ఫోర్త్ వేవ్ భయంతో మూడో డోసు వేయించుకుంటున్న జనం

ఫోర్త్ వేవ్ భయంతో మూడో డోసు వేయించుకుంటున్న జనం
  • రోజూ 7 వేల మందికి బూస్టర్​ టీకా
  • పది రోజుల క్రితం వరకూ 4 వేల మందికే
  • ఫ్రీగా వేస్తే ఇంకెక్కువ మంది వేస్కుంటరంటున్న డాక్టర్లు

హైదరాబాద్​, వెలుగు: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, జూన్​లో మరిన్ని పెరిగే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో జనాలు వ్యాక్సిన్​ బూస్టర్​ డోసు వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో పది రోజుల క్రితం వరకూ రోజూ సగటున 4 వేల మంది మాత్రమే బూస్టర్​‌‌ డోసు తీసుకోగా, ఇప్పుడు రోజూ 7 వేల నుంచి 7,500 మంది బూస్టర్​ డోసు వేయించుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలో 60 ఏండ్ల లోపున్న వాళ్లకు బూస్టర్​ డోసు వేసుకునేందుకు అవకాశం లేకపోవడం.. కేవలం ప్రైవేట్​ ఆస్పత్రులకే అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య తక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు.

సర్కార్​ దవాఖాన్లలో ఫ్రీగా బూస్టర్​ డోస్​ వేస్తే మరింత ఎక్కువ మంది వ్యాక్సిన్​ వేయించుకునే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం 60 ఏండ్లు దాటినోళ్లకే సర్కార్​ దవాఖాన్లలో ఫ్రీగా బూస్టర్​ డోసు వేస్తున్నారు. అయితే, 60 ఏండ్ల లోపున్నోళ్లకు ప్రభుత్వ దవాఖాన్లలోనూ బూస్టర్​ డోసు వేసేందుకు పర్మిషన్​ ఇవ్వాల్సిందిగా ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి హరీశ్​రావు లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 
పర్మిషన్​ ఇస్తేనే ఫాయిదా
రాష్ట్రంలో ఇప్పటిదాకా 6.84 లక్షల మంది బూస్టర్​ డోస్​ వేసుకున్నారు. సెకండ్​ డోసు తీసుకుని 9 నెలలు గడిచి, బూస్టర్​‌‌ డోసుకు అర్హులైనోళ్లు ఇంకా 28.04 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం వద్ద 40.99 లక్షల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి. బూస్టర్​‌‌ డోసుకు ప్రభుత్వ దవాఖాన్లకు పర్మిషన్​ ఇవ్వకపోతే, ఇందులో చాలా డోసులు ఎక్స్​పైరీ అయ్యే అవకాశం ఉంది. దీంతో త్వరలోనే బూస్టర్​ డోసుకు పర్మిషన్​ ఇచ్చే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. 
త్వరలోనే పిల్లలకు టీకా
రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన వాళ్లంతా రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారు. 15–17 ఏండ్ల వయసు టీనేజర్లలో 91 శాతం మంది ఫస్ట్​ డోసు, 77 శాతం మంది సెకండ్​ డోసు తీసుకున్నారు. 12 నుంచి 14 ఏండ్ల పిల్లల్లో ఫస్ట్​ డోస్​ 86 శాతం, సెకండ్​ డోస్​ వ్యాక్సినేషన్​ 33 శాతం పూర్తయింది. 5 నుంచి 11 ఏండ్ల పిల్లలకు టీకాలిచ్చే విషయంపై డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే కొన్ని వ్యాక్సిన్లకు అనుమతినిచ్చింది. దీనిపై ఓ వారం రోజుల్లో కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి గైడ్​లైన్స్​ వచ్చే అవకాశం ఉందని, ఆ వెంటనే పిల్లలకు టీకాలు వేస్తామని అధికారులు చెప్తున్నారు. 
అందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలె
కరోనాను ఎదుర్కొంనేందుకు ఆయుధం వ్యాక్సిన్​. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్​ తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే పెద్ద వాళ్లంతా రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకున్నారు. పిల్లల వ్యాక్సినేషన్​ కొనసాగుతోంది. ఇంకా ఎవరైనా వ్యాక్సిన్​ తీసుకోకుంటే వెంటనే వేసుకోవాలి. అర్హులైనోళ్లు బూస్టర్​ డోసు వేయించుకోవాలి. సర్కార్​ దవాఖాన్లలో బూస్టర్​‌‌ డోసుకు అనుమతివ్వాలని ఇటీవలే రాష్ట్ర సర్కార్​.. కేంద్రాన్ని కోరింది. పర్మిషన్​ వచ్చిన వెంటనే ప్రభుత్వ సెంటర్లలో కూడా బూస్టర్​ డోసును ప్రారంభిస్తం. ‑ డాక్టర్​ శ్రీనివాసరావు, పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్

 

ఇవి కూడా చదవండి

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!

దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె