అవసరమైతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతా: జేడీ వాన్స్

అవసరమైతే అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపడతా: జేడీ వాన్స్

వాషింగ్టన్: అవసరమైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగాలేదన్న ప్రచారంపై గురువారం ‘యూఎస్ఏ టుడే’ ఇంటర్వ్యూలో వాన్స్ స్పందించారు. ‘‘ట్రంప్ హెల్త్ అద్భుతంగా ఉంది. 

ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగుతారు. అనుకోకుండా పెను విషాదం తలెత్తితే గనక ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టేందుకే నాకు వైస్ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు ఇచ్చారు. గత 200 రోజుల పాలనలో టాప్ జాబ్ చేపట్టేందుకు తగిన ట్రెయినింగ్ పొందినట్టుగానే భావిస్తున్నా” అని ఆయన అన్నారు. 

‘‘నేను, నా భార్య ఉష ప్రస్తుతం మా బాధ్యతలు నిర్వర్తించడంపైనే ఫోకస్ పెట్టాం. భవిష్యత్తులో ప్రెసిడెంట్ గా అవకాశం వస్తే, అప్పుడు ఆలోచిస్తాం” అని వాన్స్ స్పష్టం చేశారు. కాగా, 79 ఏండ్ల ట్రంప్ క్రానిక్ వీనస్ ఇన్ సఫిషియెన్సీ(గుండెకు రక్తాన్ని చేరవేసే సిరలు బలహీనం కావడం) సమస్యతో బాధపడుతున్నారని వైట్ హౌస్ గత జులైలో ప్రకటించింది. ఇది సాధారణ ఆరోగ్య సమస్యేనని తెలిపింది. 

ట్రంప్ ఎక్కువగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం వల్లే ఆయన చేతిపై చర్మం ఇరిటేట్ అయి కమిలిన గుర్తులు కనిపించాయని, అంతకుమించి అనారోగ్య సమస్యేమీ లేదని వివరణ ఇచ్చింది. అయితే, తాను మొదలుపెట్టిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్(మాగా)’ ఉద్యమానికి 41 ఏండ్ల జేడీ వాన్స్ వారసుడని ట్రంప్ ఈ నెల మొదట్లో చెప్పారు. దీంతో ట్రంప్ ఆరోగ్యం బాగాలేదని, వయసు మీరిపోతున్నందుకే అధ్యక్ష పీఠంపై వాన్స్ కన్నేశారన్న  ప్రచారం మొదలైంది.