వింగ్స్ ఇండియా షురూ .. బేగంపేట ఎయిర్ పోర్టులో ఏవియేషన్ షో

వింగ్స్ ఇండియా షురూ ..  బేగంపేట ఎయిర్ పోర్టులో ఏవియేషన్ షో

హైదరాబాద్, వెలుగు: ఆకాశంలో అద్భుత విన్యాసాల కు, వివిధ రకాల విమానాల ప్రదర్శనకు బేగంపేట ఎయిర్​పోర్టు మరోసారి వేదికైంది. ‘వింగ్స్ ఇండియా–2024’ ఏవియేషన్ షో గురువారం ప్రారంభమైంది. రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ ఎగ్జిబిషన్​ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్​సివిల్ ఏవియేషన్, ఎయిర్​పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్​ఇండియన్​ చాంబర్​ఆఫ్ ​కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ షో జరగనుంది. 106 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు, 5 వేల మంది బిజినెస్ విజిటర్స్, వివిధ దేశాల నుంచి లక్ష మంది సందర్శకులు, ప్రపంచవ్యాప్తంగా200 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటున్నారు. చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, 21 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి. 

రెండ్రోజులు సందర్శకులకు చాన్స్.. 

ఈ ఏవియేషన్​ షోలో మొదటి రెండ్రోజులు వ్యాపార వేత్తలు, దేశవిదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. మిగ తా రెండ్రోజులు (శని, ఆది) సాధారణ ప్రజలను అనుమ తిస్తారు. బుక్​మైషో ద్వారా రూ.750 పెట్టి, టికెట్​బుక్​చేసుకోవాల్సి ఉంటుంది. మూడేండ్లు పైబడినోళ్లందరూ టికెట్ తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. అయితే 30 అడుగుల దూరం నుంచి మాత్రమే విమానాలకు చూసేందుకు వీలుంటుంది. సికింద్రాబాద్​లోని బైసన్​ పోలో గ్రౌండ్స్, ఎస్పీ రోడ్​లోని వెస్లీ బాయ్స్​హాస్టల్ గ్రౌండ్ లో పార్కింగ్​ సదుపాయం కల్పించారు. పార్కింగ్​ఏరియా నుంచి ఎయిర్​పోర్టుకు ఫ్రీగా షటిల్​బస్సులు నడుపుతారు. 

ప్రతిరోజూ విన్యాసాలు.. 

ఈ షోలో భాగంగా ఇండియన్​ ఎయిర్​ఫోర్స్ కు చెందిన సారంగ టీమ్ ప్రతిరోజూ సాయంత్రం 4:15 గంటల నుంచి 5 గంటల దాకా విన్యాసాలు చేస్తుంది. అలాగే దేశవిదేశాలకు చెందిన 21​ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్​777 ఎక్స్​ను దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్​పోర్టులో ప్రదర్శిస్తున్నారు.