అసెంబ్లీకి రానోళ్లు ఎందుకు పోటీ చేయాలి?

అసెంబ్లీకి రానోళ్లు ఎందుకు పోటీ చేయాలి?
  •  కేసీఆర్‌‌‌‌కు ఇంత అహంభావం పనికిరాదు: కె.నారాయణ
  • మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుందని అనడం కరెక్ట్ కాదు 
  • ప్రాజెక్ట్‌‌లో అవినీతిపై విచారణ ఎదుర్కొని, క్షమాపణ చెబితే బాగుండేది
  • సీఎం పదవిపై హరీశ్‌‌రావు వ్యాఖ్యలు 
  • దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి హాజరుకాని వాళ్లు అసలు ఎందుకు పోటీ చేయాలని, అలాంటి వాళ్లను ఎన్నికల కమిషన్‌‌‌‌ బహిష్కరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉంటూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన జయలలిత, జగన్‌‌‌‌, చంద్రబాబును కేసీఆర్ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌‌‌‌లోని మగ్దూం భవన్‌‌‌‌లో పార్టీ జాతీయ నేతలు చాడ వెంకట్‌‌‌‌రెడ్డి, పల్లా వెంకట్‌‌‌‌ రెడ్డితో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. 

ఢిల్లీలో రైతులపై కేంద్ర ప్రభుత్వ దౌర్జన్యాన్ని నిరసిస్తూ నారాయణ నల్ల చొక్కాతో ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌కు హాజరయ్యారు. గతంలో అసెంబ్లీ నుంచి గెంటి వేయించిన రేవంత్‌‌‌‌ రెడ్డి సీఎం కావడం, తాను ప్రతిపక్ష నేతగా ఏ ముఖంతో ఆయనను చూడాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదేమోనన్నారు. ఆయనకు మరీ ఇంత అహం భావం పనికి రాదన్నారు. 

కాళేశ్వరంపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కామెంట్లు తప్పు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌లో కొన్ని పిల్లర్లు కుంగిపోతే ఏమవుతుందని కేసీఆర్ అనడం సరికాదని నారాయణ అన్నా రు. మేడిగడ్డకు వెళ్లిన అధికార ఎమ్మెల్యేల బృందంతో కేసీఆర్ కూడా వెళ్లాల్సిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌‌‌‌లో జరిగిన అవినీతి ఆరోపణలను ఎదుర్కొని, దానిపై క్ష మాపణ కూడా చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు. రేవంత్‌‌‌‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు కాకముందే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు శాపనార్థాలు పెట్టడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. రేవంత్‌‌‌‌ కూడా వారిని ఉద్దేశించి దిగజారి మాట్లాడొద్దని సూచించారు. రేవంత్‌‌‌‌ రాజీనామా చేసి, తమకు ప్రభుత్వం అప్పగించాలని హరీశ్‌‌‌‌ అన్న మాట లు చూస్తుంటే.. వెంటనే ముఖ్యమంత్రి కావాలనే తపన ఆయన వ్యాఖ్యల్లో కనిపిస్తున్నదన్నారు. ఈ కామెంట్లు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

డ్రోన్లతో టియర్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌ ప్రయోగమా?

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు టెర్రరిస్టులా? వాళ్లపై డ్రోన్లతో టియర్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌ చల్లడమేంటని కేంద్ర ప్రభుత్వాన్ని నారాయణ ప్రశ్నించారు. రైతులు ఉద్య మిస్తుంటే ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి రామాలయా లు ప్రారంభిస్తున్నారని విమర్శించారు. ఎలక్టోరల్‌‌‌‌ బాం డ్‌‌‌‌లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. రైతుల ఉద్యమంపై కేంద్రం దమనకాండకు నిరసనగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్‌‌‌‌ చేశారు. పదేండ్లుగా విభజన హామీలను అమలు చేయని బీజేపీ తెలుగు ప్రజానీకాని కి శత్రువని మండిపడ్డారు. ఏపీలో వైసీపీ, టీడీపీ కొట్టుకుంటూ, ఢిల్లీలో బీజేపీకి మద్దతిస్తున్నాయన్నారు.