మోడీ ప్రోగ్రామ్‌కు కేసీఆర్..వెళ్తరా..లేదా?

మోడీ ప్రోగ్రామ్‌కు కేసీఆర్..వెళ్తరా..లేదా?
  • 19న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని
  • గతంలో ఐదుసార్లు ఆయనకు స్వాగతం పలకని కేసీఆర్‌
  • ఈసారి ఆహ్వానించే చాన్స్ ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పలుకేసులతో సీఎం వైఖరి మారొచ్చంటున్న నేతలు

రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తారా? ప్రధాని పాల్గొనే ప్రోగ్రామ్స్‌‌కు హాజరైతరా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మోడీ రెండేండ్లలో ఐదు సార్లు రాష్ట్రానికి రాగా.. ఏ ఒక్కసారి కూడా ఆయన్ను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లలేదు. ఈ నెల 19న మరోసారి హైదరాబాద్‌‌కు ప్రధాని వస్తున్నారు. మరి ఇప్పుడైనా మోడీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్తారా? లేదా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌‌లో జోరుగా సాగుతున్నది.

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా మొఖం చాటేస్తున్న  సీఎం కేసీఆర్​ ఈసారి ఏంచేస్తారన్న చర్చ నడుస్తున్నది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ప్రధానికి కేసీఆర్ స్వాగతం పలకవచ్చని బీఆర్ఎస్‌‌లోని కొందరు నాయకులు అంటున్నారు. ఇటీవల శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేసీఆర్‌‌ సర్కారు ఘన స్వాగతం పలికిందని, రాష్ట్రపతికి ఆహ్వానం పలికే సమయంలో గవర్నర్‌‌ తమిళిసైతో కేసీఆర్‌‌ నవ్వుతూ మాట్లాడారని ఉదాహరణగా చెబుతున్నారు.  ప్రధాని పర్యటనలో భాగంగా సికింద్రాబాద్‌‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌‌ సూపర్‌‌ ఫాస్ట్‌‌ రైల్‌‌ను సికింద్రాబాద్‌‌ రైల్వే స్టేషన్‌‌లో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రూ.7 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటనకు రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. అధికారిక కార్యక్రమాల తర్వాత సికింద్రాబాద్‌‌ పరేడ్‌‌ గ్రౌండ్‌‌లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోడీ మాట్లాడుతారు.

కేంద్రం నిర్వహించే మీటింగ్స్‌‌కూ గైర్హాజర్

మోడీ ప్రభుత్వాన్ని కేసీఆర్‌‌ రెండేండ్లుగా విమర్శిస్తూ వస్తున్నారు. దేశంలో విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ ప్రపంచ దేశాల ముందు తలవంచుకునేలా చేస్తున్నదని కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెబుతూ అనేక రాజకీయ పార్టీలతో జట్టుకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడే కాదు.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కీలక సమావేశాలకూ కేసీఆర్ హాజరుకావడం లేదు. ‘‘నీతి ఆయోగ్‌‌ మీటింగ్‌‌కు పోతే నాలుగు నిమిషాలు మాట్లాడాలె.. పల్లికాయలు, మన్ను బుక్కుకుంటూ కూర్చోవాలె. రానుపోను విమానం ఖర్చులు దండుగ..’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందుకే నీతి ఆయోగ్‌‌ మీటింగ్‌‌ బాయ్‌‌కాట్‌‌ చేస్తున్నానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇటీవల టీఆర్‌‌ఎస్‌‌ పేరును బీఆర్‌‌ఎస్‌‌గా మార్చుకున్నారు.

కేసులపై హైరానా

ఢిల్లీ లిక్కర్‌‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రచారంలోకి రావడంతో.. తెలంగాణలోకి సీబీఐ ఎంటర్‌‌ కాకుండా జీవో తెచ్చారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఇచ్చిన జనరల్‌‌ కాన్సెంట్‌‌ విత్‌‌డ్రా చేసుకున్నారు. దీనికి తోడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీని ఇరికించే ప్రయత్నం చేయగా అది బూమరాంగ్‌‌ అయింది. ఈ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు సింగిల్‌‌ జడ్జి తీర్పునివ్వగా, డివిజన్‌‌ బెంచ్‌‌ ఎదుట దానిపై విచారణ సాగుతున్నది. సింగిల్‌‌ జడ్జి తీర్పును డివిజన్‌‌ బెంచ్‌‌ కూడా ఎండార్స్‌‌ చేస్తే కేసు విచారణ సీబీఐ చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను కేసీఆర్‌‌ ప్రెస్‌‌మీట్‌‌ పెట్టి బహిర్గతం చేయడంతో ఆయనకూ సీబీఐ నోటీసులు ఇచ్చి విచారించవచ్చని ప్రచారం జరుగుతున్నది. పరిస్థితి ఇంతవరకు వస్తే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని కేసీఆర్‌‌ హైరానా పడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 19న మోడీకి కేసీఆర్‌‌ స్వాగతం పలుకుతారని, వందే భారత్‌‌ ట్రైన్ ప్రారంభోత్సవంతోపాటు ఇతర అధికారిక కార్యక్రమాల్లోనూ సీఎం పాల్గొనే అవకాశం లేకపోలేదని బీఆర్‌‌ఎస్‌‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు కేసీఆర్‌‌ అపాయింట్‌‌మెంట్‌‌ కోరారని, అది ఇంకా కన్ఫామ్‌‌ కాకపోవడంతో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానిని కలిస్తే గ్యాప్‌‌ ఫిల్‌‌ అయ్యే అవకాశముందనే భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రం ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నదని, కేంద్రం తోడ్పాటునిస్తే తప్ప అనేక కార్యక్రమాలు పట్టాలెక్కే పరిస్థితి లేదని, ఇలాంటి సమయాల్లో పట్టువిడుపులు అవసరమేనని కొందరు బీఆర్‌‌ఎస్‌‌ నేతలు చెప్తున్నారు.

ప్రధాని వచ్చినప్పుడల్లా.. దూరం దూరం

కరోనా ఫస్ట్‌‌ వేవ్‌‌ వరకు ప్రధాని మోడీతో కేసీఆర్‌‌కు మంచి సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత కేంద్రంతో కేసీఆర్‌‌ పేచీ పెట్టుకోవడం మొదలు పెట్టారు. అసెంబ్లీ వేదికగానూ ప్రధాని, కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌‌గా అనేక విమర్శలు గుప్పించారు. మోడీ రాష్ట్రానికి వచ్చినా ఆయన్ను ఆహ్వానించేందుకు వెళ్లలేదు. 2020 నవంబర్‌‌ 28న భారత్‌‌ బయోటెక్‌‌ను సందర్శించిన మోడీ.. కరోనా వ్యాక్సిన్‌‌ తయారీపై సైంటిస్టులతో సమావేశమయ్యారు. కానీ హకీంపేట విమానాశ్రయంలో దిగిన మోడీకి కేసీఆర్‌‌ స్వాగతం పలకలేదు. 2022 ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌‌ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడూ కేసీఆర్‌‌ దూరంగా ఉన్నారు. మే 26న ఐఎస్‌‌బీ 20వ కాన్వొకేషన్‌‌లో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్‌‌కు రాగా.. అదే రోజు జేడీఎస్‌‌ నేతలతో భేటీ అయ్యేందుకు కేసీఆర్‌‌ బెంగళూరుకు వెళ్లారు. జులై ఒకటి నుంచి మూడో తేదీ వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌‌లో నిర్వహించారు. అదే సమయంలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌‌ సిన్హా పరిచయ కార్యక్రమంలోనూ మోడీ, కేంద్రం సెంట్రిక్‌‌గా కేసీఆర్‌‌ విమర్శలు గుప్పించారు. నవంబర్‌‌ 12న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే ఆహ్వానించకపోగా.. వామపక్షాలతో కలిసి బీఆర్‌‌ఎస్‌‌ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఆరోసారి మోడీ రాష్ట్రానికి వస్తున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో కేసీఆర్‌‌ మనసు మార్చుకునే చాన్స్‌‌ ఉందని బీఆర్‌‌ఎస్‌‌ నేతలే చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రగతి భవన్‌‌ పెద్దలు మాత్రం నోరు విప్పడం లేదు.