డీఎస్సీ 2008 అభ్యర్థులకు జాబ్స్​

డీఎస్సీ 2008 అభ్యర్థులకు జాబ్స్​

హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ 2008 అభ్యర్థులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని రాష్ట్ర సర్కారు  నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నది. సుమారు 15 ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సర్కారు ఉపశమనం కల్పించినట్టయింది. 2008 డీఎస్సీలో ఎస్​జీటీ పోస్టులకు బీఈడీ, డీఈడీ చేసిన వారు అర్హులని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. తర్వాత డీఈడీ వారికి 30% పోస్టులు ప్రత్యేకంగా కేటాయించి, మిగిలిన 70% పోస్టుల్లో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.  ముందుగా రిలీజ్ చేసిన సెలెక్షన్ లిస్టులో ఉన్న సుమారు 2,300 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదు. దీంతో వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయి. దీనిపై కోర్టులో ఏండ్ల నుంచి కేసు నడిచింది. ఏపీలో ఇలాంటి బాధితులే ఉండగా, వారికి మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్నారు. దీన్ని ఉదహరిస్తూ తెలంగాణలోనూ అమలు చేయాలని హైకోర్టు సూచించింది. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోనూ డీఎస్సీ 2008 అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయించింది. అప్పట్లో సుమారు 2,300 మంది ఉండగా, వారిలో చాలామందికి వివిధ ఉద్యోగాలు వచ్చి చేరిపోయారు. ప్రస్తుతం 1,500 మంది వరకూ ఉంటారని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎంటీఎస్ కింద నెలకు సుమారు రూ.39వేల జీతం వచ్చే అవకాశం ఉన్నది. త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించి, వారికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. కాగా,   ఎంటీఎస్ అమలు చేయాలని సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల సెక్రటేరియేట్ లోని మీడియా సెంటర్ వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థులు సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు

 కృతజ్ఞతలు చెప్పారు.