
- ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లొచ్చినా కాళేశ్వరానివేనని చెప్పుకోవడం కొందరికి అలవాటైంది
- తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కోసం త్వరలో మహారాష్ట్ర సీఎంను కలుస్తం
- అక్కడ కడితే ఆదిలాబాద్‌లో లక్షన్నర ఎకరాలకు నీళ్లు
- చేవెళ్ల , వికారాబాద్, తాండూరు, పరిగితోపాటు
- కొడంగల్‌కు గోదావరి జలాలు తరలిస్తం
- కాంగ్రెస్ హయాంలోనే సిటీకి కృష్ణా, గోదావరి నీళ్లు
- హైదరాబాద్ తాగునీటి సమస్యే కాదు..
- నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్యనూ తీరుస్తామని వెల్లడి
- గండిపేట్ వద్ద గోదావరి ఫేజ్2, 3.. నియోపొలిస్
- వాటర్ సప్లై అండ్ సీవరేజ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు గోదావరి జలాలను తాము కాళేశ్వరం నుంచి తేవడంలేదని, కాంగ్రెస్హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తెస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ‘‘ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా కాళేశ్వరం నీళ్లేనని చెప్పుకోవడం వాళ్లకు(బీఆర్ఎస్నేతలు) అలవాటు.. హైదరాబాద్ తాగునీటి కోసం ఎల్లంపల్లి నుంచి తెచ్చే నీళ్లను కూడా కాళేశ్వరానివేనని తప్పుదోవపట్టిస్తున్నారు. వాళ్ల మెదడు మోకాళ్లలో ఉన్నది. ఈ రోజు గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే, వాటి మూలం శ్రీపాద ఎల్లంపల్లే. అక్కడినుంచే గోదావరి నీటిని పట్టుకొని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి వస్తున్నాయంటున్నారు” అని ఫైర్ అయ్యారు.
హైదరాబాద్‌లోని గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2, 3, నియో పోలీస్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు హైదరాబాద్ జల మండలి ఆధ్వర్యంలో నిర్మించిన 16 రిజర్వాయర్లను, కోకాపేట వద్ద నియోపొలిస్ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్వాళ్లు మల్లన్న సాగర్ అని చెప్పుకుంటున్న రిజర్వాయర్కూడా ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్టులో భాగమేనని స్పష్టంచేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాలో లక్షన్నర ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పారు. ఇందుకోసం త్వరలోనే మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంను కలుస్తామని తెలిపారు.
పదేండ్లలో హైదరాబాద్‌కు కొత్తగా చుక్క నీళ్లు తేలే..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో గత పాలకులు గోదావరి, కృష్ణా నదుల నుంచి హైదరాబాద్‌కు అదనంగా ఒక్క చుక్క నీళ్లు కూడా తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే గోదావరి జలాలను తరలించే ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. ఈసారి కేవలం హైదరాబాద్ తాగునీటి సమస్యను పరిష్కరించడం మాత్రమే కాకుండా.. నల్గొండ జిల్లాను పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను కూడా నివారించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
“ఇవి కాళేశ్వరం నీళ్లే కదా అని ఒకాయన అంటున్నాడు. ఆయన తాటి చెట్టంత పెరిగిండుగానీ ఆయనకు తాటికాయంత కూడా తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో.. అది కూలిపోయింది. కాళేశ్వరం కాస్త ‘కూలేశ్వరం’ అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు అని ఉంది. అది మీ తాతో మీ ముత్తాతో కట్టింది కాదు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి పేరుమీద కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈ రోజు గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే, వాటి మూలం శ్రీపాద ఎల్లంపల్లే. అక్కడినుంచే గోదావరి నీటిని పట్టుకొని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. ఆ సంగతి మరిచిపోయి ఇప్పుడు మల్లన్నసాగర్ నుంచి వస్తున్నాయంటున్నాడు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎప్పుడో 2008–09లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రాణహిత– చేవెళ్లలో భాగం కాదా? ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించారు. ఆ నీళ్లను చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని సంకల్పించారు. పెద్దలు కాకా వెంకట స్వామి సూచన మేరకు ఈ ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్ట్‌కు బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. కానీ కాసుల కక్కుర్తి కోసం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వదిలి మేడిగడ్డకు మళ్లించారు.చివరి ఆయకట్టుగా ఉన్న చేవెళ్లను కూడా అందులోంచి తొలగించారు. ఇది రంగారెడ్డి జిల్లాకు జరిగిన పెద్ద అన్యాయం కాదా? అది బీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ’’ అని నిలదీశారు.
వైఎస్సార్ అప్పట్లో గోదావరి జలాలను చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి వరకు అందించాలనే ప్రణాళిక చేశారని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకం నేటికీ చేవెళ్ల చివర ఉందని తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్న కొందరు నేడు బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నారని, ఎవరు ప్రాణహిత నుంచి చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నించారో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేశారో నాటి మంత్రులు గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని, ఇందుకోసం మహారాష్ట్ర సీఎంతో మాట్లాడుతున్నామని, త్వరలోనే ఆయనను స్వయంగా కలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు కట్టుకునేందుకు గతంలో మహారాష్ట్ర ఒప్పుకోలేదు. 148 మీటర్ల ఎత్తు వరకు అంగీకరించింది.. ఇప్పుడు 149–150 మీటర్ల ఎత్తుకు ఒప్పుకున్నారు.. అక్కడ ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాలో లక్షన్నర ఎకరాలకు నీళ్లిస్తాం. అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను మల్లన్నసాగర్ మీదుగా రంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగితోపాటు కొడంగల్ ప్రాంతానికి కూడా తరలిస్తాం. ఈ ప్రాంత రైతాంగానికి గోదావరి నీళ్లతో నూతన జీవం పోసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.” అని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలోనే కృష్ణా, గోదావరి నీళ్లు..
హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కోసం ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాలే కాకుండా, కృష్ణా నది జలాలను కూడా తీసుకురావాలనే నిర్ణయం కాంగ్రెస్హయాంలోనే తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 2002లో నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటిని తరలించే కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. ఆ తర్వాత ఫేజ్ –1, 2,3 పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించిందని గుర్తుచేశారు. కృష్ణా నీళ్లు సరిపోవని తెలిసినప్పుడు గోదావరి జలాలను కూడా నగరానికి తరలించేందుకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్న సమయంలో ఆ కార్యక్రమం మొదలై, 2016లో గోదావరి జలాలు నగరానికి చేరాయని రేవంత్‌రెడ్డి వివరించారు. కానీ అప్పటి తెలంగాణ మున్సిపల్ మంత్రి.. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకే గోదావరి జలాలను నెత్తిమీద చల్లుకొని ఫోటోలు దిగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని సీఎం విమర్శించారు.
“అలా ఫోటోలు దిగడం వల్ల ఆయన చేసిన తప్పులు తుడిచిపెట్టుకుపోవు” అని అన్నారు. నిజాం సర్కార్ తర్వాత సిటీ తాగునీటి సమస్యపై శ్రద్ధ చూపిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 1965, 1991–93, 2002, 2005, 2008 వంటి పలు దశల్లో మంజీరా, మూసీ, ఈసీ, గోదావరి, కృష్ణా జలాలను నగరానికి తరలించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ పాలనలో 2002లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకటస్వామి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్
మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, కొత్త రింగ్ రోడ్లు, మెట్రో విస్తరణతో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది కాంగ్రెస్ సంకల్పమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.‘‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు, ఉద్యోగాలు వచ్చేవి కావు. ఇప్పుడు తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నాం. 2025 డిసెంబర్ 9న జాతికి అంకితం చేస్తాం. రాబోయే 100 ఏండ్ల అభివృద్ధికి దారితీసే ప్రణాళిక ఇది’’ అని సీఎం వెల్లడించారు.ఈ నిర్మాణాల వల్ల ఎవరు నష్టపోయినా వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘‘ ఇది ఇందిరమ్మ రాజ్యం.. పేదల రాజ్యం. పేదలకు న్యాయం జరిగే రాజ్యం. నష్టపోయే పేదలందరినీ నా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు” అని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
మూసీ నదిని బాగుచేస్తం
మూసీ నది విషతుల్యమై పశువులు, మనుషులు చనిపోతున్నారని, దానిని శుద్ధిచేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. “ మూసీ నది నీళ్ల వల్ల తీర ప్రాంతాల్లో కొత్తగా పెళ్లయిన జంటలకు పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఈ నీళ్లు తాగిన మనుషులు, పశువులు చనిపోతున్నాయి.. అందుకే మూసీని తప్పక ప్రక్షాళన చేస్తం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు 20 టీఎంసీల నీళ్లు తేవడమే కాకుండా, అందులో 4 నుంచి 5 టీఎంసీలను మూసీ శుద్ధికి వినియోగిస్తం. ఇకపై డ్రైనేజీలు, ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ జలాలను మూసీలో కలవనివ్వం. కొత్త ఎస్టీపీలు ఏర్పాటు చేసి కాలుష్యాన్ని నియంత్రిస్తం” అని వివరించారు.
రూ. 7,360 కోట్లతో 20 టీఎంసీల గోదావరి జలాలను తెచ్చే ప్రాజెక్టు మొదలుపెట్టామని, అందులో 15–16 టీఎంసీలు హైదరాబాదు తాగునీటి కోసం, మిగిలినవి మూసీ శుద్ధి కోసం వినియోగిస్తామన్నారు. “సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్‌లో వచ్చింది. యమునా రివర్ ఫ్రంట్ ఢిల్లీలో వస్తున్నది. గంగా రివర్ ఫ్రంట్ యూపీలో వస్తున్నది. మరి ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు రాకూడ దు? నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా చేయగలిగితే మనం ఎందుకు చేయలేం? కాంగ్రెస్ చేస్తే పేరు వస్తుందని కొందరు అడ్డం పడుతున్నారు. మా మీద కోపం ఉంటే మాతో కొట్లాడండి.. కానీ ప్రజల అభివృద్ధిని ఆపొద్దు” అని వ్యాఖ్యానించారు.