వెలుగు ఓపెన్ పేజీ : కొత్త శకం మొదలవుతోందా?

వెలుగు ఓపెన్ పేజీ : కొత్త శకం మొదలవుతోందా?

సాయుధ  నక్సలైట్  పోరాటానికి  డెడ్‌‌‌‌లైన్‌‌‌‌గా  కేంద్రం నిర్ణయించిన గడువు మార్చి 31 మూడు రోజుల్లో  ముగియనుంది.  ఏప్రిల్ 1 నుంచి  దేశంలో ఇక సాయుధ నక్సలైట్ రహిత  కొత్త శకం  మొదలవుతున్నట్టే!  నక్సలైట్లే అభివృద్ధికి ఆటంకమంటూ వచ్చిన ప్రభుత్వం ముందు..  ప్రజల కోసమే ఉద్యమమని చెబుతూ గడచిన రెండేళ్లు పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టుల ముందు కొత్త కర్తవ్యాలున్నాయి. వాటిని వారెలా నెరవేరుస్తారు?  దేశంలో  నక్సలైట్ల  పుట్టుక,  ఉద్యమానికి  కారణమైన  మౌలిక పరిస్థితులు  ఇపుడు  ప్రజాక్షేత్రంలో  లేకుండా పోయాయా?  ఉంటే, వాటిని అటు ప్రభుత్వం,  ఇటు లొంగిపోయిన నక్సల్ నాయకులు ఎవరెలా అడ్రస్ చేస్తారు? అన్నది ప్రశ్న! సాయుధ  నక్సలైట్ ఉద్యమం అంతరించిందా? అంటే ఇన్నాళ్లూ ఉన్న స్వరూపంలో అది అంతమయినట్టే!  మరేదైనా  రూపం సంతరించుకుంటుందా? అన్నది ప్రజల పరిస్థితి, ప్రభుత్వాల నడతను బట్టి ఉంటుందే తప్ప ఇప్పటికిప్పుడు  చెప్పడానికి వీల్లేదు.   స్వాతంత్ర్య  భారత్‌‌‌‌లో  ఆరు దశాబ్దాలు సాగిన ఒక సమాంతర చరిత్రను ‘గడిచిన అధ్యాయం’ అని కొట్టివేయడం కన్నా ఇరువైపుల వారూ  ఆత్మవిమర్శ  చేసుకోవాల్సిన  సమయమిది.

రైతాంగం,  కౌలుదారులు, కూలీలు, ఆదివాసీల హక్కుల కోసం  దేశంలో మొదలైన నక్సలైట్​ ఉద్యమం వివిధ స్వరూపాలు,  స్వభావాలు,  దశలు దాటి  ప్రస్తుతం ముగింపుకొచ్చింది.  కమ్యూనిస్టు  ఎం.ఎల్ గ్రూపులు, పీపుల్స్‌‌‌‌వార్,  మావోయిస్టు పార్టీ  వేదికలుగా  ఇది విస్తరిస్తూ వచ్చింది.  ప్రజలే  కేంద్రకంగా ఒకవైపు నక్సలైట్లు,  మరోవైపు  రాజ్యం  నడుమ హింస,  -ప్రతిహింసల పర్వం  దశాబ్దాలు సాగింది.  నక్సలైట్లు,  భద్రతా బలగాలు,  ఇన్ఫార్మర్లు, మద్దతుదారులు,  కోవర్టులు....  దేశ పౌరుల  నెత్తుటితో,  వారి  కుటుంబీకుల కన్నీళ్లతోనూ  ఈ నేల తడుస్తూ వచ్చింది.  నక్సలైట్లు,  భద్రతా బలగాల్లోని  ముఖ్యులతోపాటు  పలువురు ఎమ్మెల్యేలు,  ఎంపీలు,  మంత్రులు ఈ పోరులో  సమిధలయ్యారు.  ఒక  సీఎం  కాన్వాయ్ పై  జరిగిన  నక్సల్‌‌‌‌ దాడిలో  ఆయన  తృటిలో  తప్పించుకున్నారు.   పశ్చిమ బెంగాల్  సిలిగురి  ప్రాంతపు  నక్సల్బరి  గ్రామం  నుంచి మొదలై నక్సలైట్ ఉద్యమంగా  శ్రీకాకుళం,  జగిత్యాల, బస్తర్,  దండకారణ్యం, ఏఓబీ,  రెడ్ కారిడార్.... ఇలా వివిధ ప్రాంతాలకు, వేర్వేరు కాలాలకు విస్తరిస్తూ సాగిన పోరాటపు అవసానమిది.  నీడ మిగిలింది.    ‘2026 మార్చి నెలాఖరు నాటికి ఈ దేశంలో సాయుధ  నక్సలైట్లు లేకుండా చేస్తాం’ అని  కేంద్ర హోంమంత్రి  అమిత్ షా  2024లో  ప్రకటించారు.  ‘గ్రీన్ హంట్’కి  కొనసాగింపుగా  మొదలైన  ‘ఆపరేషన్  కగార్​’  దేశంలోని  వామపక్ష  తీవ్రవాదం (ఎల్‌‌‌‌డబ్లుఈ)గా  ముద్రపడిన  నక్సలైట్ ఉద్యమాన్ని, ప్రధానంగా ‘మావోయిస్ట్’ పార్టీ వ్యవస్థను  చిన్నాభిన్నం  చేసింది.  కేంద్ర,  రాష్ట్రాల  పారామిలిటరీ,  పోలీసు బలగాల  చర్యల్లో అది తుత్తునీయలైంది.   పలు పరిణామాల  ఫలితమే ఈ అంత్యదశ! 

2025 నిర్ణాయక యేడు!

రెడ్ కారిడార్​గా  పరిగణించే  మహారాష్ట్ర,  తెలంగాణ,  చత్తీస్‌‌‌‌గఢ్,  ఒడిషా,  జార్ఖండ్,  బిహార్  రాష్ట్రాల్లో  నక్సల్  కార్యకలాపాలు  ఒక దశలో  తీవ్రస్థాయికి చేరాయి.  ఎం.పీ  సునీల్ మహతోను  హతమార్చడంతోపాటు బలగాలపైన,  సాధారణ  పౌరులమీద  నక్సల్ దాడులు పెరిగాయి.  సీపీఐ (మావోయిస్ట్) నక్సలైట్లు 2010  ఏప్రిల్​లో  దంతెవాడలో జరిపిన మెరుపు
దాడిలో 76 మంది   సీఆర్పీఎఫ్   సిబ్బంది హతమయ్యారు.  ‘మావోయిస్ట్ ఉద్యమం దేశంలో ఆంతరంగిక  భద్రతకు  అత్యంత ప్రమాదకరంగా మారింది’ అని  అప్పటి యూపీఏ  ప్రభుత్వాధినేత,   ప్రధాని  మన్మోహన్‌‌‌‌సింగ్  ప్రకటించారు.  కేంద్రం,  ప్రభావిత  రాష్ట్ర  ప్రభుత్వాల  మధ్య  సమన్వయం ద్వారా 2012 తర్వాత  నిర్బంధం పెరిగింది.  ‘కొత్తగా విధుల్లో చేరిన ఎస్‌‌‌‌ఐకి  ఏకే47 తుపాకీ లభిస్తే  చెలరేగిన చందంగా  కేంద్ర హోంమంత్రి  చిదంబరం వ్యవహరిస్తున్నారు’ అని  హక్కుల యోధుడు  కె.బాలగోపాల్  అప్పట్లో  వ్యాఖ్యానించారు. ఆరు రాష్ట్రాలు, 180  జిల్లాల్లో  కార్య కలాపాలు నడిపిన దశ నుంచి క్రమంగా  మావోయిస్ట్ పార్టీ  పతనమౌతూ వచ్చింది. 2014లో 126,   అనంతరం  అయిదారేళ్లలో  బస్తర్,  దంతెవాడ,  గడ్చిరోలి,  సుక్మ... ఇలా 18 జిల్లాలకు పరిమితమైంది.  2024 అమిత్‌‌‌‌షా  ‘డెడ్‌‌‌‌లైన్  ప్రకటన’ తర్వాత  నిర్బంధం తీవ్రమైంది.  2025 నాటికి  వామపక్ష తీవ్రవాదం కేవలం 11 జిల్లాల్లోనే ఉందని కేంద్రం చెప్పింది. 

కీలక క్యాడర్​ లొంగుబాటు 

2026 ఫిబ్రవరి నాటికి అది బిజాపూర్, నారాయణపూర్, సుక్మ, కంకర్, దంతెవాడ (చత్తీస్‌‌‌‌గఢ్), వెస్ట్ సింఘబోన్ (జార్ఖండ్), కందమాల్ (ఒడిషా) కేవలం 7 జిల్లాల్లో  నామమాత్రమయింది. 2025  మేలో  పార్టీ  ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావ్‌‌‌‌తోపాటు మరో 26 మందిని హతమార్చడం పెద్ద దెబ్బ!  2010 దంతెవాడ మెరుపుదాడి సూత్రధారిగా పేరున్న  సెంట్రల్  కమిటీ  కమాండర్  మాద్వి హిడ్మ,  మరికొంత మందిని ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 2025 నవంబరులో  హతమార్చిన ఘటన తర్వాత ఇక నక్సలైట్ ఉద్యమం ముగిసినట్టే అన్నారు.  ఆ సంవత్సరంలోనే  ఎంతోమంది సెంట్రల్ కమిటీ సభ్యులు హతమయ్యారు.  అదే  అక్టోబర్‌‌‌‌లో  పార్టీ   పొలిట్‌‌‌‌బ్యూరోకు  చెందిన  మల్లోజుల వేణుగోపాల్ నుంచి,  తిప్పిరి  తిరుపతి  అలియాజ్  దేవ్‌‌‌‌జీ,  మల్లా  రాజిరెడ్డి  నుంచి  నిన్నటి  పాపారావు వరకు  ముఖ్యమైన  నాయకులు,  ఇతర  క్యాడర్  లొంగుబాటలో  సాగడం  కీలక  పరిణామమే!  2026  ఫిబ్రవరిలో ప్రభాకర్‌‌‌‌రావు,  పరకాల్ వీర్,  స్వామి,  లోకేటి చందర్‌‌‌‌రావు,  పడకల్ స్వామి  తదితరుల  ఎన్‌‌‌‌కౌంటర్లకు  ముందు, వెనుక  పెద్దసంఖ్యలో  లొంగుబాట్లు జరిగాయి.  కేంద్ర  సమాచార విభాగం (పీఐబీ) ప్రకారం  ఒక్క 2025లోనే 800 మంది అరెస్ట్ కాగా  2000 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారు. 2023-–2025 రెండేళ్ల కాలంలో సీఆర్పీఎఫ్​  బలగాల చేత  కాల్పుల్లో 900 మంది మరణించగా  5,594 మంది లొంగిపోయారు.

తిరోగమనాన్ని గుర్తించారు

‘చావు ద్వారం వద్ద  నిలబడి పిలుస్తుంటే  పగలబడి నవ్వేవారెవరు?  శబాష్  నా వీరులారా!  చావుకే  మీరు ఘోరీలు కడుతున్నారు’ అన్న సముద్రుడి కవిత (బేబాకీ) రోజులు కావివి.  నక్సలైట్ ఉద్యమం పరిపరి విధాల పలుచనయింది.  బాలగోపాల్  ‘చీకటి కోణం’  సమీక్ష నాడే  కళ్లు తెరిచి ఉంటే  పరిస్థితి వేరేలా ఉండేది.  రైతాంగమని,  కౌలురైతులని,  వ్యవసాయ కూలీలని,  తునికాకు  వనితలని,  బీడీ చుట్టే  మహిళలని,  సింగరేణి  కార్మికులని, బడుగు, బలహీనవర్గాలని.... ఇలా  వారి హక్కుల కోసం  ప్రాణాలొడ్డి  నిలబడ్డప్పుడు, మెరుగైన కూలీ డబ్బులతో వారి జీవన ప్రమాణాల్లో ఎంతోకొంత  కొత్త వెలుగులు  తెచ్చినప్పటి  ఉద్యమం వేరు.  నక్సల్బరీలో  చారు మజుందార్, కానూ సన్యాల్  ఉద్దేశ్య  ప్రకటన నుంచి  వెంపటాపు సత్యం,  సుబ్బారావు పాణిగ్రాహి  శ్రీకాకుళంలో వేడి పుట్టించినపుడు,  జగిత్యాల  పోరుబాటలో  గణపతి వంటి వారు జ్వాలలు రేపినపుడూ..... లక్ష్యాలివే!   వేర్వేరు కారణాల వల్ల నక్సలైట్  ఉద్యమం  కాలక్రమంలో  ప్రజామద్దతు  కోల్పోయింది.  ‘2012 నుంచి పురోగమనంలో లేం,  తిరోగమనంలోనే ఉన్నాం’ అని లొంగుబాటు  సమయంలో దేవ్‌‌‌‌జీ అన్న మాటలు స్వీయ జ్ఞానోదయానికి సంకేతం! 

కొరవడిన మద్దతు

2004 చర్చల  సందర్భంగా  నక్సలైట్ నాయకత్వం మాటలు,  స్వరం,  ప్రజాపక్ష  వైఖరికి ఇటీవలి లొంగుబాట్ల సందర్భంగా చెప్పిన మాటల మధ్య ఎంతో వ్యత్యాసముంది.  చర్చలకు ముందు, వెనుక,  చర్చల సందర్భంగా శంకరన్, పొత్తూరి  వెంకటేశ్వరరావు,  బొజ్జా తారకం,  వరవరరావు,  హరగోపాల్,  బాలగోపాల్ వంటి  పేరున్న వ్యక్తుల మద్దతు  నక్సల్ ఉద్యమానికి లభించింది.  కారణాలేమైనా ఇప్పుడటువంటి  మద్దతు కొరవడింది. లంపెన్ శక్తుల ఆధిపత్యం,  స్వార్థం,  హింస,  కుల కుమ్ములాటలు,  ట్రిగ్గర్ మోజు,  వ్యక్తిగత  తగాదాలు-,  పంచాయితీల్లో జోక్యాలు  ఇలా పలు అంశాలు నక్సలైట్ ఉద్యమాన్ని బలహీనపరచి, అట్టడుగు ప్రజల్లో ఆదరణ, ఆశ్రయం లేకుండా చేశాయి.  2004 చర్చలతో  నష్టపోయామని  నక్సల్  నాయకత్వం  ప్రకటించినప్పటికీ, అప్పుడు  లేవనెత్తిన  పౌర అంశాలతో వారు జనంలోకి వెళ్లి ఉంటే మళ్లీ బలపడే ఆస్కారం ఉండింది. కానీ, వారలా చేయలేదు.

ఇదే ఆఖరవుతుందా?

ఏ  ప్రజా ఉద్యమమైనా త్యాగాలతోనే  పరిపుష్టమౌతుంది.  నక్సలైట్ ఉద్యమం  మరణశయ్యపైకి చేరాక లొంగుబాటలోకి  వచ్చిన  మల్లోజుల  ‘పరిస్థితులు మారాయి,  సాయుధ పోరాటం చేసే స్థితి లేదు.  దాన్ని పక్కనపెట్టి   ప్రజల్లోకి  వెళ్లి  పనిచేయాలి’ అన్నారు.  లొంగుబాట  ఏ  ఒక్కరి నిర్ణయం కాదు,  ఏడాది కింద చనిపోయిన బస్వరాజు  అంతకు ముందే చెప్పాడు,  ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలన్నాడు’ అని సతీశ్  అలియాజ్  వాసుదేవరావ్  గుర్తు చేసుకున్నాడు.  ‘ఈ రూపంలో  ఇది ముగిసినట్టే,  ప్రజావసరాన్ని బట్టి మరో రూపంలో రావొచ్చేమో?’ అని  దేవ్‌‌‌‌జీ  ఒక  సందేహం వ్యక్తం చేశారు.    సాయుధ  నక్సలైట్ ఉద్యమం ముగిసిందని  ప్రకటించడం కొత్తకాదు.  క్రీస్తుశకానికి నూరేళ్లు ముందు ‘స్పార్టకస్‌‌‌‌’ను  అంతమొందించినపుడూ  రోమ్  సామ్రాజ్యాధినేతలు అదే అన్నారు. ‘నక్సల్ ఉద్యమాన్ని అంతమొందించాం’అని 1970లో నాటి  హోం మంత్రి జలగం వెంగళరావు (తర్వాత సీఎం) అంటే, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆంధ్రప్రభ’ పతాక  శీర్షికల్లో  వచ్చింది.   సంపద- పేదరికం ఎక్కడికక్కడ  కుప్పపడకుండా  చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం రాసుకున్న నాటికన్నా  వందలు, వేల రెట్లు ఆర్థిక అంతరాలు పెరిగిన  సమాజం మనదిపుడు.  ప్రజలు, సమస్యలు  ఉన్నంతకాలం వాటి పరిష్కారానికి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి.  పేరు, స్వరూపం వేరు!  నాయకులు  మారొచ్చు,  పార్టీలకు పేర్లు  మారొచ్చు. అందుకే అన్నారు, విప్లవం నేరుగా ఉత్పత్తి కాదు,  విప్లవపరిస్థితుల నుంచి పుట్టే  ఉప ఉత్పత్తి. అందుకని, ఆరు దశాబ్దాల సమాంతర చరిత్రపై ఇరుపక్షాలూ  ఆత్మవిమర్శ చేసుకోవాలి.

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్