రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేస్తారా.. ఆయనకే తిరిగి టికెట్ ఇస్తారా?

రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తేస్తారా.. ఆయనకే తిరిగి టికెట్ ఇస్తారా?

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తారా..? ఆయనకే తిరిగి టికెట్ దక్కుతుందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ముఖేశ్​ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ బీజేపీ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన ఇప్పటికే ఓటర్లను కలుస్తూ.. సేవా కార్యక్రమాల్లో తలమునుకలయ్యారు. టికెట్ తనకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ముఖేశ్​ గౌడ్  సొంత సెగ్మెంట్ అయిన గోషామహల్ లోనే విక్రంగౌడ్ పాగా వేయాలనుకుంటున్నారు. సహజంగా బీజేపీలో పని చేసే వారంతా హిందుత్వ వాదులే అయినప్పటికీ, రాజాసింగ్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసి మత విశ్వాసాల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ కు వివాదాస్పద కమెడియన్ మునావర్ ఫారుఖీ రావడానికి అనుమతించిన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ, మహమ్మద్ ప్రవక్త పై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ ను నమోదు చేసి జైలుకు పంపారు. 

ఆ వెంటనే  రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీజేపీ  ప్రకటించింది. బెయిల్ పై బయటకు వచ్చిన రాజాసింగ్ తనపై పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక దశలో ఆయన టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన మంత్రి హరీశ్​ రావు ఇంటికి వెళ్లడం వైరల్ అయ్యింది. దీంతో తాను అభివృద్ధి పనుల కోసమే మంత్రిని కలిశానని, ఎట్టి పరిస్థితిలోనూ బీజేపీని వీడబోనని ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించినప్పటికీ అందులో గోషామహల్, నాంపల్లి, జనగామ, నర్సాపూర్ స్థానాలను పెండింగ్ లో పెట్టింది. దీంతో అప్పుడు కూడా గోషామహల్ టికెట్ రాజాసింగ్ కోసమే ఆపినట్లు ప్రచారం జరిగింది. దీంతో రాజాసింగ్ మరోమారు వివరణ ఇచ్చుకున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లబోనని కుండ బద్దలు కొట్టారు.

స్టేట్ చీఫ్ మారడంతో  బ్రేకులు పడ్డాయా..?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగిన  సమయంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ సస్పెన్షన్ ఎత్తివేయించేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ద్వారా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని తెలుస్తోంది. సరిగ్గా సస్పెన్షన్ ఎత్తివేసేందుకు మార్గం సుగమమం అవుతున్న తరుణంలో కేంద్ర నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. దీంతో ఈ విషయం కాస్తా అటకెక్కింది. ప్రస్తుతం గోషామహల్ లో విక్రం గౌడ్ పేరు తెరమీదకు వచ్చింది. కిషన్ రెడ్డికి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సన్నిహితుడిగా పేరున్న విక్రం గౌడ్ టికెట్ తనకే వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సెగ్మెంట్ పరిధిలో 54 స్కూళ్లు, అంగన్ వాడీ కేంద్రాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. మరో వైపు గుడుల నిర్మాణానిని నిధులు ఇస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయేందుకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, పాత వాటి మరమ్మతులకు తన చారిటబుల్ ట్రస్టు ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. 

రాజాసింగ్ ప్రయత్నం ఫలిస్తుందా..?

తాను సెక్యులర్ పార్టీల్లో చేరబోనని, బీజేపీ కమలం గుర్తుపైనే పోటీ చేస్తానని, తన సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకం తనకు ఉందని రాజాసింగ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ టికెట్ రాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఇతర పార్టీల తరఫున పోటీ చేయబోనని అంటున్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై మీడియా ప్రశ్నించగా.. ఆ అంశం అధిష్టానం పరిధిలో ఉందని, సస్పెన్షన్ ఎత్తివేస్తే టికెట్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాజాసింగ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అగ్రనేతల ద్వారా సస్పెన్షన్ ఎత్తివేత కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.