వికారాబాద్, వెలుగు: చేవెళ్ల బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్ల బస్సు ప్రమాదంలో తాండూరు నియోజకవర్గానికి చెందిన 13 మంది చనిపోగా, వారి కుటుంబాలను ఆదివారం ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ]
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులన్నీ దోచుకుపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం వద్ద రోడ్లు వేసేందుకు కూడా డబ్బులు లేవని, పూర్తిగా దివాలా తీసిందని ఆరోపించారు. వారంలో మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2లక్షల పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు.
యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన అఖిల రెడ్డి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా హాజీపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు బందెప్ప, లక్ష్మీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి ఇద్దరు కూతుళ్లను ఆదుకుంటానని చెప్పారు.
పెద్ద కూతురును నర్సింగ్ చదివించడమే కాకుండా ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఆయన వెంట చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీజేపీ జిల్లా కన్వీనర్ కరుణం ప్రహ్లాద్‌రావు, యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ ఉన్నారు.
