రాష్ట్రం విడిపోతే బీసీలు ఓసీలు అవుతారా : ఆర్.కృష్ణయ్య

రాష్ట్రం విడిపోతే బీసీలు ఓసీలు అవుతారా : ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడిన వెంటనే 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీ కమిషన్ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, వెంటనే వారిని బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. 26 బీసీ కులాల పోరాట సమితి ఆధ్వర్యంలో స్టేట్​ ప్రెసిడెంట్ ఆళ్ల రామకృష్ణ అధ్యక్షతన శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘‘తెలంగాణ బీసీ కులాల ఆత్మగౌరవ సభ”లో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు, రాజ్యాంగం ప్రకారం కులాలను తొలగించాలన్నా.. కలపాలన్నా.. బీసీ కమిషన్ ద్వారానే చేయాలన్నారు. 

రాష్ట్రం విడిపోతే బీసీలు.. ఓసీలు కావడం ఏంటన్నారు. 2014 కంటే ముందు తల్లిదండ్రులు బీసీలు అని, ఇప్పుడు వారి కడుపున పుట్టిన పిల్లలు ఓసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరి చివర్లో జంతర్ మంతర్ వద్ద బీసీల ఆత్మగౌరవ గర్జన సభను ఏర్పాటు చేసి నిరసన చెప్తామన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ నీల వెంకటేశ్, రాజ్ కుమార్, జేరిపోతుల పరశురామ్ తదితరులు పాల్గొన్నారు.