- బదిలీలు, ప్రమోషన్లలో అక్రమాలు లేవు
- ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం స్పష్టం
హైదరాబాద్, వెలుగు: ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బెదిరిస్తే ఊరుకోబోమని ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. జేఏసీల ముసుగులో కొందరు చేస్తున్న బెదిరింపులు, శాఖపై అవినీతి ఆరోపణలను ఖండించింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎక్సైజ్ శాఖ యూనిఫాం సర్వీసు కావడంతో ఉద్యోగులు క్రమశిక్షణతో పనిచేస్తారని, బయటివారు ఇష్టానుసారంగా మాట్లాడటంతో వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.
ఇటీవల జరిగిన బదిలీలు, పదోన్నతులపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎక్సైజ్ శాఖలో బదిలీలు జరగలేదని, 2024, 2026 సాధారణ బదిలీల్లోనూ చాన్స్రాలేదన్నారు. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కమిషనర్‌తో మాట్లాడి, ప్రభుత్వంతో చర్చించి బదిలీలు, పదోన్నతులు ఇప్పించామని తెలిపారు. ప్రస్తుతం జరిగిన బదిలీలు, ప్రమోషన్లలో ఎలాంటి అక్రమాలు, అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ఏవైనా అవకతవకలు జరిగితే విజిలెన్స్‌తో పాటు ప్రభుత్వం విచారణ చేస్తుందని చెప్పారు. అయితే ఆధారాలు లేకుండా అధికారులపై ఆరోపణలు చేయడం, వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సరికాదని లక్ష్మణ్ గౌడ్ పేర్కొన్నారు.
