
- షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ, వెలుగు: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమెకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్డాఫీస్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఖర్గేతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ఏపీ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం టెన్ జన్‌పథ్‌లో భర్త అనిల్‌తో కలిసి సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. షర్మిల పార్టీలో చేరడంపై సోనియా సంతోషం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్సార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేయాలని ఆమె సూచించినట్లు తెలిసింది.
ఏఐసీసీ హెడ్ ఆఫీస్ లో జరిగిన లోక్‌సభ వ్యూహరచన మీటింగ్ లోనూ షర్మిల పాల్గొన్నారు. అయితే పార్టీలో చేరిక సందర్భంగా పార్టీ కండువా కప్పుకునేందుకు షర్మిల భర్త అనిల్ విముఖత వ్యక్తం చేశారు. షర్మిలకు పార్టీ కండువా కప్పిన తర్వాత మరో కండువాను అనిల్‌కు కప్పే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించడంతో అదే కండువాను రాహుల్ తీసుకుని షర్మిలకు కప్పారు.
కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదనే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు షర్మిల స్పష్టం చేశారు. పార్టీ విలీనం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. విలీనం సందర్భంగా ఏ ఒప్పందం జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని, ఏపీలోనే కాదు.. అండమాన్‌లోనైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానన్నారు. పార్టీలో తనకు ఏ బాధ్యత ఇస్తారనేది రెండు రోజుల్లో తేలుతుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది నా తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయమన్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడం కోసం పార్టీలో చేరానని పేర్కొన్నారు. రాజన్న రాజ్యం దేశమంతటా వస్తే సంతోషమే కదా.. అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని, అన్ని వర్గాలను కలుపుకుని కాంగ్రెస్ పని చేస్తున్నదన్నారు. ఒక క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని, సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందనడానికి ఇదొక నిదర్శనమని బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్ర తనతోపాటు ప్రజలందరిలో రాహుల్ గాంధీపై నమ్మకాన్ని పెంచిందన్నారు.
జగన్ ఓటమి ఖాయం : మాణిక్కం ఠాగూర్
ఏపీలో జగన్ ఓటమి ఖాయమని ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అన్నారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో ఏపీలో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు తరహా పాలనకు కాంగ్రెస్ వ్యతిరేకమని, వైఎస్సార్ పేరును వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని చెప్పారు. పార్టీ కోసం పీసీసీ చీఫ్ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. రాష్ట్రంలో జగన్‌ను, కేంద్రంలో మోదీని ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.