ఆదాయం చెప్పని భర్త.. ఆర్టీఐతో తెలుసుకున్న భార్య

ఆదాయం చెప్పని భర్త.. ఆర్టీఐతో తెలుసుకున్న భార్య

మీరు ఎంత సంపాదిస్తారు అనే ప్రశ్న చాలా సాధారణమైనది, మామూలుదే కూడా. కానీ ఇదే ప్రశ్న భార్యలు భర్తలను అడిగితే మాత్రం చెప్పడానికి కాస్త సంకోచిస్తారు. దానిపై చర్చించడానికి కూడా కొంతమంది భర్తలు అస్సలు ఇష్టపడరు. అయితే ఇలాంటి విషయాలు విడాకులు తీసుకున్నప్పుడు మాత్రం తేటతెల్లం కావల్సిందేనని ఓ మహిళ నిరూపించింది. దీంతో కేంద్ర సమాచార కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. భర్త ఆదాయ వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారం 15 రోజుల్లోగా ఐటీ శాఖ నుంచి పొందొచ్చని తెలిపింది. ఇటీవల ఓ మహిళ తన భర్త ఆదాయ వివరాలను అడగగా అతడు చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె ఆర్టీఐ ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సీఐసీ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

భార్యాభర్తలు విడాకులు తీసుకున్నపుడు కొన్ని సందర్భాల్లో భార్య తన భర్త నుంచి ఆదాయ వివరాలను కోరవచ్చు లేదంటే.. భరణమైనా డిమాండ్ చేయవచ్చు. ఈ సందర్భంలో ఆ భర్త తన ఆదాయ వివరాలను చెప్పడానికి నిరాకరిస్తే 15 రోజుల్లోగా వాటిని పొందొచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పైన చెప్పిన దాని ప్రకారం ఆ మహిళ తన భర్త ఆదాయ వివరాల కోసం ఇంతకు మునుపే పలుమార్లు ఆర్టీఐ పిటిషన్ ద్వారా ప్రయత్నించింది. కానీ తొలి రెండు దశల ఆర్టీఐ అప్పీళ్లలో విఫలమైంది. చివరకు ఆమె కేంద్ర సమాచార కమిషన్ ను ఆశ్రయించగా.. భర్త ఆదాయ వివరాలను ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.