కల్తీ మద్యం తయారుచేస్తున్న వైన్ షాప్ సీజ్

కల్తీ మద్యం తయారుచేస్తున్న వైన్ షాప్ సీజ్

కల్తీ మద్యం తయారుచేస్తున్న ఓ మద్యం దుకాణంను ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు. కస్టమర్స్ తోపాటు ఎక్సైజ్ శాఖను, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న అమరావతి వైన్స్ అనే షాపును సీజ్ చేసి షాపు యజమానిని అరెస్ట్ చేశారు. అమరావతి ప్రాంతంలోని తాడికొండ మండలం అనంతవరంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ దాడులు జరిపారు. అనంతవరంలోని అమరావతి వైన్స్ లో  ప్రతి మద్యం బాటిల్ నుంచి 30 మిల్లీ లీటర్ల మద్యం తీసి మళ్ళీ దానిలో నీటితో నింపుతూ అవినీతికి  పాల్పడుతున్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు చేసి.. ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

షాపు యజమాని సత్యనారాయణ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు  ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ ఆదిశేషు మీడియాకి తెలిపారు. నిందితులంతా మాచర్లకు చెందిన వారని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ మద్యం విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని, వీరికి కేటాయించిన లైసెన్స్ కూడా రద్దు చేస్తామని అన్నారు. ఈ సోదాల్లో మంగళగిరి ఎక్సైజ్ సిఐ బాలయ్య, ఎస్సై కృష్ణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు