వెలుగు ఓపెన్ పేజీ..అన్నింటికీ ముందు.. అభివృద్ధిలో వెనుక!

వెలుగు ఓపెన్ పేజీ..అన్నింటికీ ముందు.. అభివృద్ధిలో వెనుక!

నాయీ బ్రాహ్మణుల వర్గం అన్ని కులాలకు అనుబంధంగా ఉంది.  మంగలి, మంగళ,  భజంత్రి పేర్లతో  పిలిచే ఈ వర్గం  కేవలం జుట్టు కత్తిరించే వృత్తికే పరిమితం కాలేదు. గ్రామంలో పుట్టిన బిడ్డ మొదటి సంబరాల దగ్గర నుంచి పెళ్లి,  సావు, జాతరలు, శుభకార్యాల వరకు వారి పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. పల్లె వీధిలో చిన్న చెక్క కుర్చీ, ముందు పాత అద్దం, పక్కన వేలాడే కత్తెర్లు,  రేజర్లు  నాయీబ్రాహ్మణ  జీవన చరిత్రకు  గుర్తులుగా  కనిపిస్తాయి. కాలం మారింది, ఊర్లు మారాయి, జీవనశైలులు మారాయి. సంప్రదాయ వృత్తుల స్థానంలో మార్కెట్ ఆధారిత వ్యవస్థలు వచ్చాయి. పాత సేవా వృత్తులు నెమ్మదిగా అంతరించిపోయాయి. కానీ ఆ వృత్తులపై ఆధారపడి బతికిన కుటుంబాల్లో  మార్పు రాలేదు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే  వాస్తవాన్ని మన కళ్ల ముందు పెట్టింది.  రాష్ట్రంలో  బీసీ-–ఏ  జాబితాలో ఉన్న నాయీబ్రాహ్మణుల జనాభా 4,33,785.  మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 1.2 శాతంగా ఉంది.  ఈ సంఖ్య చిన్నదైనా వారి వెనుకబాటు మాత్రం పెద్ద సామాజిక ప్రశ్నగా మారింది.  కాంపోజిట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌నెస్ ఇండెక్స్ లో  ఈ వర్గానికి 94 స్కోర్ రావడం... దశాబ్దాలుగా పేరుకుపోయిన అసమానతలకు  నిదర్శనం.

 రాష్ట్ర సగటు కంటే అధిక వెనుకబాటుతో ఉన్న 135 కులాల్లో ఈ వర్గం ఉండటం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అత్యంత  వెనుకబడిన వర్గ జాబితాలో ఉండటం వారి స్థితిగతులను   తెలియజేస్తోంది. ఈ సర్వేలో కనిపించే ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబం ఉంది.  రెండు గదుల కంటే తక్కువ గదులు ఉన్న ఇళ్లలో  నివసిస్తున్న 66 శాతం కుటుంబాలున్నాయి.  వీరిలో  ‘మా పిల్లలు బాగా చదవాలి’ అని  ఆశపడే  తల్లిదండ్రులు ఉన్నారు.   కానీ అదే సమయంలో  డిప్లొమా, ఇంటర్ దాటి ఉన్నత విద్య చేరుకున్నవారు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు 45 శాతంగా ఉంటే,  ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలు కేవలం 20 శాతం  మాత్రమే ఉన్నారు. 

ఆర్థిక బలహీనత

మహిళల్లో 65 శాతం మంది 10వ తరగతిలోపే చదువు ఆపేయడం ఈ వర్గంలోని మహిళలు ఎంతటి  వెనుకబాటుకు  గురవుతున్నారో  తెలియజేస్తుంది.  ఇంటి పనులు, ఆర్థిక సమస్యలు, సామాజిక పరిమితులు కలిసి ఎంతోమంది  అమ్మాయిలు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు.  రోజువారీ కూలీలుగా పనిచేసేవారు 26 శాతం,  వ్యవసాయ కూలీలు 14 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో కేవలం 3శాతం మాత్రమే ఉన్నారంటే,  ఈ వర్గానికి స్థిరమైన అవకాశాలు ఎంత తక్కువగా అందుతున్నాయో తెలిసిపోతుంది. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 7శాతం మాత్రమే ఉండటం ఆధునిక ఆర్థికవ్యవస్థలో కూడా వీరు ఇంకా అట్టడుగుకే  పరిమితమై ఉన్నారని చెబుతోంది. ఈ సర్వేలో అత్యంత లోతైన అంశం సంప్రదాయ వృత్తి కొనసాగింపే. ఇప్పటికీ 23 శాతం మంది తమ పాత వృత్తినే కొనసాగిస్తున్నారు.   భూమి, ఆస్తుల పరిస్థితి చూస్తే ఈ వర్గం ఆర్థిక బలహీనత  మరింత స్పష్టమవుతుంది.

సంప్రదాయ వృత్తిని ఆధునీకరించాలి

మొత్తం రాష్ట్ర భూమిలో వీరి వాటా కేవలం 0.7 శాతం. భూమి ఉన్న కుటుంబాలు 25 శాతం. వాటిలో 5 ఎకరాల లోపు భూములు 90 శాతం కుటుంబాలకు  మాత్రమే ఉన్నాయి. అంటే వ్యవసాయం కూడా వీరికి స్థిరమైన భద్రత ఇవ్వలేకపోతోంది.  పెళ్లిళ్లు, వైద్య ఖర్చుల కోసం అప్పులు తీసుకున్న కుటుంబాలు 8 శాతం.  వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు ఉన్న కుటుంబాలు 8 శాతం. అంటే చిన్న అనారోగ్యం వచ్చినా,  ఒక కుటుంబ వేడుకలకు కూడా అప్పు తప్పని పరిస్థితి.  

జీహెచ్ఎంసీలోనే  లక్షకు పైగా  నాయీబ్రాహ్మణులు నివసించడం వలసల తీవ్రతను  సూచిస్తున్నాయి. గ్రామంలో చిన్న సెలూన్ నడిపిన వ్యక్తి పట్టణంలో పెద్ద షాపులో ఉద్యోగిగా మారినా, ఆర్థిక భద్రత మాత్రం ఇంకా దూరంగానే ఉంది.  గ్రామీణ  సీబీఐ స్కోర్ 48  ఉంటే,  పట్టణ సీబీఐ స్కోర్ 47గా ఉండటం శోచనీయం.  బీసీలు అనే పదం వెనుక అన్ని వర్గాల జీవితాలు ఒకేలా లేవని ఈ గణాంకాలు చెబుతున్నాయి. నాయీబ్రాహ్మణులు వంటి సంప్రదాయ సేవా వృత్తుల కులాలు ఇంకా అట్టడుగునే ఉన్నాయి. 

వారికి నిజమైన సామాజిక న్యాయం చేకూరాలంటే  కేవలం సంక్షేమ పథకాలు సరిపోవు.  వారి అభివృద్ధి కోసం కొన్ని  సంస్కరణలు చేర్చాలి.  ఇందులో భాగంగా వారి సంప్రదాయ వృత్తిని ఆధునీకరించాలి. సెలూన్ వృత్తిని బ్యూటీ & వెల్‌‌‌‌‌‌‌‌నెస్ ఇండస్ట్రీగా మార్చాలి. స్కిల్ సర్టిఫికేషన్, డిజిటల్ బుకింగ్, బ్రాండెడ్ సెలూన్ మోడల్స్ అభివృద్ధి చేయాలి.  విద్యారంగంలో ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి.  చిన్న వ్యాపారాలు,  ఫ్రాంచైజ్ మోడల్స్,  మైక్రో  ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌ను  ప్రోత్సహించాలి.  ఇది  ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది.  సర్వే జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం.. నాయీబ్రాహ్మణుల వర్గానికి సామాజిక న్యాయం అందించే బాధ్యతను కూడా తీసుకోవాలి.

- జంపాల ప్రవీణ్, సోషల్ ఎనలిస్ట్​