మీటింగ్​లు పెట్టి వైన్స్​ అప్లికేషన్లు పెంచాలి : మంత్రి శ్రీనివాస్​గౌడ్​

మీటింగ్​లు పెట్టి వైన్స్​ అప్లికేషన్లు పెంచాలి :   మంత్రి శ్రీనివాస్​గౌడ్​

హైదరాబాద్, వెలుగు:  వైన్స్​ టెండర్లకు అప్లికేషన్లు పెంచేందుకు మీటింగులు పెట్టాలని అధికారులను ఎక్సైజ్​ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ ఆదేశించారు. జిల్లాలోని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయా జిల్లాల్లో రియల్ ఎస్టేట్, సిమెంట్, ఫార్మా , వస్త్ర తదితర వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించి, వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీని వివరించాలని ఆయన సూచించారు. ఫలితంగా వైన్స్​కు ఎక్కువ అప్లికేషన్లు వచ్చి రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. 

ఆదివారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు ఆఫీసులో  ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. తక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాలకు ప్రత్యేక అధికారులను పంపుతున్నామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైతే తక్కువ దరఖాస్తులు వస్తున్నాయో  అక్కడ పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. తక్కువ వచ్చిన చోట్ల, సిండికేట్​ అయిన ప్రాంతాల్లో గడువు ముగిసిన తర్వాత మళ్లీ అప్లికేషన్లకు తేదీ పెంచి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 

టెండర్లు దాఖలు చేసేందుకు ఎవరైనా సిండికేట్​గా ఏర్పడినా,  దరఖాస్తులు సమర్పించుకుండా ఎవరైనా అడ్డుకున్నా వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గౌడ్​, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మద్యం దుకాణాల దరఖాస్తు కోసం కుల ధ్రువీకరణ పత్రం, ఏజెన్సీ సర్టిఫికెట్ లేకపోతే సెల్ఫ్ అఫిడవిట్లను అంగీకరించాలన్నారు. అప్లికేషన్ల విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నా 1800 425 2523 టోల్ ఫ్రీ నంబర్​ను సంప్రదించాలని సూచించారు.

వచ్చే నెల 8న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్​ స్టార్​ స్పెక్టకల్​ షో

సెప్టెంబర్ 8న హైదరాబాద్​ గచ్చిబౌలి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్​ స్టార్​ స్పెక్టకల్​ షో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్​ను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, ప్రిన్సిపల్​ సెక్రటరీ శైలజ రామయ్యార్, స్పోర్ట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్  ఆవిష్కరించారు. దేశంలోనే రెండోసారి జరుగుతున్న ఈ కార్యక్రమంలో అంతర్జాతీయంగా పేరు ఉన్న 28 మంది డబ్ల్యుడబ్ల్యూఈ క్రీడాకారులు పాల్గొంటారని మంత్రి చెప్పారు.