- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
జగిత్యాల, వెలుగు: ‘జీవన్ రెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడే.. కానీ, పదేపదే పార్టీకి నష్టం కలిగిలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం’ అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగిత్యాల, రాయికల్ రాజకీయాల్లో వర్గపోరు పార్టీకి కీడు చేస్తుంది. ఇద్దరి మధ్య గొడవను రెండు ప్రాంతాల మధ్య గొడవలా మారిస్తే పార్టీకి నష్టం కలుగుతుంది, మన వేలితో మన కన్నే పొడుచుకోవద్దు’ అని సూచించారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని, పార్టీ కోసం పనిచేసినవారికి ఎన్నికల్లో అవకాశం రాకపోయినా.. నామినేటెడ్ పదవులు వచ్చేలా పార్టీ చూసుకుంటుందన్నారు.
హుస్నాబాద్‌లో చివరి రెండు రోజుల్లోనే టికెట్ మార్చేసినా.. తాను కాంగ్రెస్ కోసమే పనిచేశానని, ఆ నిబద్ధత వల్లే తనకు ఎమ్మెల్సీ, పీసీసీ ఉపాధ్యక్షుడి పదవి దక్కిందని చెప్పారు. జగిత్యాల రాజకీయాలపై ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదని.. అయితే, పార్టీకి నష్టం చేసే దిశగా వ్యవహారాలు సాగుతుంటే మాత్రం మౌనంగా ఉండలేమన్నారు.
బీఆర్ఎస్ నిరసనల వెనక కుట్ర కోణం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం కేసీఆర్‌ను సిట్ విచారించనున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం వెనక కుట్ర కోణం దాగి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు.
