భారతదేశంలో పాలకులు కులాన్ని, కుల అసమానతలను యధాతథంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కేవలం భారత రాజ్యాంగం మాత్రమే కులానికి, కుల వివక్షకు వ్యతిరేకంగా రూపొందింది. భారతదేశంలో హరిత విప్లవం వచ్చింది. అది అగ్రవర్ణ భూస్వాములకే మేలు చేసింది. పారిశ్రామిక విప్లవం కూడా సంపన్న అగ్రవర్ణాలవారికే మేలు చేసింది. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వలన ప్రధానంగా నష్టపోయింది దేశంలోని అన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు.
ప్రపంచీకరణ కొంత అభివృద్ధి అయితే తీసుకువచ్చింది. కానీ, అప్పటివరకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను దెబ్బతీసింది. ఏ కార్పొరేట్ కంపెనీలో అయినా మేనేజర్ స్థాయి ఉద్యోగాలు ఎవరు చేస్తున్నారు, క్లర్కు స్థాయిలో ఎవరున్నారు, నాలుగో తరగతి ఉద్యోగాలలో ఎవరున్నారని పరిశీలిస్తే చాతుర్వర్ణ వ్యవస్థ అమలవుతున్నట్లు వెల్లడవుతుంది.
ప్రజలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లపై కేంద్రంతో, కోర్టులతో పోరాడాల్సిన అవసరం ఉంది. ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికమీద కుల, మత రిజర్వేషన్లను పెంచుతామంటోంది. యాభై శాతానికి మించి ఒక్క శాతం పెరిగినా కోర్టు ఒప్పుకునే పరిస్థితి లేదు. కేంద్రంతో పోరాడైన సాధిస్తాం అంటున్నారు. వాటితోపాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం కూడా పార్లమెంటులో మాట్లాడాలి. ఆర్టికల్ 16(4)ను సవరణ చేసి అందులో ప్రైవేట్ అనే పదం కూడా చేర్చడం కోసం పోరాడవలసిన అవసరం ఉంది.
మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ యాక్ట్ 2004 పేరుతో అక్కడ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలని చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం ఏ ప్రైవేట్ సంస్థైనాప్రభుత్వం నుంచి భూమిని, నిధులనుగాని, ఇతర సౌకర్యాలు పొందితే రిజర్వేషన్లు అమలు చేయాలి. చేయకపోతే యాజమాన్యాల శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చట్టం చేశారు. కానీ చివరకు కార్పొరేట్ల ఒత్తిడితో ఈ చట్టాన్ని నీరుగార్చారు.
నీళ్లు, నిధులతోపాటు నియామకాలు
తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులతోపాటు నియామకాలు ప్రాముఖ్యతని పొందాయి. నియామకాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ కొలువులు కూడా. అందులో కార్పొరేట్ ఉద్యోగాలు కూడా భాగమే. ఉద్యమ సమయంలో ఇక్కడి కార్పొరేట్ కంపెనీలన్నీ ఆంధ్రుల చేతిలో ఉండటం వల్ల ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఆంధ్రుల కంపెనీలకే మద్దతు ఉన్నందున మనకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తెలంగాణ వస్తే ఇక్కడ పెట్టుబడిదారులకు అవకాశం వస్తుంది.
ఇక్కడి కార్పొరేట్ రంగాల్లో మనకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఆయితే తెలంగాణ వచ్చిందికాని కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు మాత్రం పేద బహుజనులకు దక్కడం లేదనేది వాస్తవం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తప్పనిసరి రాజ్యాంగం ఆర్టికల్ 16 (4) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో, పదవుల్లో తగినంత ప్రాతినిధ్యంలేని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 15(1) ప్రకారం కులం, మతం, లింగ, ప్రాంతం పేరుమీద వివక్ష పాటించడానికి వీలులేదు. ఇది కార్పొరేట్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది.
ఆర్టికల్ 39 (సి) ప్రకారం సంపద కేంద్రీకృతం కాకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత. కంపెనీలు సామాజిక సమతౌల్యాన్ని పాటించేలా అన్ని కులాల వారికి, అన్ని మతాలవారికి ఆయా కులాల జనాభాను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. భారత ప్రభుత్వ నివేదిక 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీల జనాభా 18% , ఎస్సీలు ఉద్యోగులు 8 శాతం. ఎస్టీల జనాభా ఎనిమిది శాతం ఎస్టీ ఉద్యోగులు మూడు శాతం. బీసీల జనాభా 52 శాతం. కానీ బీసీ ఉద్యోగులు ఏడు శాతం మాత్రమే.
బ్రాహ్మణ, బనియా, క్షత్రియ, కమ్మ, వెలమ, వీరి జనాభా 20 శాతంగా ఉంటుంది. వీరిలో ఉద్యోగులు 80 శాతంగా ఉన్నారు. ఈ దేశంలో ఎవరి దగ్గర ఎంత సంపద ఉన్నది అనే లెక్కలు కనక తీస్తే 80% సంపద 20% మంది దగ్గర పోగుపడింది అనే విషయం తేటతెల్లమవుతుంది. బహుజన నిరుద్యోగులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్లంతా ప్రభుత్వంపై, కోర్టులపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. కులం ప్రాతిపదికన ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించడం అనేది తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు తమ సామాజికవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు చేయాలి.
వి. బాలరాజు, తహశీల్దారు రిటైర్డ్
