పిల్లలకు వింటర్ డైట్

పిల్లలకు వింటర్ డైట్

కంటికి ఏది నచ్చితే అదే తింటాం అంటారు పిల్లలు. అయితే చలికాలంలో అలా ఏది పడితే అది తినకూడదు. “ఈ సీజన్‌‌లో జంక్ ఫుడ్ తింటే పిల్లలకు లేనిపోని సమస్యలొస్తాయి. జలుబు, దగ్గు, ఆస్తమా, వైరల్ ఇన్ఫెక్షన్ల లాంటివి ఎక్కువగా వచ్చే సీజన్ కూడా ఇదే.  అందుకే చలికాలం పిల్లల ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి”అంటున్నారు డాక్టర్లు. మరి ఈ సీజన్‌‌లో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి?

చలిని తట్టుకోవాలంటే శరీరానికి ఇమ్యూనిటీ అవసరం. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ. పైగా ఈ సీజన్‌‌లో బ్యాక్టీరియా చాలా త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. పిల్లలకు సరైన డైట్ ఇవ్వడం ద్వారా జలుబు, దగ్గు, గొంతునొప్పి, డ్రై స్కిన్ లాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

ఇమ్యూనిటీ పెరిగేలా..

చలికాలంలో పిల్లలకి  ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్‌‌తో పాటు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఫుడ్స్ కూడా ఇవ్వాలి.  పిల్లల ఆరోగ్యానికి బెల్లం చాలా మంచిది. బెల్లం తినడం వల్ల శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. అంతేకాదు శరీరం వెచ్చగా ఉంటుంది కూడా. వీటితో పాటు ఈ సీజన్‌‌లో పిల్లలు తినేఫుడ్‌‌లో ఉల్లిగడ్డలు, అల్లం, తేనె, బెల్లం, మొరంగడ్డ లేదా గెనుసు గడ్డలు లాంటివి ఉండాలి. ఇవి కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి.  రాగులు, జొన్నలు లాంటి మిల్లెట్స్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతూనే ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తాయి. అందుకే మిల్లెట్స్‌‌ను పొడి చేసి పాలలో కలిపి లేదా ఇడ్లీ లాంటివి చేసి పిల్లలకు పెట్టాలి. అలాగే బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి వేగించి పొడి చేసి పాలలో కలిపి ఇవ్వొచ్చు.

చలికాలంలో ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుందనుకుంటారు చాలామంది. కానీ, అది నిజం కాదు. ఫ్రూట్స్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి, ఇన్ఫెక్షన్లు ఇంకా త్వరగా తగ్గుతాయి. ముఖ్యంగా విటమిన్–సి ఎక్కువగా ఉండే  జామ, నిమ్మ, సంత్ర, ద్రాక్ష, పైనాపిల్ లాంటి సీజనల్ ఫ్రూట్స్ పిల్లల్లో జలుబు, దగ్గుని తగ్గిస్తాయి.  అయితే వీటిని వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాకుండా ఉదయం11 నుంచి సాయంత్రం 5 లోపు ఇవ్వడం బెటర్.

బయటి ఫుడ్ వద్దు

స్కూల్‌‌కు వెళ్లే పిల్లలు ఐస్‌‌క్రీమ్స్, క్యాండీస్‌‌, కేక్స్‌‌, చిప్స్, బిస్కెట్స్ లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. ఈ సీజన్‌‌లో బయటి ఫుడ్ ఎంత తగ్గిస్తే అంతమంచిది. పొడిగా, చల్లగా ఉండే ఫుడ్స్ వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గడమే కాకుండా డయేరియా, దగ్గు లాంటి సమస్యలొస్తాయి.  పిల్లలకు స్వీట్స్ లాంటివి ఇవ్వాలనుకుంటే బెల్లం, డ్రైఫ్రూట్స్‌‌తో చేసిన స్వీట్స్ ఇవ్వొచ్చు. ఫ్రెష్ గా చేసిన జ్యూస్‌‌లు ఇవ్వొచ్చు.

ఇన్ఫెక్షన్లు తగ్గాలంటే..

కొంతమంది పిల్లలకు తరచుగా జలుబు చేస్తుంటుంది. వింటర్ సీజన్ అంతా ముక్కు కారుతుంటుంది. ఇలాంటి వాళ్లకు అల్లం వేసి మరిగించిన నీటిని చల్లార్చి ఇవ్వాలి. పాలల్లో కూడా అల్లం కలిపి ఇవ్వొచ్చు. తాగే నీళ్లు గోరువెచ్చగా ఉండాలి.  నీళ్లలో వాము, తులసి కలిపి ఇస్తే జలుబు నుంచి త్వరగా రిలీఫ్ ఉంటుంది. పాలు తాగే పిల్లలకు పాలల్లో కొద్దిగా పసుపు కలిపి ఇస్తే ఇన్ఫెక్షన్ల నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది. 

శ్నాక్స్ ఇలా..

పిల్లలు సాయంత్రం శ్నాక్స్ తింటుంటారు. ఆ టైంలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, వాల్‌‌నట్స్‌‌ వంటివాటితో చేసిన శ్నాక్స్ ఇవ్వొచ్చు. బెల్లంతో చేసిన స్వీట్స్ కూడా పెట్టొచ్చు.  ఈ చల్లగాలుల్లో పిల్లలు వేడివేడిగా ఏదైనా తినాలని అడిగినప్పుడు సూప్స్‌‌ ఇవ్వాలి.  కాయగూరలు, పప్పులు, మొలకలతో రకరకాల సూప్స్‌‌ తయారుచేయొచ్చు. సూప్స్‌‌లో అల్లం, మిరియాలు వేస్తే ఇంకా మంచిది. అలాగే వేగించిన పప్పులు, మొక్కజొన్న, స్వీట్ కార్న్ లాంటివి కూడా మంచి శ్నాక్ ఆప్షన్స్.

ఇవి కూడా..

  • చలికాలంలో పిల్లలకు నాన్ వెజ్ పెట్టొచ్చా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. నాన్‌‌వెజ్‌‌లో పిల్లలకు పనికొచ్చే పోషకాలు చాలా ఉంటాయి. అందుకే వారానికి ఒకసారి నాన్‌‌వెజ్ పెట్టడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. 
  • ఈ సీజన్‌‌లో పిల్లలకు బ్రేక్‌‌ ఫాస్ట్ టైంలో నూనె లేకుండా చేసిన ఇడ్లీ, పోహా లాంటివి ఇవ్వాలి.  లంచ్, డిన్నర్ టైంలో  కాయగూరలు, క్యారెట్‌‌, ఆకుకూరలతో చేసిన కూరలు పెట్టొచ్చు. శ్నాక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చలికాలం పిల్లల చర్మం త్వరగా పాడవుతుంది. దానికి కారణం చర్మానికి హైడ్రేషన్ లేకపోవడమే. పిల్లలతో నీళ్లు ఎక్కువగా తాగించాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవ్వడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచొచ్చు. 
  • పిల్లలకు ఏవైనా సమస్యలున్నా, మందులు వాడుతున్నా.. అలాంటి వాళ్లు డాక్టర్ సలహా తీసుకొని డైట్ ప్లాన్ చేసుకోవాలి.