ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పరిమితులు.. దొడ్డు వడ్లపై నిల్వలపై పరేషాన్

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పరిమితులు.. దొడ్డు వడ్లపై నిల్వలపై పరేషాన్
  • రాష్ట్రంలో ఇప్పటికే 70.06 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
  • అందులో 56.50 లక్షల టన్నులు దొడ్డు రకాలే
  • బాయిల్డ్ రైస్‌‌ తీసుకునేందుకు మొగ్గు చూపని కేంద్రం
  • రెండు సీజన్లలో కలిపి 25 లక్షల టన్నులకే అనుమతి 
  • రేషన్ ​షాపుల ద్వారా సన్న బియ్యమే పంపిణీ
  • ఇతర రాష్ట్రాలు, వేరే దేశాలకు ఎగుమతులు బంద్​
  • సేకరించినవి ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న పౌరసరఫరాల శాఖ
  • కేంద్రం టార్గెట్‌‌కు మించి రెండున్నరేళ్లలో అదనంగా 57 లక్షల టన్నుల  ధాన్యం కొనుగోలు
  • రాష్ట్ర ప్రభుత్వంపై రూ.16,479 కోట్ల అదనపు భారం 

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరగడం రైతులకు ఊరటనిచ్చినా, ఇప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. రైతులు ఈసారి సన్నాలకు బదులు దొడ్డు వడ్లను ఎక్కువగా సాగు చేయడంతో వాటిని ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్‌‌ రైస్‌‌ కొనుగోళ్లపై పరిమితులు విధించడంతో పాటు అదనపు ధాన్యాన్ని స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటివరకు 70.06 లక్షల టన్నుల ధాన్యాన్ని  కొనుగోలు చేయగా, అందులో 56.50 లక్షల టన్నులు దొడ్డు రకాలే కావడం గమనార్హం. కానీ కేంద్రం గత వానకాలం, ప్రస్తుత యాసంగి సీజన్‌‌లలో కలిపి కేవలం 25 లక్షల టన్నుల బాయిల్డ్‌‌ రైస్‌‌ మాత్రమే తీసుకునేందుకు అంగీకరించింది. గతంలో మాదిరి ఇతర రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం తినడంలేదు. వేరే దేశాల నుంచి కూడా 

ఆర్డర్లు లేవు 

ఈ యాసంగి సీజన్​లో నీటి లభ్యత పెరగడం, భూగర్భజలాలు సమృద్ధిగా ఉండటం వల్ల రాష్ట్రంలో వరి సాగు 60 లక్షల ఎకరాలు దాటింది. ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించినప్పటికీ రైతులు అధిక దిగుబడి వచ్చే దొడ్డు రకాలనే ఎక్కువగా సాగు చేశారు. ఎకరానికి 25 నుంచి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉండడం, పెట్టుబడి, పంట కాలం తక్కువ కావడంతో చాలామంది రైతులు దొడ్డు రకాల వైపు మళ్లారు. దీంతో మార్కెట్‌‌కు వచ్చిన వడ్లలో సుమారు  80శాతం దొడ్డు రకాలే ఉన్నాయి. గతేడాది యాసంగిలో 27.35లక్షల టన్నుల సన్న ధాన్యం కొనుగోలు చేయగా, ఈయేడు కేవలం 15లక్షల  టన్నులలోపే సన్న వడ్లు రావడం గమనార్హం. అంటే గతేడాదితో పోలిస్తే సన్న వడ్లు సగానికి పడిపోగా, ఆమేరకు దొడ్డు రకాలు పెరిగాయి.

కేంద్రం వైఖరితో పెరిగిన ఆందోళన

దొడ్డు ధాన్యం ప్రధానంగా బాయిల్డ్‌‌ రైస్‌‌ తయారీకి అనువుగా ఉంటుంది. కానీ కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్‌‌లో రా రైస్‌‌కు ప్రాధాన్యం ఇస్తూ, బాయిల్డ్‌‌ రైస్‌‌ను క్రమంగా తగ్గిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు అదనపు బాయిల్డ్‌‌ రైస్‌‌ను స్వీకరించాలని కోరినా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో మిల్లింగ్ అనంతరం కేంద్రానికి సరఫరా చేయాల్సిన దొడ్డు ధాన్యం నిల్వల విషయంలో అనిశ్చితి నెలకొంది.

ప్రత్యామ్నాయాలు కనిపించట్లే..

ప్రభుత్వం గతంలో  రేషన్ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం, ఇతర రాష్ట్రాలకు విక్రయించడంతోపాటు విదేశాలకు ఎగుమతి చేసేది. కానీ  ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక రాష్ట్రంలోని పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. అటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి దొడ్డు బియ్యానికి డిమాండ్​ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌‌లో కూడా బియ్యం ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు హార్మూజ్ ఎఫెక్ట్‌‌తో ఎగుమతుల అవకాశాలు తగ్గడం లాంటి సమస్యలు నెలకొన్నాయి. దాంతో రైతుల నుంచి సేకరించిన దొడ్డు వడ్లను ఏంచేయాలో తెలియక  సివిల్​ సప్లై శాఖ తలపట్టుకుంటోంది. 

అందుబాటులో ఉన్న గోదాములు మిగులు బియ్యంతో నింపేస్తున్నామని, తర్వాత పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని పౌరసరఫరాల శాఖలోని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’కు చెప్పారు. గత పదేళ్లలో కేంద్రం పెట్టే టార్గెట్ ఎక్కువగా ఉంటే ప్రోక్యూర్‌‌‌‌మెంట్​తక్కువగా ఉండేదని, కానీ రెండున్నర ఏళ్లుగా కేంద్రం టార్గెట్​తగ్గిపోగా, రాష్ట్ర సర్కారు సేకరణ లక్ష్యం పెరిగిపోతందని ఆయన వెల్లడించారు. కేంద్రం టార్గెట్​ కంటే 57లక్షల టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా కొనడం వల్ల రాష్ట్ర సర్కారుపై ఈ రెండున్నరేళ్లలో రూ.16,479కోట్ల అదనపు భారం పడిందని సదరు అధికారి స్పష్టంచేశారు. పదేళ్ల బీఆర్‌‌‌‌ఎస్ కాలంలో కేంద్రం టార్గెట్​ కంటే అదనపు ధాన్యం కొనుగోళ్ల ద్వారా పడిన భారం రూ.352కోట్లు మాత్రమేనని ఆయన వివరించారు.