
- ఈ నెలలో కాకుంటే సెప్టెంబర్‌లోనే రీస్టార్ట్?
- ఆసియా కప్ టైమ్‌లోనే ఐపీఎల్ తర్వాతి మ్యాచ్‌లు!
- టీమిండియా..బంగ్లా టూర్, ఆసియా కప్ నిర్వహణ కష్టమే
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ ఇప్పట్లో తిరిగి మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సెప్టెంబర్‌లో ఇండియా ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్ నిర్వహణపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో ఈనెలలో సాధ్యం కాకపోవడంతో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరిగే విండోలో నిర్వహించే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరగాల్సి ఉంది. ఈ టోర్నీ కోసం సెప్టెంబర్‌లో 19 రోజుల విండో కేటాయించారు. ఆసియా కప్‌లో ఇండియా–పాక్ కనీసం రెండు సార్లు, ఫైనల్లోనూ తలపడే చాన్సుంది. అయితే, అద్భుతం జరిగితే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశం కనిపించడం లేదు.
ఆగస్టు చివరి వరకూ కష్టమే!
ఐపీఎల్ షెడ్యూల్ అస్తవ్యస్తమైన నేపథ్యంలో లీగ్‌ను పూర్తి చేసేందుకు బోర్డు ఇతర ఆప్షన్స్‌ను పరిశీలించాల్సి ఉంది. టీమిండియా జూన్ మొదటి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది, ఈ షెడ్యూల్‌ను మార్చడం సాధ్యం కాదు. ఆగస్టులో ఇండియా.. ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సిరీస్ జరిగే చాన్స్ లేదు. కాబట్టి ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఆగస్టు 5 నుంచి 31 వరకు ఇంగ్లండ్‌లో ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌లో ఐపీఎల్‌లో ఆడే చాలా మంది టాప్ టీ20 ఆటగాళ్లు పాల్గొంటారు. అదే సమయంలో ఆగస్టులో ఆస్ట్రేలియా–-సౌతాఫ్రికా మధ్య ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ జరుగుతుంది. ఈ కారణంగా ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరు. పైగా, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లైన రిలయన్స్, ఆర్‌పీఎస్జీ గ్రూప్‌లు ‘ది హండ్రెడ్’లో పెట్టుబడులు పెట్టాయి. కాబట్టి ఆగస్టు నెలాఖరు ఐపీఎల్‌కు అనుకూలంగా లేదు.
సెప్టెంబర్ బెస్ట్ ఆప్షన్
సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు ఐపీఎల్ నిర్వహణకు అనుకూలమైన విండోగా కనిపిస్తోంది. ఈ సమయంలో బీసీసీఐ వివిధ క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపి, ఆటగాళ్లను ఐపీఎల్ కోసం తిరిగి రప్పించొచ్చు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 22 వరకు విండీస్‌లో సీపీఎల్ జరగనుంది. ఇందులో వెస్టిండీస్ టాప్ ఆటగాళ్లు పాల్గొంటారు. అయితే సెప్టెంబర్ రెండో వారంలో చాలా మంది కరీబియన్ ఆటగాళ్లు ఐపీఎల్ జట్ల కోసం అందుబాటులోకి రావొచ్చు. ఇక, సెప్టెంబర్ 2 నుంచి 14 వరకు ఇంగ్లండ్, సౌతాఫ్రికా మధ్య ఆరు మ్యాచ్‌ల వైట్-బాల్ సిరీస్ షెడ్యూల్ చేశారు. బీసీసీఐకి ఈసీబీ, క్రికెట్ సౌతాఫ్రికాతో సత్సంబంధాలు ఉన్నందున ఐపీఎల్ జట్లకు ముఖ్యమైన ఆటగాళ్లను ఈ విండోలో రిలీజ్ చేయమని కోరవచ్చు. సెప్టెంబర్ చివర్లో టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్, సౌతాఫ్రికాతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత అక్టోబర్–-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో వైట్-బాల్ టూర్ ఉంటుంది. ఐపీఎల్‌ను డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సమయంలో ఆస్ట్రేలియా టాప్ క్రికెటర్లు యాషెస్ సిరీస్‌లో బిజీగా ఉంటారు. అలాగే కొంతమంది ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండరు.