భర్త తాగుడు మానలేదని ప్రాణాలు తీసుకున్నభార్య

V6 Velugu Posted on Sep 25, 2021

శంషాబాద్​, వెలుగు: మహ్మద్​ సాజిద్​(36), షబానా బేగం (35) దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు. టెంట్​ హౌస్​ నడిపే ఇంటి పెద్ద సాజిద్​ తాగుడుకు బానిసైండు. మందు తాగొద్దని ఆ ఇంటి ఇల్లాలు షబానా నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా అతడు మారలేదు.. మందు మానలేదు. రోజూ తాగొచ్చి భార్యపై వేధింపులకు పాల్పడ్డాడు. అతగాడి చేష్టలకు విసుగొచ్చిన ఆ ఇల్లాలు ఇక చాలనుకుంది. రెండ్రోజుల కిందట తన భర్త కళ్ల ముందే పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన భర్త.. ఏమీ కాలేదన్నట్టు 4 గంటలు చూస్తూ ఉండిపోయాడు. వారి పిల్లలే ఇరుగుపొరుగువారికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న షబానా శుక్రవారం చనిపోయింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ పరిధిలో ఉన్న ఎంఎం పహాడీలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి సాజిద్​ను అదుపులోకి తీసుకున్నారు. అమ్మ చనిపోవడం, నాన్నను పోలీసులు అరెస్ట్​ చేయడంతో వారి పిల్లలు సమీరన్​ బేగం (12), జకియా బేగం (10), ముస్కాన్​ బేగం (9), సానియా బేగం (7), సమీరా బేగం (5) అనాథలుగా మిగిలిపోయారు. 
 

Tagged HUSBAND, hydarabad, rajendranagar, wife suicide, stop drinking

Latest Videos

Subscribe Now

More News