పెరిగిన వింటర్ ట్రావెల్..​ ఏటీఎఫ్​కు మస్తు డిమాండ్​

పెరిగిన వింటర్ ట్రావెల్..​ ఏటీఎఫ్​కు మస్తు డిమాండ్​
  • కరోనా పూర్వస్థాయికి అమ్మకాలు
  • గత నెల 6,32,600 టన్నుల అమ్మకం

న్యూఢిల్లీ:  విమాన ప్రయాణాలు అధికమవడంతో గత నెలలో జెట్ ఇంధనం (ఏటీఎఫ్​) కోసం భారతదేశం నుంచి  డిమాండ్ కరోనా పూర్వ స్థాయిలను అధిగమించిందని  కేంద్రం శుక్రవారం వెల్లడించింది.  ప్రభుత్వ ఆధీనంలోని మూడు ఇంధన రిటైలర్ల ఏవియేషన్ టర్బైన్ ఇంధన విక్రయాలు ఫిబ్రవరిలో 7.1 శాతం పెరిగి 6,32,600 టన్నులకు చేరుకున్నాయి. ఇది కరోనా సమయంలోని ఫిబ్రవరి 2022లో వినియోగం కంటే 55.2 శాతం ఎక్కువ.  

కరోనా వ్యాప్తికి ముందు ఫిబ్రవరి 2020లో డిమాండ్​ 6,32,100 టన్నులకుపైగా ఉంది. నెలవారీగా జెట్ ఇంధన విక్రయాలు 3.5 శాతం పెరిగాయని డేటా తెలిపింది. మార్చి 2020 చివరలో దేశం లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లోకి వెళ్ళిన వెంటనే ఇంధన అమ్మకాలు 60 శాతం వరకు పడిపోయాయి. ప్రయాణాలు,  వ్యాపారాలు ఆగిపోవడమే ఇందుకు కారణం. 2021 చివరిలో డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అన్ని అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభం కానందున ఏటీఎఫ్​ డిమాండ్​ కోవిడ్-పూర్వ స్థాయి కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు భారీగా విమానాల బయలుదేరడం,  ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, నెలవారీ వినియోగం కరోనా ముందు స్థాయి కంటే ఎక్కువగా ఉంది.

డీజిల్​ డిమాండ్​ తక్కువే

ఇంధన మార్కెట్‌‌‌‌లో 90 శాతం నియంత్రణలో ఉన్న మూడు ప్రభుత్వరంగ సంస్థల పెట్రోలు అమ్మకాలు ఫిబ్రవరిలో 7.2 శాతం పెరిగి 2.75 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అయితే డీజిల్ డిమాండ్ స్వల్పంగా 0.4 శాతం పెరిగి 6.55  మిలియన్ టన్నులకు చేరుకుంది.  ఈ జనవరిలో 2.59 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే నెలవారీ పెట్రోల్ విక్రయాలు  ఫిబ్రవరిలో 6.2 శాతం ఎక్కువ ఉన్నాయి. డీజిల్ డిమాండ్ కూడా జనవరిలో 6.11 మిలియన్ టన్నుల నుంచి నెలవారీగా 7.2 శాతానికి పెరిగింది. డీజిల్ భారతదేశంలో అత్యధికంగా వినియోగించే ఇంధనం. మొత్తం పెట్రోలియం ఉత్పత్తి వినియోగంలో దీని వాటా దాదాపు 40 శాతం ఉంటుంది. 

దేశంలో జరుగుతున్న మొత్తం డీజిల్ విక్రయాల్లో రవాణా రంగం వాటా 70 శాతం ఉంటుంది. గత రెండు నెలలుగా ఇంధన వినియోగం ఒక నెలలో పెరుగుతూ మరో నెలలో తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో పెట్రోలు వినియోగం ఫిబ్రవరి 2022 కంటే 20 శాతం ఎక్కువగా,  ఫిబ్రవరి 2020 కంటే 29.3 శాతం ఎక్కువ ఉంది. డీజిల్ వినియోగం ఫిబ్రవరి 2022లో 13.6 శాతం  ఫిబ్రవరి 2020తో పోలిస్తే 7.4 శాతం పెరిగింది. ఎల్పీజీ అమ్మకాలు కూడా ఫిబ్రవరిలో 6.6 శాతం పెరిగి 2.71 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.