పెళ్లి చేసుకుంటానని మోసం

పెళ్లి చేసుకుంటానని మోసం
  • భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం 
  • సీఐపై ఖమ్మంలో కేసు నమోదు 

ఖమ్మం టౌన్, వెలుగు: న్యాయం చేయాలని పోలీసుస్టేషన్​కు వచ్చిన మహిళను పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లోబర్చుకుని మోసం చేసిన ఖమ్మం సీసీఎస్ పోలీస్ స్టేషన్ సీఐ రాజు నాయక్ పై ఖమ్మం టూ టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన వివాహిత తన భర్తతో వివాదాలు తలెత్తడంతో ఫిర్యాదు చేసేందుకు 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అప్పట్లో మహిళా పీఎస్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్ వివాహిత ఫోన్ నెంబర్ తీసుకుని ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. అప్పటికే భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తాను గర్భం దాల్చగా అబార్షన్ కూడా చేయించినట్టు బాధితురాలు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సీఐ క్రమంగా తనను దూరం పెట్టడంతో మోసపోయినట్టు గుర్తించిన మహిళ ఈ నెల 8న ఖమ్మం టూ టౌన్ లో ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన టూ టౌన్ సీఐ బాలకృష్ణ ప్రస్తుతం సీసీఎస్ సీఐగా పని చేస్తున్న రాజు నాయక్ పై బీఎన్ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. అయితే, రాజు కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు.