
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్... టీమిండియా వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. జూన్‌లో సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగే ఏడు టీ20లకు అతన్ని టీమ్‌లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతగడ్డపై సఫారీలతో పాటు ఐర్లాండ్ టూర్లో ద్వితీయశ్రేణి జట్టును ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీనికితోడు ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ కోసం కూడా ఓ పేస్ బౌలింగ్ పూల్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఉమ్రాన్, నటరాజన్, అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలలు ఇదే ఫామ్, ఫిట్‌నెస్‌తో ఉంటే ఉమ్రాన్.. టీమిండియా గడప తొక్కడం అసాధ్యమేమీ కాకపోవచ్చు. గత టీ20 వరల్డ్‌కప్‌లో నెట్ బౌలర్‌గా పని చేసిన ఉమ్రాన్ ఐపీఎల్‌లో 152 కి.మీ. వేగంతో నిలకడగా బంతులు వేయడంతో పాటు వికెట్లు తీస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.