ప్రభుత్వాల నిర్లక్ష్యానికి.. ప్రజలెందుకు భారం మోయాలి?

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి.. ప్రజలెందుకు భారం మోయాలి?

కొన్ని ప్రాజెక్టుల అంచనాలు అమాంతం రెండు, మూడు రెట్లు పెరిగిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలా పెరుగుతున్న బడ్జెట్​లో అవినీతి ప్రణాళికలు కూడా ముడిపడి ఉన్నాయా? ప్రభుత్వాల పెద్దల, అధికారుల నిర్లక్ష్యంతోనూ, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమూ  చేసే బడ్జెట్ రివిజన్​ల భారాన్ని ప్రజలు ఎందుకు మోయాలన్నది ముఖ్యమైన ప్రశ్న.  ఇలాంటి సందర్భాల్లో ప్రజలపై భారం వేయకుండా తప్పులు చేసే ఆయా సంస్థలు, వ్యక్తులు మోసేలా చట్టాలు రావాల్సిన అవసరం ఉన్నది.

ఒక మధ్య తరగతి కుటుంబం ఇంటి స్థలం కొనుక్కోవడం నుంచి, ఇంటి నిర్మాణం వరకు వివిధ దశల్లో ఏమి చేయాలన్నదానిపై పక్కా పని ప్రణాళిక వేసుకుంటుంది. బడ్జెట్ అంచనా వేసుకుంటుంది. అవసరమైన డాక్యుమెంట్లు పెట్టి, బ్యాంక్ లోన్ కోసం అప్లై చేసుకుని, అధికారుల నుంచి అప్రూవల్ పొందుతుంది. భవన నిర్మాణ కార్మికుల టీమ్​తో కూడా మాట్లాడుకుని ఫైనల్ చేసుకుంటుంది. మెటీరియల్​ సకాలంలో సరఫరా చేసేలా ఆయా వ్యాపారులతో మాట్లాడుకుంటుంది. ఇంటీరియర్ డిజైన్ తో సహా, ఇంజినీర్ సలహాలు కూడా తయారుగా ఉంచుకుంటుంది. అప్పుడే పనిలోకి దిగి అనుకున్న సమయానికి ఒక నెల అటూ ఇటూగా, బడ్జెట్ అంచనా కంటే ఒక రెండు లక్షలు అటూ ఇటూగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. అలా చేసుకుంటేనే ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటుంది.

మరి రాష్ట్రం విషయంలో జాగ్రత్త ఏది?

రాష్ట్ర, ప్రజా ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని ఉపయోగించి ఏదైనా ప్రాజెక్ట్/ కట్టడం నిర్మాణం చేయాలనుకునే ప్రభుత్వానికి, సాధారణ కుటుంబం వేసుకునే ప్రణాళిక కంటే మెరుగైన ప్రణాళిక ఉండాలి.  ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిర్ధిష్ట కాల పరిమితి అవసరం. దీని కోసం సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ ను ప్రభుత్వం (క్యాబినెట్, అధికార గణం) తయారు చేసుకోవాలి. అవసరమైన అన్ని రకాల అనుమతులు ఆయా స్థాయి కమిటీల నుంచి ముందుగా తీసుకోవాలి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులపై ఒక అంచనాకు రావాలి.  ఆ నిధులను సకాలంలో సమకూర్చుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. ప్రాజెక్ట్ నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏటా ఎన్నినిధులు కేటాయించాల్సి ఉంటుందనే వాస్తవిక అంచనాకు రావాలి. ఒక్కోసారి ప్రభుత్వానికి అనుకున్న ఆదాయం రాక, ప్రాజెక్టులపై అనుకున్న స్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపు అనుకున్న పద్ధతిలో చేయకపోయినా, లేదా కేటాయించిన నిధులను సమయానికి విడుదల చేయకపోయినా, ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోతాయి. లేదా కుంటు పడతాయి. ప్రాజెక్టు కోసం రుణం తీసుకోవాల్సి వస్తే ఎవరి దగ్గర, ఎంత వడ్డీకి తీసుకోవాలి, ఎన్ని ఏండ్లలో తీర్చాలి? రుణ చెల్లింపు ప్రణాళిక ఏమిటి ? చెల్లింపులో ఆలస్యమయితే పడే వడ్డీ భారం లేదా జరిమానాలు ఎంత? లాంటి అంశాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి.  నిర్మాణ అవసరాలకే కాకుండా, బ్యాంకు అసలు రుణాలను, వడ్డీలను చెల్లించడానికి బడ్జెట్ లో నిధులు తగినన్ని కేటాయించే అవకాశం ఉందా? అన్నది కూడా  చూసుకోవాలి.

ఎందుకు సకాలంలో పూర్తి కావడం లేదు

ప్రాజెక్టులపై ఖర్చు చేసే నిధులు అత్యంత విలువైనవి. అపరిమిత నిధులేమీ బడ్జెట్ లో ప్రభుత్వాలకు ఉచితంగా లభించవు. ప్రభుత్వాలు చేసే రుణాలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. రుణాలను సక్రమంగా, సకాలంలో చెల్లించకపోతే, ఆ భారం ప్రజలపై పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులపై నిధులను సక్రమంగా ఖర్చు చేయడం కూడా అత్యంత అవసరం. ఈ అవగాహనతో ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం చేపట్టి నిర్మిస్తున్న అన్ని ప్రాజెక్టుల సమీక్ష లోతుగా జరగాలి. ఎత్తిపోతల సాగు నీటి ప్రాజెక్టులు, సెక్రటేరియట్ నిర్మాణం, దేవాలయాల పునరుద్ధరణ, మెట్రో రైల్ లైన్ నిర్మాణం, వివిధ పట్టణాల చుట్టూ నిర్మాణంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్డు వీటన్నిటిపై వాస్తవాలతో ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి.  

నిపుణులైన అధికారులు ఉన్నా..

సాధారణ కుటుంబాలతో పోల్చినప్పుడు, ప్రభుత్వంలో ఆయా రంగాల్లో ఉన్నత విద్య చదువుకున్న, అనుభవం కలిగిన అధికారుల బృందాలు ఉంటాయి. ఐ‌ఏ‌ఎస్ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. నిత్యం పెరుగుతుండే ద్రవ్యోల్బణం లాంటి అంశాలను అర్థం చేసుకునే ఆర్థిక వ్యవహారాల నిపుణులు ఉంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన సరుకుల, యంత్రాల ధరలపై కూడా అధికారులకు, కాంట్రాక్టర్లకు అంచనా ఉంటుంది. ఇంత యంత్రాంగం, చట్ట పరిజ్ఞానం అందుబాటులో ఉన్న స్థితిలో కూడా ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు సకాలంలో పూర్తి కావడం లేదు? ఎందుకు నిర్మాణ బడ్జెట్​లు వేల కోట్లు పెరిగి పోతున్నాయి? పెరిగే బడ్జెట్ లలో అవినీతి ప్రణాళికలు కూడా ముడిపడి ఉన్నాయా? ప్రభుత్వాల పెద్దల, అధికారుల నిర్లక్ష్యంతోనూ, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమూ  చేసే బడ్జెట్ రివిజన్ ల భారాన్ని ప్రజలు ఎందుకు మోయాలన్నది ముఖ్యమైన ప్రశ్న.  ఇలాంటి సందర్భాల్లో ప్రజలపై భారం వేయకుండా తప్పులు చేసే ఆయా సంస్థలు, వ్యక్తులు మోసేలా చట్టాలు రావాల్సిన అవసరం ఉంది.

కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులు

ఆయా ప్రాజెక్టుల పేరుతో కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి, బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీలు ఇచ్చి తీసుకువస్తున్న రుణాలు ఇవి. ఉదాహరణకు మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకాలు ఈ కోవలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల నిర్మాణ విషయాల్లో చారిత్రక అనుభవాలను బట్టి ఖర్చు పెరగడానికి, రుణం చెల్లించడానికి ఆటంకమయ్యే(ఎవరూ ఊహించలేని కరోనా లాంటి ఆకస్మిక ప్రమాదాలను కాకుండా) ముఖ్యమైన అంశాలను, ప్రమాదాలను కూడా ముందుగా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది.

అనుమతులు కీలకం

ఒక ప్రాజెక్టు నిర్మాణానికి అనేక అనుమతులు అవసరమవుతాయి. ఇందులో స్థలం ఎంపిక చాలా ముఖ్యమైనది. సాగు నీటి ప్రాజెక్టుకు సంబంధించి(రిజర్వాయర్లు, పంప్ హౌజులు, కాలువల నిర్మాణం)నిర్మాణ స్థలంలో, ముంపు ప్రాంతం ఎంత ఉంటుంది? ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక, వెనక్కు ఎగదన్నే జలాలతో ముంపు ప్రాంతం ఎంత ఉంటుంది ? ఎక్కువ వరద వచ్చినప్పుడు రిజర్వాయర్ల నుంచి విడుదల చేసే నీళ్లతో ముంపు ప్రాంతం ఎంత ఉంటుందీ? లాంటి అన్ని అంశాలను సరిగా లెక్కించాల్సి ఉంటుంది. అటవీ భూముల మళ్లింపు సహా, ఇతర పర్యావరణ అనుమతులు తీసుకున్నాక మాత్రమే భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. భూసేకరణ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి నష్ట పరిహారం, నిర్వాసితులకు పునరావాసం పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న బడ్జెట్ అంచనాలకు కూడా ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో(ప్రాజెక్టు వల్ల ఆర్ధికంగా లాభ నష్టాలు) అంచనా కూడా తప్పకుండా వేయాలి. ప్రాజెక్టు పేరుతో చేసే రుణాల చెల్లింపునకు ఇది చాలా ముఖ్యం. ఏ ప్రాజెక్టునైనా భావోద్వేగాలతో మాత్రమే నిర్మించకూడదు. ఒక  ప్రాజెక్టు పరిధిలో సాధారణ ప్రజలకు ఆర్థికంగా, జీవనోపాధి పరంగా అదనపు మేలు చేయని ప్రాజెక్టులపై ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేయడం సరి కాదని ఇప్పటికే అనేక ప్రాజెక్టుల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.

- కన్నెగంటి రవి, రైతు  స్వరాజ్య వేదిక