వైన్ షాపుల బెల్టు దందా..అధిక రేటుకు మద్యం సప్లయ్

వైన్ షాపుల బెల్టు దందా..అధిక రేటుకు మద్యం సప్లయ్
  •     ఎమ్మార్పీకి రూ.20 ఎక్కువకు బెల్టుషాపులకు సప్లయ్​
  •      సరిహద్దు మండలాల్లో వైన్​షాపుల దందా

ఖమ్మం, వెలుగు: జిల్లాలో వైన్ షాపు నిర్వాహకులు బెల్టుషాపులకు మందు విక్రయించేందుకే ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నారు. కస్టమర్స్​​కు నేరుగా అమ్మితే ఎమ్మార్పీ వస్తుంది. అదే బెల్టు షాపునకు అయితే ఎమ్మార్పీకి మించి అమ్మొచ్చనే ఉద్దేశ్యంతో వైన్​షాపు నిర్వాహకులు ఈ పనికి పాల్పడుతున్నారు. వైన్​షాపుల్లో మామూలు లిక్కర్​ ఉంచి.. బెల్టుషాపులకు మంచి మందును సప్లయ్​ చేస్తున్నారు. పేరున్న బ్రాండ్ లను క్వార్టర్ బాటిల్ పై రూ.20 వరకు ఎక్కువ రేటుకు బెల్టు షాపులకు పంపిస్తున్నారు. మొదట ఎమ్మార్పీపై రూ.5 అదనంగా అమ్మిన వైన్ షాపుల నిర్వాహకులు, ఇప్పుడేమో ఏకంగా క్వార్టర్ బాటిల్ పై రూ.20 అదనంగా బెల్టు షాపు నిర్వాహకుల వద్ద తీసుకుంటున్నారు. వాళ్లు మరో రూ.20 లాభం చూసుకొని కస్టమర్లకు ఇస్తున్నారు. షాపునకు వచ్చిన కస్టమర్లకు మాత్రం అడిగిన బ్రాండ్ లేదని, ఇతర బ్రాండ్ లకు చెందిన సీసాలను అంటగడుతున్నారు. దీంతో కొన్ని సార్లు షాపులో సిబ్బందితో కస్టమర్లు గొడవకు దిగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏపీని ఆనుకుని ఉన్న మండలాల్లో, రూరల్ ప్రాంతాల్లో ఈ దందా ఎక్కువగా కొనసాగుతోంది. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ మంది టూ వీలర్లపై వచ్చి మరీ ఖమ్మం జిల్లా సరిహద్దు మండలాల్లో మద్యం కొనుక్కొని పోతున్నారు. దీంతో అక్కడి వైన్ షాపుల్లో స్టాక్ ను ఎక్కువ రేటుకు బెల్టు షాపులకు తరలిస్తూ షాపుల నిర్వాహకులు భారీగా సంపాదిస్తున్నారు. స్థానికంగా ఎక్సైజ్ సిబ్బందిని, పోలీసులను మేనేజ్ చేస్తూ ఈ దందా నడిపిస్తున్నారు. దీనిపై వరుస కంప్లయింట్లు రావడంతో ఉన్నతాధికారులు అలర్ట్​ అయ్యారు.

వైన్​షాపుల్లో ఎమ్మార్పీకే..

సత్తుపత్తి, వేంసూరు, ఎర్రుపాలెం, మధిర, చింతకాని, వైరాతో పాటు ఇంకొన్ని మండలాల్లోని వైన్ షాపులపై కొద్ది నెలల నుంచి వరుసగా ఇవే కంప్లయింట్స్ వస్తుండడంతో ఎక్సైజ్ పోలీసులు చర్యలు మొదలు పెట్టారు. షాపులో సరిగ్గా స్టాక్ పెట్టకపోవడం, బెల్టు షాపులను ప్రోత్సహించడం, ఎమ్మార్పీ కంటే ఎక్కువ తీసుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్న షాపుల లైసెన్స్ దారులను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో జిల్లాలో లైసెన్స్ దారులు సిండికేట్ గా ఏర్పడి స్టాక్  తెప్పించుకోకుండా సహాయ నిరాకరణ చేశారు. మద్యం అమ్మకాలపై టార్గెట్ లు పెడుతూ, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అంటూ మొండికేశారు. తాము ఇప్పటికే ప్రజాప్రతినిధులకు, ఆఫీసర్లకు మామూళ్ల రూపంలో ముట్టజెప్పామని, ఎక్కువ రేటుకు అమ్మకపోతే లాభాలు ఎలా వస్తాయంటూ ఉన్నతాధికారులతో వాగ్వాదానికి కూడా దిగినట్టు తెలుస్తోంది. అయినా దసరా, దీపావళి పండుగలు రావడం, లైసెన్స్ రద్దు చేస్తామనే ఉన్నతాధికారుల వార్నింగ్ తో చివరకు తలొగ్గారు. 80 శాతం షాపుల్లో ఇప్పుడు ఎమ్మార్పీకి మద్యం అమ్ముతుండగా, అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఎమ్మార్పీకే కస్టమర్ కు మద్యం అందాలంటూ ఆఫీసర్లు తీసుకున్న చర్యల ప్రభావం లిక్కర్ సేల్స్ పై పడినట్టు కనిపిస్తోంది. సరిహద్దు ఏరియాలో ఉన్న షాపుల్లో అమ్మకాలు కనిపిస్తున్నా, ఖమ్మం–2, కారేపల్లి లాంటి చోట్ల సేల్స్ తగ్గాయని అధికారులు చెబుతున్నారు.

జీరో ఎక్సైజ్ క్రైమ్ రేట్ లక్ష్యం

ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు మద్యం అమ్ముతున్నారని కంప్లైంట్ వస్తే కఠినంగా వ్యవహరిస్తున్నాం. రూరల్ ప్రాంతాల్లోని ప్రతి షాపు దగ్గర ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ఎక్సైజ్ సిబ్బంది ఒకరిని డ్యూటీలో నియమిస్తున్నాం. ర్యాండమ్ గా డ్యూటీలో ఉన్న సిబ్బందికి వీడియో కాల్స్ చేసి ఎమ్మార్పీకి అమ్ముతున్నారా.. లేదా అనేది కస్టమర్లతో మాట్లాడి తెలుసుకుంటున్నాం. జిల్లాలో ఎక్సైజ్ క్రైమ్ రేట్ ను జీరో చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

–  సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్