జగన్​తో బయట కుస్తీ లోపల దోస్తీనా?

జగన్​తో బయట కుస్తీ లోపల దోస్తీనా?

కృష్ణా జ‌‌లాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, ఏపీ జల దోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలు టీఆర్ఎస్‌‌ స‌‌ర్కారుపై గళ‌‌మెత్తుతున్నాయి. రాష్ట్ర సాధన కోసం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించిన తరహాలోనే న్యాయమైన నీటివాటా కోసం ఏకతాటి పైకి వ‌‌స్తున్నాయి. కొద్దిరోజులుగా ఈ విష‌‌యంపై రౌండ్‌‌టేబుల్ స‌‌మావేశాలు, అఖిల‌‌ప‌‌క్ష స‌‌మావేశాలు జ‌‌రుగుతున్నాయి. ప‌‌లు వేదిక‌‌ల ద్వారా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యపు, కేసీఆర్​ ఒంటెత్తు పోకడలను ఎండగడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటులో నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలే ప్రధానంగా ఉద్యమాలు సాగిన సంగతి తెలిసిందే. ఈ మూడింటిలో ప్రధానమైన నీటివాటా పొందడంలో ఇంకా వివాదం కొనసాగుతోంది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లుగానే మిగిలిపోయాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పేరుతో అక్రమ ప్రాజెక్టును చేపట్టినా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ రెండేండ్లుగా సాగుతున్నా.. కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించ‌‌డం దారుణం. ఏ నీళ్ల కోసం తెలంగాణ సమాజం పోరాడిందో ఆ నీళ్లు ఏపీ ఎత్తుకు పోతుంటే రాష్ట్ర సర్కారు చేష్టలుడిగి చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు, నియామకాలు, నిధుల సమస్య తీరుతుందని తెలంగాణలో ప్రతిఒక్కరు ఆకాంక్షించారు. కానీ సీఎం కేసీఆర్ ఏ ఒక్కటి సాకారం చేయ‌‌లేక‌‌పోయారు. మన రాష్ట్ర అవసరాలకు నీటిని సాధించుకునేందుకు మళ్లీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సమాజం గుర్తిస్తున్నది. ఎస్​ఎల్బీసీ లాంటి ప్రాజెక్టులను కూడా ఇన్నేండ్లు పూర్తి చేసుకోలేకపోతే మనం సాధించుకున్న తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మెదడును తొలుస్తోంది.
రాష్ట్ర ప్రాజెక్టుల డిజైనర్ మేఘా
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్​రెడ్డి హయాంలో పోలవరం కెపాసిటీ పెంపును ఆపాలని తెలంగాణ ప్రజాసంఘాలు నెత్తి, నోరు మొత్తుకున్నాయి. కానీ స్వరాష్ట్రం వచ్చాక అయినా రాష్ట్రంలో నీటి అసమానతలు తగ్గుతాయనుకుంటే మరింత పెరిగాయి. ఆరోజు ఒక రాజకీయ అవసరం నడిపిస్తే.. ఈ రోజున వేరే అవసరం ఉన్నట్లు కేసీఆర్ ఈ ప‌‌ని చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న ఎస్​ఎల్బీసీ, పాలమూరు–రంగారెడ్డిలపై తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతోంది. మరోవైపు కల్వకుర్తి కెపాసిటీ పెంచేలా ప్రాజెక్ట్ రీడిజైన్ చేయడం కుదరదు అని రాష్ట్ర స‌‌ర్కారే మొండికేస్తోంది. ఇప్పడు తెలంగాణ ప్రాజెక్టులు డిజైన్ చేసేది ఇరిగేషన్ ఇంజినీర్లు కాదు... ఆ బాధ్యత మేఘా కృష్ణారెడ్డికి అప్పగించినట్లు కనిపిస్తోంది. కాంట్రాక్టర్లు అత్యధిక లాభాలు పొందాలనుకుంటారు తప్ప... కరువు ప్రాంతాల నీటి అవసరాలు, రాష్ట్రంలో ఆయకట్టు పెంపు గురించి పట్టించుకుంటారా? లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణం పరిశీలిస్తే చాలు ఆ ప్రాజెక్టు ప్రజలకు నీళ్లిచ్చేందుకు కట్టారా? నిధులు మింగేందుకు కట్టారా అనేది అర్థమవుతుంది.
కేసీఆర్ ​దొంగచాటు వత్తాసులు ఎండగట్టాలి
ఏపీ అక్రమ ప్రాజెక్టులను ముక్తకంఠంతో ఖండించడంతోపాటు టీఆర్​ఎస్ సర్కార్ దొంగచాటుగా పలుకుతున్న వత్తాసును ఎండగట్టాలి. ఇందుకోసం పార్టీలకు అతీతంగా నాయకులు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా నీటి వాటాలపై ఇంత అన్యాయం జరుగుతున్నా..  సీఎం కేసీఆర్ గమ్మున ఉండటానికి కాంట్రాక్టర్ల కమీషన్ కారణమ‌‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ను ఇంటికి పిలిపించుకొని ఆనాడు చర్చలు జరిపిన సీఎం, ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు జరగాలి. కానీ ఏపీ కృష్ణా నీరు అక్రమంగా తరలిస్తుండడంతో ద‌‌క్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం నెలకొంది. ఇంతటి విపత్తును కూడా కేసీఆర్ హుజురాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం నీళ్ల సెంటిమెంట్​ రెచ్చగొట్టేందుకు వాడుకోజూడడం దారుణం. దీన్ని గమనించిన త‌‌ర్వాత కేసీఆర్‌‌కి అధికారం ఇవ్వటమే తెలంగాణ ప్రజలు చేసిన అతి పెద్ద తప్పు అనే అవ‌‌గాహ‌‌న ఏర్పడుతుంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ రాగానే మళ్లీ అడుగుదాం అంటున్నార‌‌నీ, మన వాటా నీళ్లను ఎత్తుకుపోతున్న ఏపీ సీఎంను ఇంటికి పిలిచి విందులు ఎందుకు ఇచ్చారో స‌‌మాధానం చెప్పడం లేదు. అపెక్స్ మీటింగ్ కు వెళ్లకుండా, ఏపీ ప్రాజెక్టు డీపీఆర్​ సర్వే కోసం జీవోలు ఇచ్చినప్పడు, టెండర్లు పిలిచినప్పడు, పనులు ప్రారంభించినప్పడు సైలెంట్​గా ఉండి.. ఇప్పుడు టీఎంసీలు, క్యూసెక్కులు అంటే కూడా తెలియని మంత్రులు, నేతలతో రెచ్చగొట్టే కామెంట్లు చేయడం వెనక ఉద్దేశాలేంటి? ఎప్పటికప్పుడు అన్నీ తెలిసి కేసీఆర్ మాట్లడకపోవడంలో అర్థం ఏంటి? కృష్ణా జలాల వివాదంపై ఏ ఒక్క రోజైనా కేంద్రంతో కలిసి చర్చించారా? అనే దానికి సీఎం స‌‌మాధానం చెప్పాలి. రాయలసీమను రత్నాల సీమ చేసేముందు తెలంగాణను పట్టించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్​కు లేదా? ఒక బేసిన్ నుంచి మరో బేసిన్ కు నీటిని తరలించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసీ.. ఏపీ జల దోపిడీకి మద్దతుపలికినట్లుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసం.
నీళ్ల రాజకీయాలకు కుట్ర
కృష్ణా ప్రాజెక్టుల విష‌‌యంలో తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరు కూడా డ్రామా ఆడుతున్నారు. నీళ్ల పంచాయితీ కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నం జరుగుతోంది. నీళ్ల సెంటిమెంటుతో రాజకీయం చేసే దుర్మార్గమైన కుట్ర జరుగుతోంది. ‘‘వైఎస్ కు హారతి పట్టే సన్నాసులా మాకు నీతులు చెప్పేది’’ అన్న కేసీఆర్ ఇపుడు చేస్తున్నదేమిటి? సమైక్య రాష్ట్రంలో జరిగిన దానికంటే కేసీఆర్ ఎక్కువ అన్యాయం చేస్తున్నారు. కంచే చేను మేస్తే అన్న చందంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తుగడలను కేసీఆర్ వేస్తున్నారు. దక్షిణ తెలంగాణకు నీళ్లిచ్చే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కష్ణా నదిపై తాము కట్టబోయే ప్రాజెక్టులపై ఏపీ శాసనసభ సాక్షిగా ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన కేసీఆర్ పట్టించుకోకపోవడం దేనికి సంకేతం. దక్షిణ తెలంగాణ ఎడారైపోతుందని కేంద్ర జలశక్తి శాఖకు ప్రతిపక్షాలు లెటర్లు రాశాయి.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అక్రమ ప్రాజెక్టలపై ఒక్క అభ్యంతరం కేంద్రానికి తెలపకపోవడానికి కార‌‌ణాలేంటో కేసీఆర్ స‌‌మాధానం చెప్పగ‌‌ల‌‌రా? సంగమేశ్వర ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తీసుకుపోవడం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయమే క‌‌దా. అయినా మన సీఎం వీటిపై స్పందించలేదంటే జగన్..కేసీఆర్ మధ్య ఆర్ధిక, రాజకీయ లాభం ఉందని పసిబాలుడికి కూడా అర్థమవుతుంది. అపెక్స్ కౌన్సిల్‌‌కి కేసీఆర్ వెళ్లి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాద‌‌ని మెజార్టీ వాద‌‌న‌‌. సడెన్ గా ఇప్పడు మంత్రులు మాట్లాడ్డం హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం సెంటిమెంట్ ఎగదోసే ప్రయత్నం అని అంద‌‌రికీ తెలుస్తూనే ఉంది. కరువు జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్ పీడిత జిల్లా నల్గొండ, ఆకలిచావులు ఆత్మహత్యల రంగారెడ్డి జిల్లాలను రక్షించుకునేందుకు అంద‌‌రం క‌‌ల‌‌సి క‌‌ట్టుగా ప‌‌ని చేద్దాం. కారు పార్టీ బేఖాతరు విధానాల‌‌ను ఎండ‌‌గ‌‌డుదాం.

ఏడేండ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు
తన ఏడేండ్ల పాల‌‌న‌‌లో కృష్ణా జలాల గురించి కేసీఆర్ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. తెలంగాణ వచ్చేనాటికే  రాష్ట్రంలో 97 లక్షల 55 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాజెక్టులు, ఆయకట్టు.. ప్రస్తుత ప్రాజెక్టుల పరిస్థితి, ఆయకట్టు పెంపుపై ఎప్పుడైనా స్టడీ చేశారా? అని పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ప్రజలతో సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఉద్యమ కాలంలో ఆకాంక్షలు స్వరాష్ట్రంలో ఒక్కటి కూడా నెరవేర‌‌ని దుస్థితి ఉంది. తెలంగాణ సమాజానికి కేసీఆర్ చేసిన, చేస్తున్న అన్యాయాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నాయి. ఇందుకేనా స్వరాష్ట్రం తెచ్చుకున్నది... అని కడుపు తరుక్కుపోతోంది. రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల వద్దకెళ్లి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ పోరాటాలే ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమంగా రూపుదాల్చుతుంది.

                                                                                                                                            - మ‌‌న్నారం నాగ‌‌రాజు,రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ లోక్‌‌స‌‌త్తా పార్టీ