
హార్టికల్చర్ పంటల సాగుకు అందని సాయం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారు నిర్ణయంతో పేద రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అందని ద్రాక్షగా మారింది. హార్టికల్చర్ పంటలన్నింటికీ డ్రిప్ సబ్సిడీ ఎత్తేసి ఒక్క పామాయిల్ పంటకే పరిమితం చేసింది. ఎక్కువ భూములుండి నాలుగేండ్ల తరువాత పంట వచ్చే ఆయిల్ పామ్ సాగు చేసే పెద్ద రైతులకే ఉపయోగపడుతోంది. కూరగాయలు, పండ్ల తోటలకు డ్రిప్ రాయితీ నిలిచిపోయి రైతులు సొంత ఖర్చులతో వాటిని సాగు చేయలేక పోతున్నారు. ఫలితంగా కూరగాయలు, పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి.
దరఖాస్తులు తీసుకుంటలేరు
హార్టికల్చర్ పంటలు సాగు చేసే రైతులు డ్రిప్ కోసం దరఖాస్తులు చేసుకుంటే సర్కార్ వారిని ఎంపిక చేసి సబ్సిడీతో పరికరాలను అందించేది. కానీ 2022–23లో డ్రిప్ కోసం లక్ష మంది రైతులు పెట్టుకున్న అప్లికేషన్లను సర్కార్ పక్కన పడేసింది. మెట్ట ప్రాంతాల్లో యాసంగిలో కూరగాయలు పండించే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్‌లు సబ్సిడీతో అందించి ఆదుకోవాల్సిన సర్కారు మొండి చేయి చూపించడంతో వారు ఈ పంటల సాగు మానేస్తున్నారు.
ఆయిల్‌పామ్‌కు అరకొరే
ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని 20 లక్షల ఎకరాలకు పైగా విస్తరించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్న ఆయిల్‌పామ్ సాగు బాధ్యతను, 10 ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. 2022–23లో 1.20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటి వరకు 15496 మంది రైతులు దాదాపు 60,584 ఎకరాల్లో సాగు చేశారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే ఈ పంట సాగు ఖర్చులను వెచ్చిస్తోంది. రాష్ట్రం గతేడాది బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించినా పైసా విడుదల చేయలేదు. దీంతో ఆయిల్‌పామ్ సాగు రైతులకు సైతం సరిగ్గా డ్రిప్ సౌకర్యం కల్పించలేక పోతున్నారు. ఇప్పటి వరకు కేటాయించిన నిధులు అన్ని పంటలకు బంద్ చేసి ఆయిల్‌పామ్‌కు కేటాయించినా.. దానికి కూడా పూర్తి స్థాయిలో ఫలితం అందక్కడం లేదు.
సబ్సిడీ కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులు
మెట్ట ప్రాంతాల్లో హార్టికల్చర్ పంటల సాగు కోసం రాయితీతో డ్రిప్ అందిస్తారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సర్కారు అందించేది. బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. డ్రిప్ కోసం ఎకరానికి దాదాపు రూ.40 వేల వరకు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో ఏటా లక్ష ఎకరాల్లో హార్టికల్చర్ పంటలకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందేవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ సబ్సిడీ కోసం రూ.300 కోట్ల నిధులు కేటాయించేవి. ఇప్పుడు హార్టికల్చర్ పంటలకు డ్రిప్ సబ్సిడీ ఎత్తేయడంతో రైతులు వేలకు వేలు ఖర్చు చేసి పరికరాలు కొనలేక ఆ పంటల సాగును వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది.