హైదరాబాద్: నదీ జలాల అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో కృష్ణా జలాల ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం (జనవరి 4) హైదరాబాద్ చేరుకున్న ఆయన.. ఇటీవల మరణించిన టీడీపీ నేత సాయి బాబా కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా నదీ జలాల అంశంపై జర్నలిస్టులు ప్రశ్నించగా.. త్వరలోనే కృష్ణా జలాలపై మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తానని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఏం మాట్లాడుతారనే దానిపై అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ పాలిటిక్స్‌లోనూ ఉత్కంఠ నెలకొంది.
సాయి బాబా మృతి బాధాకరం:
పార్టీకి విధేయుడుగా పనిచేసిన సాయి బాబా మృతి బాధాకరమని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. చివరి శ్వాస వరకు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి సాయిబాబా అని.. ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరి పార్టీ కోసం ఎనలేని సేవలను అందించారని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్‌గా సేవలందించడం అభినందనీయమన్నారు. సాయి బాబా కుటుంబం చాలా సమస్యల్లో ఉన్నట్లు తెలిసిందని.. ఆయన కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
