రెండు వారాల్లో కొత్త ఫించన్లు ఇస్తం: మంత్రి ఎర్రబెల్లి

రెండు వారాల్లో కొత్త  ఫించన్లు ఇస్తం: మంత్రి ఎర్రబెల్లి
  • త్వరలోనే వికారాబాద్ కు ‘పాలమూరు’ నీళ్లు : మంత్రి ఎర్రబెల్లి

వికారాబాద్,​ వెలుగు: కరోనా వల్ల కొత్త పింఛన్ల మంజూరు ఆలస్యం అయిందని, అర్హులకు మరో15 రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు త్వరలోనే వికారాబాద్ జిల్లాకు వస్తాయన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 5.15 కోట్లతో నిర్మించనున్న జడ్పీ ఆఫీసు బిల్డింగ్ కు సోమవారం విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్సీ మహెందర్​రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్​రెడ్డి, నరేందర్​రెడ్డి, రోహిత్​రెడ్డి, కలెక్టర్ తో మంత్రి ఎర్రబెల్లి భూమి పూజ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి, వివిధ అభివృద్ధి పథకాలతో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న స్కీంలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తారని, జిల్లా కలెక్టర్ ఆఫీసుతో పాటు, టీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.  
కేసీఆర్​తోనే బంగారు తెలంగాణ: సబితారెడ్డి 
ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే రాష్ట్రం కొన్ని మైలు రాళ్లను అందుకునేది కాదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యం అయిందని, ఆయనతోనే బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు.     
ఊర్ల అభివృద్ధికి ఏటా రూ.2,500 కోట్లు
పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్‌‌ నుంచి 2022 ఫిబ్రవరి వరకు రూ.8,569.50 కోట్లు గ్రాంటుగా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేశామని సోమవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల రూ.227.50 కోట్ల చొప్పున మొత్తం రూ.2,502.50 కోట్లు గ్రాంటుగా విడుదల చేసిందన్నారు.