ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి

ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి

ఎన్నికల్లో గెలవడం అనేది ఓ అదృష్టమన్నారు మంత్రి ఈటల రాజేందర్.  గెలిచిన వారందరిలో కొందరే ప్రజల మనసులో స్థానం సంపాధించుకుంటారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ గా తక్కలపల్లి రాజేశ్వరరావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు. జమ్మికుంట ప్రజలకు తాగు నీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజురాబాద్ కు 50, జమ్మికుంట కు 40 కోట్లు మొదటగా మంజూరు చేసుకొని జీవో మనమే తెచుకున్నామని తెలిపారు. తన మంత్రి పదవి ముగుస్తుందనగా హుజురాబాద్ కు 40 కోట్లు, జమ్మికుంట కు 40 కోట్లు మంజూరు చేశానని…అయితే ఆ డబ్బులు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అంతేకాదు సపాయి కార్మికుల కోసం ఈ రెండు మున్సిపాలిటీల్లో డబ్బులు తెచ్చి డిపాజిట్ చేయించిన ఘనత మన ప్రభుత్వానిదనన్నారు.

ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పాలక వర్గం ఉండాలన్న మంత్రి ఈటల..ఓట్ల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పేద కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందిచేలా జమ్మికుంటలో త్వరలోనే విద్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్య సౌకర్యాల కొరత లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు.

హుజురాబాద్, జమ్మికుంట రెండు నగరాలను హైదరాబాద్, సికింద్రాబాద్ లా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్న ఈటల.. గ్రూపు రాజకీయాలు, వ్యత్యాసాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పాలకవర్గాన్ని కోరారు.