అనాథలకు కరోనా సాయం అందలే!

అనాథలకు కరోనా సాయం అందలే!

మంచిర్యాల, వెలుగు: కరోనా మహమ్మారితో తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథలైన పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారికి ఏ లోటూ రాకుండా చూస్తామని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఆర్థికసాయం ఆలస్యమవుతోంది. చాలామందికి పీఎం కేర్​ఫండ్​ నుంచి అందించే రూ.10 లక్షలు ప్రాసెస్​లో ఉన్నాయి. డిజాస్టర్​ మేనేజ్​మెంట్​నుంచి చెల్లించే రూ.50 వేలు కొందరికే అందగా, మిగతా వాళ్లకు నెలలు గడుస్తున్నా రాలేదు. నెలకు రూ. 2 వేల చొప్పున ఇచ్చే స్పాన్సర్​షిప్​ డబ్బులు సైతం మూడు నాలుగు నెలల నుంచి ఆగిపోయినట్టు చెప్తున్నారు. దీంతో పిల్లల ఆలనాపాలన చూసుకుంటున్న బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పిల్లలు అమ్మమ్మ, నానమ్మల వద్ద పెరుగుతున్నారు. వాళ్లు ఓవైపు పేదరికం, మరోవైపు వయోభారంతో ఇబ్బందులు పడుతున్నారు. మేనమామ, చిన్నాన్న, పెద్దనాన్నల వద్ద ఉంటున్న చిన్నారులు వాళ్లకు భారంగా మారుతున్నారు.  


రాష్ట్రంలో కరోనా ఫస్ట్, సెకండ్​వేవ్​లలో ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. భార్యాభర్తలు చనిపోవడంతో వందల మంది పిల్లలు అనాథలయ్యారు. వాళ్లను కుటుంబీకులు, దగ్గరి బంధువులు అక్కున చేర్చుకున్నారు. కానీ పేదరికం, ఆర్థిక సమస్యలతో చాలామంది పిల్లల చదువులు ఆగిపోయాయి. భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. రాష్ర్టవ్యాప్తంగా 221 మందిని ఆఫీసర్లు గుర్తించి ఆర్థికసాయం కోసం ప్రపోజల్స్​ పంపించారు. 

నెలలు గడుస్తున్నా ఎదురుచూపులే

పేరెంట్స్​ఇద్దరూ చనిపోయిన పిల్లలకు సెంట్రల్​గవర్నమెంట్​పీఎం కేర్​ఫండ్​నుంచి రూ.10 లక్షలు ప్రకటించింది. బాధిత పిల్లలకు18 ఏండ్లు నిండే నాటికి వాళ్ల బ్యాంక్​ అకౌంట్​లో ఏటా కొంత మొత్తాన్ని జమ చేస్తారు. 23 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ పైసలు తీసుకోవచ్చు. అయితే చాలామంది పీఎం కేర్​ఫండ్​ కోసం ఆలస్యంగా అప్లై చేసుకున్నారు. దీంతో కొంతమందికి మొదటి విడత డబ్బులు జమ కాగా, మిగతా వాళ్లకు ప్రాసెస్​లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. స్టేట్​గవర్నమెంట్​డిజాస్టర్​మేనేజ్​మెంట్​కింద రూ. 50 వేలు చెల్లిస్తుంది. వీటికోసం అప్లై చేసుకొని నెలలు గడుస్తున్నా రావడం లేదని అంటున్నారు. మంచిర్యాల జిల్లాలో ఐదుగురు అనాథలను గుర్తించి ప్రపోజల్స్​పంపగా ఇంతవరకు ఒక్కరికే రూ.50వేలు వచ్చాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. రాష్ర్ట ప్రభుత్వం ఆన్​లైన్​ డెత్ సర్టిఫికెట్లు సమర్పించాలనే కండిషన్​పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక విమెన్​ అండ్ ​చైల్డ్ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​ ద్వారా స్పాన్సర్​షిప్​ కింద నెలకు రూ.2వేలు అందిస్తారు. ఈ డబ్బులు అక్టోబర్, నవంబర్​వరకు బాగానే వచ్చినా.. మూడు నాలుగు నెలల నుంచి ఆగిపోయినట్టు చెప్తున్నారు. కొందరికి  స్కూల్ ఫీజులను ప్రభుత్వం  చెల్లించగా, మరికొందరికి దాతలు సాయమందించారు. 

మంచిర్యాల జిల్లాలో కరోనాతో తల్లిదండ్రులు చనిపోయిన ఐదుగురు అనాథ పిల్లలను గుర్తించారు. వీళ్లకు నిరుడు నవంబర్​ దాకా నెలకు రూ.2వేల స్పాన్సర్​షిప్​ అందగా, మూన్నెల్ల నుంచి ఆగిపోయింది. పీఎం కేర్​ ఫండ్​కు అప్లై చేసుకోగా ప్రాసెస్​లో ఉంది. డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ ఫండ్​ నుంచి రావాల్సిన రూ.50 వేలు మాత్రం ఒక్కరికే వచ్చాయి. 
    నిర్మల్​ జిల్లా సారంగాపూర్​ మండలంలోని జామ్​ గ్రామానికి చెందిన రాములు, భోజక్క దంపతులు కరోనాతో మృతి చెందడంతో వారి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయమూ అందలేదు. ఇద్దరు పిల్లల్లో ఒకరు మానసిక వికలాంగురాలు కావడంతో వారి పోషణకు అమ్మమ్మ ఇబ్బందులు పడుతోంది. 

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎర్రకుంటతండాకు చెందిన రామాంజనేయులు 8 నెలల కిందట కరోనాతో తల్లిని కోల్పోయాడు. ప్రస్తుతం మేనమామ దగ్గర ఉంటూ చింతలపాలెం జడ్పీ హైస్కూల్​లో టెన్త్​ క్లాస్​ చదువుతున్నాడు. ఇతనికి మొదటి నాలుగు నెలలు రూ.2వేల చొప్పున అందినప్పటికీ నవంబర్​ నుంచి పైసలు రావడం లేదు. జిల్లాలో తల్లిదండ్రులు కోల్పోయిన ముగ్గురు అనాథలను గుర్తించారు. వీరికి రూ.50 వేల సాయం కోసం అప్లై చేసి ఐదు నెలలు దాటుతున్నా రాలేదు. పీఎం కేర్​ ఫండ్​ కోసం ఇటీవలే అప్లై చేసుకున్నారు. 

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కుత్బుశపురం గ్రామానికి చెందిన ఆవుల సంజన(5) పేరెంట్స్​ నిరుడు కరోనా సెకండ్​ వేవ్​లో మరణించారు. వాళ్ల పాప అమ్మమ్మ వద్ద ఉంటూ అంగన్​వాడీ సెంటర్​లో చదువుతోంది. ప్రభుత్వ సాయం కోసం ఆఫీసర్లు కిందటేడాది జూన్​లో ప్రపోజల్స్ పంపారు. ఒక నెల గ్రాసరీ మాత్రమే అందించారు. కరోనా ఫండ్ ​కోసం అప్లై చేసినా రాలేదు. నెల కిందట పీఎం కేర్​ ఫండ్​ కోసం అప్లై చేసుకున్నారు. అది ప్రాసెసింగ్​లో ఉన్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు.  

కామారెడ్డి జిల్లా కేంద్రం పంచముఖి హనుమాన్​కాలనీకి చెందిన బీమారి రాజేశ్​కుమార్, స్రవంతి కరోనాతో 2020లో చనిపోయారు. వీరి ఇద్దరు బిడ్డలు వైష్ణవి(11), వర్షిత(7)ను నానమ్మ సిద్దమ్మ అన్నీ తానై పెంచుతోంది. ఆమె ఓ ఆఫీసులో పని చేసి నెలకు రూ.4 వేలు సంపాదిస్తోంది. వితంతు పింఛన్​ రూ.2వేలు వస్తాయి. ఈ సొమ్ముతో ఇద్దరు మనవరాళ్లను పోషించడానికి తిప్పలు పడుతోంది. వయసు మీదపడుతున్న తరుణంలో పిల్లల ఆలనాపాలన కోసం రోజంతా కష్టపడుతోంది.