
టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో వర్క్ ప్రెజర్ చాలా వరకు తగ్గుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇక్కడ ఏఐ భార్యాభర్తల కాపురంలో చిచ్చు పెట్టింది. చాట్ జీపీటీ వల్ల గ్రీస్‌లో ఒక జంట మధ్య గొడవ మొదలై విడాకుల వరకూ వచ్చింది.
గ్రీస్‌లో కాఫీ తాగిన తర్వాత ఆ ఖాళీ కప్పుని, అందులో మిగిలిపోయిన టీ పౌడర్ని విశ్లేషించి ఆ వ్యక్తి వ్యక్తిత్వం, గుణం, లక్షణాలను వివరించే ఒక రకమైన జ్యోతిష్య శాస్త్రాన్ని చాలామంది నమ్ముతారు. దాన్ని వాళ్లు టాస్సియోగ్రఫీ అంటారు. దీని ద్వారా ప్రేమ, కెరీర్, రిలేషన్‌షిప్ లాంటివి కూడా తెలుసుకోవచ్చు. అయితే.. గ్రీస్ దేశానికి చెందిన ఒక మహిళ తన భర్త వ్యక్తిత్వం గురించి తెలుసుకునేందుకు అతను కాఫీ తాగిన తర్వాత కప్పుని ఫొటో తీసి చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసింది.
టాస్సియోగ్రఫీ ప్రకారం తన భర్త గురించి చెప్పమని అడిగింది. అందుకు సమాధానంగా ఏఐ చాట్‌బాట్.. ఆమె భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని చెప్పింది. అంతేకాదు.. ఆ సంబంధం పెట్టుకున్న మహిళ పేరులో మొదటి అక్షరం ఇంగ్లీష్ ఇ(E) అని కూడా చెప్పింది. దాంతో ఆ మహిళ ఇదంతా నిజమని నమ్మి భర్తకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. వాళ్లకు పెండ్లి జరిగి పన్నెండేండ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ.. ఏఐ వల్ల కాపురంలో ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి. వైవాహిక బంధాన్ని తెంచుకునేందుకు ఆమె కోర్టు నుంచి నోటీసులు కూడా పంపింది. ఆమె భర్త మాత్రం స్థానిక టీవీ చానెల్‌లో మాట్లాడుతూ.. తన భార్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని చెప్పాడు.