సీఎం కేసీఆర్‌‌ మీద పోటీ చేస్తా : గద్దర్

సీఎం కేసీఆర్‌‌ మీద పోటీ చేస్తా :  గద్దర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్ తెలిపారు. కేసీఆర్‌‌‌‌ పాలసీని వ్యతిరేకిస్తున్నానని, ఆయనపై ధర్మ యుద్ధం చేస్తానని, కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని చెప్పారు. త్వరలో కవులు కళాకారులతో సమ్మేళనం పెట్టి పార్టీ పెట్టడమా, భావసారూప్యత ఉన్న వారితో కలిసి పని చేయడమా? అనేది ఆలోచిస్తానన్నారు. తనకు సీటు ఇవ్వాలని ఇంత వరకు ఏ పార్టీని అడగలేదని, ప్రజల మద్దతుతో నిలబడాలని భావిస్తున్నానని చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌‌లోని సరూర్‌‌‌‌నగర్‌‌‌‌లో జరిగిన కాంగ్రెస్‌‌ సభకు గద్దర్ హాజరయ్యారు. పీసీసీ ఆహ్వానం మేరకే తాను ప్రియాంక గాంధీ సభకు వచ్చానని తెలిపారు. దేశంలో రాజ్యాంగాన్ని నాశనం చేసి, సనాతనం పేరుతో ఒక ఫాసిజ ప్రభుత్వం రాబోతున్న దశలో ఇండియాను రక్షించుకోవాలన్న అకాంక్షతో అన్ని పార్టీలకు మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. 40 లక్షల మంది స్టూడెంట్ల భవిష్యత్తును నాశనం చేసిన కేసీఆర్‌‌ను గద్దె దింపడానికి ఏర్పడిన సభలో తాను గళం విప్పడానికి ఇక్కడకు వచ్చానన్నారు. విద్యార్థులకు కేసీఆర్‌‌ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో.. విద్యార్థులదే విజయమని పేర్కొన్నారు.

పదేండ్ల నుంచి ప్రజలు, పేదలు, స్టూడెంట్ల కన్నీళ్లు తుడవడంలో సీఎం కేసీఆర్‌‌‌‌ ఫెయిల్‌‌ అయ్యారని, వారి ఉసురు కచ్చితంగా ఆయనకు తగులుతుందన్నారు. కాంగ్రెస్‌‌ సభకు హాజరైన గద్దర్.. ప్రధాన వేదికపైకి వెళ్లలేదు. కళాకారులు ప్రదర్శనలు చేసే వేదికపైనే ఉండి వారితో పాటు పాటలు పాడారు. ముఖ్యంగా కేసీఆర్ పాలనపై స్వయంగా పాటలు పాడి ఆకట్టుకున్నారు.