సర్కార్​ భూములు గాయబ్​!

సర్కార్​ భూములు గాయబ్​!
  • ధరణి అడ్డాగా అటువి ఇటు.. ఇటువి అటు మార్చి కాజేసిన అక్రమార్కులు
  • రైతుల పట్టా ల్యాండ్స్ ప్రభుత్వ భూములుగా.. 
  • ప్రభుత్వ భూములు పట్టా ల్యాండ్స్​గా పోర్టల్​లో తెలివిగా రికార్డు
  • ఏ భూమి ఎంత ఉందో లెక్క దొరక్కుండా వ్యూహం అమలు
  • ఇట్ల వేల ఎకరాల ప్రభుత్వ ల్యాండ్స్​కు ఎసరుపెట్టిన అక్రమార్కులు 
  • కమిటీ విచారణలో బయటికొస్తున్న గత పాలనలోని భూదందాలు
  • పూర్తి వివరాలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం.. త్వరలో శ్వేతపత్రం
  • ధరణిలో పత్తా లేని 40% దేవాదాయ, వక్ఫ్​ భూములు
  • 6 లక్షల ఎకరాల ఫార్టెస్ట్​ ల్యాండ్స్​దీ అదే పరిస్థితి

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ను ఆసరాగా చేసుకొని గత బీఆర్​ఎస్​ పాలనతో పక్కా స్కెచ్​తో ప్రభుత్వ భూములను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఒకవైపు రైతుల పట్టా భూములను ప్రభుత్వ భూములుగా నమోదు చేసి.. ఇంకోవైపు ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్​గా రికార్డ్​ చేశారు. దీంతో సర్కార్ భూముల్లో ఎంతవరకు పట్టా భూములుగా మారాయో లెక్క తెలియకుండా పోర్టల్​లో గోల్​మాల్​ చేశారు. ఈ భూ దందాను ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.

భూముల గోల్​మాల్​ కథలో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయో తేల్చేందుకు పూర్తి లెక్కలు తీస్తున్నది. ధరణిలో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారణ జరగడంతో రికార్డుల ప్రక్షాళనలోనూ భూములు కొల్లగొట్టి ఉంటారని ప్రభుత్వం అనుమానిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న గవర్నమెంట్​ ల్యాండ్స్​ ఎన్ని? ధరణి అమలులోకి వచ్చాక వాటి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వాటి లెక్క ఎంత?.. అనే దానిపై సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నది. వేల ఎకరాల ప్రభుత్వ భూములు గాయబ్​ అయినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాస్తవాలను నిగ్గుతేల్చి శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. 

భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో, ధరణి తీసుకువచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్లో భారీగా మార్పులు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. విస్తీర్ణంలో ఎవరికి అనుమానాలు రాకుండా.. అసలు లెక్కలపై స్పష్టత కూడా రాకుండా ఉండేలా వ్యవహారం నడిపినట్లు తెలిసింది. ధరణి పోర్టల్​లో రైతులకు చెందిన వేల ఎకరాల పట్టా భూములు..  ప్రభుత్వ భూములుగా నమోదు అయ్యాయి. వాస్తవానికి ఇవన్నీ పట్టా భూములు కాగా.. ధరణిలో ప్రభుత్వ భూములుగా చూపెడుతున్నాయి. అదే సమయంలో నిజమైన ప్రభుత్వ భూములు పట్టా భూములుగా నమోదయ్యాయి. ఇవి వందలు, వేల ఎకరాల్లో చూపిస్తున్నాయి.

ఇటు ప్రభుత్వ భూములు పట్టా భూములుగా నమోదు కావడం.. అటు పట్టా భూములు ప్రభుత్వ భూములుగా ఎంట్రీ అవ్వడంతో గోల్​మాల్​ జరిగినట్లు రాష్ట్ర సర్కార్​ గుర్తించింది. కావాలనే ఇటువి అటు.. అటువి ఇటు నమోదు చేసి పక్కా ప్లాన్​తోనే ప్రభుత్వ భూములు కొల్లగొట్టారని భావిస్తున్నది. ధరణిలో సర్కార్​ భూములుగా తప్పుగా నమోదైన వాటికోసం ఆ పట్టాదారులు మాడ్యుల్స్​లో అప్లై చేసుకుంటున్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ఎమ్మార్వో రిపోర్ట్​ ఆధారంగా మళ్లీ పట్టా భూములుగా నమోదు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ భూముల నుంచి పట్టా భూములుగా మారిన వాటిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఈ భూముల అమ్మకాలు కూడా జరిగిపోయినట్లు తెలుస్తున్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసినా.. తమకు తెలియకుండా తమ పేర్ల మీదికి వచ్చాయని చెప్పుకుని సైడ్ అవ్వాలని అక్రమార్కులు భావిస్తున్నట్లు  ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రభుత్వ భూములే కాకుండా వక్ఫ్​, దేవాదాయ, అటవీ శాఖ భూముల వివరాలు కూడా ఇలానే మారినట్లు పేర్కొన్నారు. 

గ్రామం, మండలం, జిల్లా వారీగా లెక్కలు 

ధరణి సమస్యల పరిష్కారానికి, అందులోని తప్పులను తేల్చేందుకు కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇతర శాఖల ఉన్నతాధికారులతో కమిటీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్భంగా అసలు ధరణి పోర్టల్​లో ఏ భూములు ఎంత చూపిస్తున్నాయి ? వాస్తవంగా ఎంత భూమి ఉండాలి ? గత ప్రభుత్వం ఏయే భూములను ప్రభుత్వ అవసరాలకు సేకరించింది? అందులో అటవీ, దేవాదాయ, వక్ఫ్​ ల్యాండ్స్​తో పాటు ఇతర ప్రభుత్వ భూములు ఏమున్నాయి?... అనే వివరాలను కమిటీ సరిపోల్చింది. ధరణిలో నమోదైన భూములకు.. రికార్డుల్లో ఉన్నవాటికి తేడాలు గమనించింది.

రికార్డులతో పోలిస్తే ధరణి పోర్టల్​లో దేవాదాయ, వక్ఫ్​ ల్యాండ్స్​ 40 శాతం తక్కువగా చూపిస్తున్నది. అదే ఫారెస్ట్​ ల్యాండ్స్​ 6 లక్షల ఎకరాలు తక్కువగా చూపిస్తున్నది. ఇంకా ఇతర ప్రభుత్వ భూములపై స్పష్టత లేదు. ఇదే విషయం సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో అసలు ప్రభుత్వ భూములపై పూర్తి లెక్కలు తీయాలని రాష్ట్ర సర్కార్​ డిసైడ్​ అయింది. మండలాలు, జిల్లాల వారీగా ఏయే గ్రామంలో అటవీ, దేవాదాయ, వక్ఫ్, ఇతర ప్రభుత్వ భూములు 2014 కంటే ముందు(తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు) ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి ? ఇప్పుడు ఎంత ఉన్నాయి ? ధరణి వచ్చాక ఎంత విస్తీర్ణంలో మార్పులు వచ్చాయి ? ఏయే సంవత్సరంలో ఎలా మారాయి ? ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఎంత అమ్మారు ? ఇతర అవసరాలకు ఏ మేరకు మారాయి?.. అనేవి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించే పనిలో పడింది. ఫలితంగా ఎవరు.. ఎక్కడ ఏ ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చుకున్నారో తేలిపోనుంది.