెబనాన్లో జరిగిన పేజర్ పేలుళ్ల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. పేజర్లు పేలడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 2,800 మంది గాయపడ్డారు. ఈ పేజర్స్లో 3 గ్రాముల పరిమాణంలో పేలుడు పదార్థాలను అమర్చి ఈ నరమేధం సృష్టించారని తేలింది. ఇజ్రాయెల్కు లొకేషన్ చిక్కకుండా ఉండేందుకు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులంతా పేజర్లను వాడుతున్నారు. వీటి ద్వారానే కీలక సమాచారాన్ని చేరవేసుకుంటున్నారు. మంగళవారం పేలిన పేజర్లను తైవాన్కు చెందిన గోల్డ్ అపోలో సంస్థనుంచి లెబనాన్‌కు దిగుమతి చేసుకున్నట్టు న్యూయార్క్టైమ్స్పత్రిక నివేదించింది.
ఇందులో ‘ఏఆర్924’ మోడల్‌కు చెందిన పేజర్లు 3000 వరకు ఉన్నట్టు పేర్కొన్నది. పేజర్ డివైస్ లో బ్యాటరీ కింది భాగంలో పేలుడు పదార్థాన్ని అమర్చి, ఒక స్విచ్ కూడా అమర్చారని సమాచారం. ఈ స్విచ్ ద్వారా రిమోట్ కంట్రోల్తో పేజర్ను పేల్చేసినట్లు తెలిసింది. పేజర్లో 90 గ్రాముల పరిమాణంలో రీఛార్జబుల్ లిథియం బ్యాటరీ ఉంది. ఈ పేజర్ డివైజ్కు హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సభ్యులు ఒక మెసేజ్ పంపగానే పేజర్లు పేలిపోయాయి. ఆ మెసేజ్ వచ్చిన కొన్ని సెకన్ల పాటు పేజర్ బీప్ శబ్దం చేస్తుంది. ఆ తర్వాతే పేలిపోతుంది.
అసలు పేజర్ అంటే..
మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు అత్యవసర సందేశాలు పంపుకునేందుకు వినియోగించిన ఒక చిన్న సైజ్ వైర్లెస్ డివైజే ఈ పేజర్. వాయిస్ కాల్స్ చేయలేం కానీ టెక్ట్స్ మెసేజెస్ను ఈ పేజర్ డివైజ్ చేరవేస్తుంది. 1980, 90ల్లో ఈ పేజర్ డివైజ్ మోస్ట్ పాపులర్. మొబైల్ ఫోన్లు వచ్చాక ఈ పేజర్లు రానురానూ కనుమరుగైపోయాయి. ఈ డివైజ్లను తయారు చేసే కంపెనీలు కూడా ఉత్పత్తిని నిలిపివేశాయి.
ALSO READ : నిన్న పేజర్లు.. ఇయ్యాల వాకీటాకీలు : లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు
ఇంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈరోజుల్లో కూడా హెజ్బొల్లా మిలిటెంట్లు ఈ పేజర్లనే ఎందుకు వాడారంటే.. పేజర్లయితే మొబైల్ ఫోన్ల మాదిరిగా లొకేషన్ను ట్రాక్ చేయలేరు. పేలుళ్లకు మొబైల్ ఫోన్లు వినియోగిస్తే ఏం జరుగుతుందో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్కు బాగా తెలుసు. గత ఫిబ్రవరిలో ఈ గ్రూప్ జనరల్ సెక్రటరీ హసన్ నస్రల్లా తన గ్రూప్ సభ్యులను ఈ మేరకు హెచ్చరించాడు కూడా. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ కంటే ఫోన్లే తమకు ప్రమాదకరమని.. ఫోన్లను పగలగొట్టాలని లేదా ఐరన్ బాక్స్లో పెట్టి లాక్ చేయాలని మిలిటెంట్ గ్రూప్ సభ్యులను హసన్ నస్రల్లా హెచ్చరించాడు.