
దేశంలోని లొకేషన్స్ (స్థానాలను) అత్యంత ఖచ్చితత్వంగా గుర్తించటమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ‘డిజిపిన్’ (DigiPin) అనే కొత్త డిజిటల్ అడ్రస్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ‘డిజిపిన్’ అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఇది భారతదేశంలోని ప్రతి 4x4 మీటర్ల వైశాల్యానికి 10 అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్.
డిజిపిన్ భారతదేశాన్ని సుమారు 4 మీ x 4 మీ గ్రిడ్‌లుగా విభజిస్తుంది. ప్రతి గ్రిడ్‌కు అక్షాంశం (latitudinal) మరియు రేఖాంశ (longitudinal) ల ఆధారంగా ఒక ప్రత్యేకమైన(యూనిక్) 10-అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను కేటాయిస్తుంది. ‘డిజిపిన్’ ప్రతి ఒక్క నిర్దిష్ట స్థానానికి ప్రత్యేకంగా(యూనిక్) ఉంటుంది. డిజిపిన్ భారతదేశ భూభాగానికి మాత్రమే పరిమితం. ఇది ఎటువంటి వ్యక్తిగత సమాచారాన్ని నిల్వ చేయదు. ఇతరులకు తెలియజేయదు.
పిన్‌కోడ్, డిజిపిన్ మధ్య తేడా ఏమిటి ?
సాధారణ పోస్టల్ చిరునామా ప్రాంతం, వీధి, ఇంటిసంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. డిజిపిన్ అనేది ఒక స్థానం ఖచ్చితమైన కోఆర్డినేట్‌ల ఆధారంగా 10- అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ఉపయోగించే జియోస్పేషియల్ రిఫరెన్స్. అడ్రస్తెలియనప్పటికీ డిజిపిన్ ద్వారా ఇండ్లు లేదా ఆఫీస్ వంటి నిర్మాణాల ఖచ్చితమైన లొకేషన్‌ను, నిర్మాణాలు లేని ఖాళీస్థలాలు, ఎడారులు, అడవులు, గ్రామీణ ప్రాంతాలు, ఎటువంటి సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల లొకేషన్‌ను సైతం సులభంగా పొందవచ్చును. ఒక నిర్మాణం లేదా ప్రదేశం పేరు, ఇంటి నంబరు, చిరునామా మారినప్పటికీ డిజిపిన్ మారదు. ఎల్లప్పుడు స్థిరంగా ఉంటుంది.
‘డిజిపిన్’ సాంకేతికతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లతో కలిసి భారతదేశ తపాలాశాఖ అభివృద్ధి చేసింది. నావిగేషన్ కోసం డిజిపిన్‌ను ఉపయోగించుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాల హోం డెలివరీ సేవలకు డిజిపిన్ ఎంతో సహాయపడుతుంది. భారతదేశంలో ఇప్పటివరకు లోపించిన భౌగోళిక ఖచ్చితత్వ స్థాయిని డిజిపిన్ అందిస్తుంది. వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తు సమయాలలో ఇది చాలా ఉపయోగకరం. పోలీసులు, అంబులెన్స్, ఇతర సత్వర సహాయ విభాగాలు డిజిపిన్ ద్వారా అత్యంత ఖచ్చితమైన లొకేషన్ ను తెలుసుకొనడం ద్వారా వేగంగా సహాయం చేయగలరు.
ఒక లొకేషన్కు డిజిపిన్ ఎలా నిర్ణయిస్తారు?
పది అక్షరాల డిజిపిన్ జనరేషన్ ఒక పునరావృత ప్రక్రియ. ఈప్రక్రియలో పదిస్థాయిలు ఉంటాయి. మొదటిస్థాయిలో భారతదేశ భౌగోళిక భూభాగాన్ని, అక్షాంశ (latitudinal), రేఖాంశ (longitudinal)ల ఆధారంగా ఏకరీతి ( uniform ) 4 X 4 =16 ప్రాంతాలుగా విభజిస్తారు. రెండవ స్థాయిలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని తిరిగి 4 X 4 =16 ఉప ప్రాంతాలుగా విభజిస్తారు. మూడవ స్థాయిలో ప్రతి ఒక ఉప ప్రాంతాన్ని తిరిగి 4 X 4 =16 ఉప- ఉప-ప్రాంతాలుగా విభజిస్తారు. ఇదేవిధమైన పునరావృత విభజన పదిస్థాయిల వరకు కొనసాగుతుంది. చివరికి నిర్దిష్ట స్థానానికి ప్రత్యేక (యూనిక్) డిజిపిన్ నిర్ణయించడం జరుగుతుంది. ఇది ప్రతి నిర్దిష్ట స్థానానికి(లొకేషన్)ప్రత్యేకంగా ఉంటుంది. 10- అంకెల ఆల్ఫాన్యూమరిక్ డిజిపిన్‌లో, ప్రథమ అంకె- మొదటి స్థాయిలో భారతదేశ భౌగోళిక భూభాగాన్ని విభజించిన 16 ప్రాంతాలలో ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది.
ఉదాహరణకు డిజిపిన్ ప్రథమ అంకె తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల లొకేషన్‌ను సూచిస్తుంది. అదేవిధంగా డిజిపిన్ ప్రథమ అంకె 3 -న్యూఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల లొకేషన్‌ను సూచిస్తుంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) సిగ్నల్ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, మనం వాడే హార్డ్‌వేర్ పరిమితులు, మన చుట్టుపక్కల ఉండే ఎత్తైన ప్రదేశాలు కలుగజేసే అడ్డంకులు వంటి అంశాల కారణంగా కొన్నిసార్లు స్థాన ఖచ్చితత్వం మారవచ్చు.
ఒకే లొకేషన్లో ఉన్న బహుళ అంతస్తుల్లో అన్ని అంతస్తులకు ఒకే డిజిపిన్ వర్తిస్తుంది. అంటే ఒక బహుళ అంతస్తులో ఉన్న వివిధ అంతస్తులకు వేరువేరు డిజిపిన్‌లు ఉండవు, ఒకే డిజిపిన్ వర్తిస్తుంది. ఒక డిజిపిన్ జనరేట్ అయిన తర్వాత, దానిని ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే షేర్ చేయొచ్చు. ఉపయోగించవచ్చు. డిజిపిన్ ను పొందడం, డీకోడ్ చేయడం కోసం దీనిని పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని తపాలా శాఖ యోచిస్తోంది.
మీ ‘డిజిపిన్’ని ఎలా తెలుసుకోవాలి?
మీ ఇంటికి లేదా మరేదైనా ప్రదేశానికి ‘డిజిపిన్’ ని కనుగొనడానికి, dac.indiapost.gov.in/mydigipin/home అనే పోర్టల్ ద్వారా తెలుసుకొనవచ్చు. అదేవిధంగా గూగుల్ సెర్చ్‌లో డిజిపిన్ అని టైప్ చేసినట్లయితే పైన తెలిపిన పోర్టల్ కి కనెక్ట్ అవుతారు. ప్రజలు తమ ‘డిజిపిన్’ను సులభంగా తెలుసుకోవడానికి తపాలా శాఖ ప్రారంభించిన ‘నో యువర్ డిజిపిన్’ పోర్టల్ ఇది. ‘డిజిపిన్’ తెలుసుకోవడానికి ఈ దశలను అనుసరించాలి... మీ వెబ్ బ్రౌజర్ లొకేషన్స్‌కు యాక్సెస్ కలిగి ఉన్నదో లేదో మొదట నిర్ధారించుకోండి.
సెల్ఫోన్లో లొకేషన్ ‘ఆఫ్’ చేసుంటే, బ్రౌజర్ సెట్టింగ్‌లలో దాన్ని ‘ఆన్’ చేయవలసి ఉంటుంది. లొకేషన్ యాక్సెస్ కోసం అడుగుతున్న పాప్-అప్ కనిపిస్తే ‘అనుమతించు’ పై క్లిక్ చేయండి. మీరు ‘డిజిపిన్’ గోప్యతా విధానం నిబంధనలకు అంగీకరిస్తే ‘నేను సమ్మతిస్తున్నాను’ నొక్కండి. చివరికి మీరు స్క్రీన్ కుడి దిగువ మూలలో ప్రత్యేకమైన ఆల్ఫాన్యూమరిక్ డిజిపిన్‌ను చూడగలరు. భౌగోళిక కోఆర్డినేట్‌లను నమోదు చేయడం ద్వారా మీరు ఏదైనా ఇతర ప్రదేశానికి చెందిన డిజిపిన్ని తెలుసుకొనవచ్చును.
శ్రీదరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్