రాష్ట్రంలో జీరో FIR విధానం అమలు అవుతుందా..?

రాష్ట్రంలో జీరో FIR విధానం అమలు అవుతుందా..?

అసలు జీరో FIR అంటే ఏమిటి. జీరో FIR కి సంబంధించి బాధితులు ఎవరైనా పిర్యాదు చేయవచ్చా.. అలా ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా.. బాధితులకు చట్టం అలాంటి అవకాశం కల్పిస్తుందా.. అసలు రాష్ట్రంలో జీరో FIR అనే విధానం అమలు అవుతుందా. పోలీసులకు ఏదైనా కంప్లైంట్ చేస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్నే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (FIR) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో FIR అంటే నేరం ఎక్కడ జరిగిందనేది సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే కేసును సంబంధిత పోలీస్ స్టేషన్ కి బదిలీ చేస్తారు.

నిర్భయ కేసు తరువాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇదొకటి. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా... క్రిమినల్ లా సవరణ చట్టం 2013 లో జీరో FIR కాన్సెప్టును తీసుకొచ్చారు. సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికి FIR నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ అలాట్ చేస్తారు. దాన్ని సంబంధిత స్టేషన్ కి బదిలీ చేశాక.. ఆ రెండో స్టేషన్ వారు FIR నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్ తో నమోదు చేస్తారు. అందుకే దీన్ని జీరో FIR అంటారు. స్టేషన్ కి వచ్చిన ఎవర్ని పోలీసులు వెనక్కి కానీ వేరే స్టేషన్ కి పంపడానికి వీలుండదు. ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకుండా పోలీసులు నేరుగా అరెస్టు చేయవచ్చునో దాన్నే కాగ్నిజబుల్ కేసులు అంటారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే.. పరిధి, ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాలి. బాధితులు, కుటుంబ సభ్యులు, సాక్షులు, నేరస్థులు, పోలీసులు, జడ్జీల ఆదేశాలు లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు. దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే పోలీసులు. నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో FIR.

ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి FIR రాయడానికి తిరస్కరిస్తే IPC సెక్షన్ 166 A కింద ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు.  అలాగే CRPC సెక్షన్ 154 ప్రకారం ఫిర్యాదు చేసే వాళ్లు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసుల రాసుకుని, సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీని ఫిర్యాదు చేసిన వారికి ఫ్రీగా అందివ్వాలి. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర పోలీసు శాఖ గత కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జీరో FIR విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మొదట్లో చక్కగా అమలైన ఈ విధానాన్ని తర్వాత లైట్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.

శంషాబాద్  పరిధిలో 2019 నవంబరులో దిశ ఘటన జరిగింది. బాధిత కుటుంబం వెంటనే శంషాబాద్  RGI పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే తమ పరిధిలోకి రాదని.. శంషాబాద్  రూరల్  పీఎస్ కు వెళ్లాలని పంపించారు. అక్కడికెళితే RGI పరిధిలోకే వస్తుందని తిప్పి పంపారు. ఈ వ్యవహారం అప్పట్లో వివాదస్పదమైంది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. పరిస్థితిపై రివ్యూలు చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి జీరో FIR విధానాన్ని తీసుకొచ్చారు.

నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 153 వరకు లా అండ్ ఆర్డర్  పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా జీరో FIR విధానం అమలు కావడం లేదు. బాధితులు తమకు దగ్గరలోని పీఎస్ ను ఆశ్రయిస్తున్నా, FIR నమోదు చేసి సంబంధిత స్టేషన్ కు బదిలీ చేయడానికి పోలీసు అధికారులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. మరి జీరో FIRపై పోలీసులు చూపిస్తున్నా నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.