
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ విప్రో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ మార్చి క్వార్టర్లో ఏడాది లెక్కన 25.9 శాతం పెరిగి రూ. 3,569.6 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీకి రూ. 2,834.6 కోట్ల లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ. 22,504.2 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 నాలుగో క్వార్టర్లో ఆదాయం రూ. 22,208.3 కోట్లతో పోలిస్తే ఇది 1.33 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా లాభం, ఆదాయం వరుసగా 6.43 శాతం 0.83 శాతం పెరిగాయి.
2025 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి లాభాలు 18.9 శాతం పెరిగి రూ. 13,135.4 కోట్లకు చేరుకున్నాయని విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో సంస్థ తన ఐటీ సేవల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం 2,505 మిలియన్ డాలర్ల నుంచి 2,557 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.
సీక్వెన్షియల్ ప్రాతిపదికన నిలకడైన కరెన్సీలో ఇది 1.5–-3.5 శాతం తగ్గింది. స్థూల ఆర్థిక అనిశ్చితి వల్ల క్లయింట్లు జాగ్రత్తగా ఉన్నారని విప్రో సీఈఓ శ్రీని పల్లియా అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రెండు మెగా డీల్స్సాధించామని, భారీ డీల్స్ పెరిగాయని అన్నారు.