Shivam Dube: చెన్నై అల్‌రౌండర్ జేబులు తనిఖీ చేసిన అంపైర్‌.. అసలు కారణం ఇదే..!

Shivam Dube: చెన్నై అల్‌రౌండర్ జేబులు తనిఖీ చేసిన అంపైర్‌.. అసలు కారణం ఇదే..!

శుక్రవారం(ఏప్రిల్ 19) చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూప‌ర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట రవీంద్ర జడేజా(57), మొయిన్ అలీ(30) రాణించడంతో చెన్నై 176 పరుగులు చేయగా.. లక్నో బ్యాటర్లు 19 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని చేధించారు. బ్యాటర్లు పర్వాలేదనిపించినప్పటికి.. చెన్నై బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఛేదనలో కేఎల్ రాహుల్(82), క్వింటన్ డికాక్(54) హాఫ్ సెంచరీలతో మెరిశారు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌ సందర్భంగా ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో అజింక్య రహానే(36) ఔట్ అవ్వగానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శివమ్ దూబే క్రీజులోకి వచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికి అంటే సీఎస్‌కే ఇన్నింగ్స్ సగం దశలో ఉన్న సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి.. అతని జేబును అనుమానాస్పదంగా పరిశీలించారు. ఈ ఆకస్మిక తనిఖీ అటు స్టేడియం ఉన్నవారిని.. ఇటు టీవీల ద్వారా చూస్తున్న వారిని ఇద్దరినీ కలవరపరిచింది. అంపైర్.. దూబే జేబులో ఏదేని అవాంఛిత పదార్థాన్ని(బంతి ఆకారాన్ని మార్చే వస్తువులు) కనుగొన్నట్లుగా ఊహాగానాలు వచ్చాయి. క్షణాలలో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

అసలు కారణం ఇదే..!

దూబే జేబు నుండి బయటకు వేలాడుతున్న టవల్‌ని లోపలికి నెట్టడానికే అంపైర్ అలా చేశాడని ఓ భారత మాజీ దిగ్గజం వివరణ ఇచ్చారు. అతను ఎలాంటి అవాంఛిత పదార్థాన్ని మైదానంలోకి తీసుకురాలేదని, అభిమానులు ఊహాగానాలను అదుపులో ఉండటం చాలా మంచిదని సలహా ఇచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో దూబే కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.