
- అంత్యక్రియల తర్వాతి నుంచి కనిపించలేదంటున్న బంధువులు
- భర్త చితి దగ్గర చెప్పులు, కళ్లద్దాలనుగుర్తించి పోలీసులకు ఫిర్యాదు
రాయ్‌గఢ్:భర్త మరణించిన తర్వాత అతడి భార్య కనిపించకుండాపోయింది.అయితే, భర్త చితిలోనే దూకి ఆమె ఆత్మహత్య చేసుకుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె బట్టలు, చెప్పులు, కళ్లద్దాలు భర్తను దహనం చేసిన చోటే కనిపించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ లో మంగళవారం ఈ ఘటన జరిగింది. చక్రధర్ నగర్ప్రాంతానికి చెందిన జైదేవ్ గుప్తా(65) క్యాన్సర్‌తో ఆదివారం మరణించాడు.
అతని దహన సంస్కారాలు అదే రోజు సాయంత్రం గ్రామంలో నిర్వహించి అంతా ఇంటికి చేరుకున్నారు. మనస్తాపంలో ఉన్న భార్య గులాబీ గుప్తా(58) అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా గాలించగా, ఆమె చెప్పులు, కళ్లద్దాలు, బట్టలు భర్త చితి వద్ద కనిపించాయి.
దీంతో గులాబీ గుప్తా భర్త చితిలోనే దూకి ఆత్మహత్య చేసుకుందని భావించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఫోరెన్సిక్ బృందం చితి నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.